జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థుల హవా
మెయిన్ టాప్-20లో నాలుగు ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 20 ర్యాంకు ల్లో నాలుగింటిని చేజిక్కించుకున్నారు. జేఈఈ మెయిన్ ర్యాంకులను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) గురువారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీకి చెందిన దీపాన్షు జిందాల్ టాపర్‌గా నిలవగా ప్రత్యూష్ మైని 2, రాజేశ్ బన్సాల్ 3వ ర్యాంకులు సాధించారు. ఇక రాత పరీక్షలో దేశంలోనే అత్యధికంగా 345 మార్కులు సాధించిన తాళ్లూరి సాయితేజకు జేఈఈ మెయిన్‌లో 6వ ర్యాంకు లభించింది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆయనకు ఐదో ర్యాంకు రావడం తెలిసిందే. రాత పరీక్షలో 335 మార్కు లు సాధించిన గుంటూరుకు చెందిన ఎం.ప్రశాంత్‌రెడ్డికి 5వ ర్యాంకు వచ్చింది. మొత్తం మీద టాప్ 1,000 ర్యాంకుల్లో 853 అబ్బాయిలకే దక్కడం విశేషం!
11వ ర్యాంకు సాధించిన ర్యాలి గాయత్రి బాలికల్లో టాపర్‌గా నిలిచినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా గత ఏప్రిల్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 11.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. తె లుగు రాష్ట్రాల నుంచి 1,32,648 మంది హాజరవగా వీరిలో తెలంగాణ నుంచి 59,622, ఆంధ్రప్రదేశ్ నుంచి 73,226 మంది ఉన్నారు. వీళ్లలో దాదాపు 6 వేల మందికి ఎన్ఐటీల్లో సీట్లు లభించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టు (ఏఏటీ)లోనైతే టాప్ 10లో తెలుగు విద్యార్థులే 8 ర్యాంకులను సాధించారు! వారికి 1,2 3, 4, 6, 7, 8, 9 ర్యాంకులు దక్కాయి. వాస్తవానికి జేఈఈ మెయిన్ టాప్ 20 ర్యాంకర్లలో తెలంగాణ విద్యార్థులే 6 మంది వరకు ఉంటారని విద్యాసంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇంటర్ స్కోర్‌కు 40 శాతం, జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ ఇచ్చి, పర్సంటైల్ నార్మలైజేషన్ చేసి సీబీఎస్ఈ ఈ ర్యాంకులను ప్రకటించింది.
69,790 సీట్ల భర్తీ
జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులు వెలువడటంతో ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 28వ తేదీ దాకా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు (చాయిస్ ఫిల్లింగ్) ఇచ్చుకునేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ చర్యలు చేపట్టింది. 30న మొదటి దశ సీట్లను కేటాయించనుంది. మొత్తం నాలుగు దశల్లో సీట్ల కేటాయింపు, ప్రవేశాలు చేపడతారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా 23 ఐఐటీలు, ఒక ఐఎస్ఎం, 31 ఎన్ఐటీలు, 18 ఐఐఐటీలు, మరో 18 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో మొత్తంగా 69,790 సీట్లను భర్తీ చేస్తారు.
తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ ర్యాంకర్లు
ర్యాంకు పేరు
5 ఎం.ప్రశాంత్‌రెడ్డి
6 తాళ్లూరి సాయితేజ
11 ర్యాలి గాయత్రి
18 జయంత్‌రెడ్డి
ప్రవే శాల షెడ్యూలు...
నేటి నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు
27న సీట్ల నమూనా కేటాయింపు
30న తొలి విడత సీట్ల కేటాయింపు
నాలుగైదు రోజులపాటు సీట్ల యాక్సెప్టెన్స్‌కు అవకాశం
తర్వాతి రోజున భర్తీ అయిన సీట్లు, ఖాళీ సీట్ల వివరాల ప్రకటన, రెండో దశ సీట్ల కేటాయింపు
సీట్ల యాక్సెప్టెన్స్/ఉపసంహరణకు రెండు లేదా మూడు రోజుల సమయం
రెండో దశ సీట్ల యాక్సెప్టెన్సీ తర్వాత భర్తీ అయిన, మిగిలిపోయిన సీట్ల వివరాల ప్రకటన
తర్వాతి రోజున మూడో దశ సీట్ల కేటాయింపు
సీట్ల యాక్సెప్టెన్స్/ఉపసంహరణకు రెండు లేదా మూడు రోజుల సమయం
మూడో దశ సీట్ల యాక్సెప్టెన్సీ తర్వాత భర్తీ అయిన, మిగిలిపోయిన సీట్ల వివరాల ప్రకటన
తర్వాతిరోజున నాలుగో దశ సీట్ల కేటాయింపు
తర్వాత ఒకటి లేదా రెండు రోజులు సీట్ల యాక్సెప్టెన్స్ (నాలుగో దశ)