పేదల సంక్షేమమే బీజేపీ మూల సిద్ధాంతం: మోదీ
కొజికోడ్: 'ఒకరు ఉన్నతంగా ఉండి, మరొకరు కుంగిపోయి ఉంటే.. పైనున్నవాళ్లు తమను తాము తగ్గించుకుని కిందున్నవాళ్ల చెయ్యి పట్టుకుని నడిపించాలి. సమాజంలో అసమానతలు పోవాలంటే అనుసరించాల్సిన విధానమిదే అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉద్భోధించారు. భారత్ లో ముస్లింలు మిగతావారితో సమానంగా జీవించాలని ఆయన కోరుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు బీజేపీ కార్యకర్తలంతా పునరంకితం కావాలి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దన్ దయాళ్ శత జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం కొజికోడ్(కేరళ)లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు.
అప్పట్లో ఇతర పార్టీల్లోనూ మంచి వ్యక్తులు ఉండేవారని, అయితే బీజేపీని స్థాపించినవాళ్లు ఇతర పార్టీల్లోని వారికంటే మంచివాళ్లని, పార్టీ సిద్ధాంతాలుగానీ, విధానాలుగానీ పేదలకు మేలు చేసేలా ఉండటమే అందుకు నిదర్శనమని నరేంద్ర మోదీ అన్నారు. పేదల సంక్షేమమే బీజేపీ మూల స్వరూంమని, తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజా సేవ చేయడానికేనని, సంపాదన కోసం కాదని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రక్రియ మారాలి
సువిశాల భారతావనిలో సుదీర్ఘంగా సాగే ఎన్నికల ప్రక్రియ మారాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఎన్నికలు జరుగుతుండటమే దీనికి కారణం. అందుకే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలని బీజేపీ కోరుతోంది. తద్వారా సామాన్యుడికి మరింత మేలు జరగడమేకాక ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని మేం నమ్ముతున్నామని పేర్కొన్నారు.
హింసోన్మాదులపై నిప్పులు
'బీజేపీ బీజేపీ కార్యవర్గ సమావేశంలో భాగంగా గడిచిన మూడు రోజులుగా కొజికోడ్ లో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న నేను కొందరు కార్యకర్తలను కలిశాను. ప్రత్యర్థులు తమపై జరుపుతున్న పాశవిక దాడుల గురించి వాళ్లు వివరించారు. ప్రజాస్వామ్యంలో హింసోన్మాదులకు చోటులేదు. దమ్ముంటే ప్రజాస్వామ్య యుతంగా ప్రజల కోసం పోరాడాలికానీ మా కార్యకర్తపై దాడులు చేయడం హేయం'అని ప్రధాని మోదీ అన్నారు. కేరళలో బీజేపీ కార్యకర్తపై జరుగుతోన్న దాడులపై రచించిన 'ఆహుతి' పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. 'ఆహుతి'పై అన్ని రాష్ట్రాల్లో చర్చ జరగాలి. కేరళ కార్యకర్తలకు దేశమంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు, వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.