సుచిత్రాసేన్ ఇకలేరు
కోల్‌కతా: తొలితరం ప్రఖ్యాత సినీ నటి సుచిత్రాసేన్ శుక్రవారం కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. బెంగాలీ సినీ రంగపు గ్రెటా గార్బో (ప్రఖ్యాత హాలీవుడ్ నటి)గా పేరుగాంచిన సుచి త్రాసేన్ దాదాపు 60 సినిమాల్లో నటించారు. 1950ల నుంచి 1970ల వరకూ వెండితెర కథానాయకిగా వెలుగొందారు. దేవదాస్, ఆంధీ వంటి హిందీ సినిమాలు; సాత్ పాకే బంధా, అగ్నిపరీక్ష, సప్తపది, దీప్ జ్వలే జాయ్ వంటి బెంగాలీ సినిమాల్లో నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఆమె కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురికాగా డిసెంబర్ 23వ తేదీన బెల్లే వ్యూ క్లినిక్‌లో చికిత్స కోసం చేర్చించారు. శుక్రవారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. దక్షిణ కోల్‌కతాలోని కియోరాటాలా శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.
- దేవదాస్ సినిమాలో నటనకు సుచిత్రాసేన్ జాతీయ అవార్డును అందుకున్నారు. సాత్ పాకే బంధా సినిమాలో నటనకు 1963 మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించారు.
- 1978లో విడుదలైన ప్రణోయ్ పాషా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సుచిత్రాసేన్ ఏకాంతంలోకి వెళ్లిపోయారు. గత మూడు దశాబ్దాలుగా అతికొద్ది మంది సన్నిహితులతో తప్ప ఎవరితోనూ కలవలేదు.
- బహిరంగ వేదికపైకి రావటం ఇష్టం లేనందువల్ల 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా సుచిత్ర తిరస్కరించారనే ప్రచారం ఉంది.
- సుచిత్రాసేన్ ఏకైక కుమార్తె మూన్‌మూన్‌సేన్, మనుమరాళ్లు రియాసేన్, రైమాసేన్లు కూడా సినీ తారలే.
- సుచిత్రాసేన్ మరణ వార్త వినగానే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు.
- సుచిత్రాసేన్ వెండితెరపై పాత్రలకు ప్రాణం పోశారని.. ఆమె మరణంతో సినీ రంగం ఒక గొప్ప నటిని కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ.. మూన్మూన్సేన్కు పంపిన ఒక సంతాపం సందేశంలో నివాళులర్పించారు.