ఢిల్లీలో దీపావళి కాలుష్యం.. తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దీపావేళ వేళ బాణాసంచా నిషేధం అమలు విషయంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో బాణాసంచా కాల్చడంపై ఉన్న నిషేధం అమలుకావడం లేదని తెలిపింది. బాణాసంచా కాల్చడం వల్ల దీపావేళ తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించిందని తెలిపింది. ఈ ఏడాది బాణాసంచా వినియోగంపై పూర్తి నిషేధం అమలుకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆప్ ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వచ్చే ఏడాది నిషేధానికి సంబంధించి కూడా ప్రతిపాదిత చర్యలను తెలపాలని జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన ధర్మాసనం పేర్కొంది.కాగా దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల ఢిల్లీ వాసులు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ(గాలి నాణ్యత సూచీ) 400 తీవ్రమైన మార్కును దాటడంతో సోమవారం గాలి నాణ్యత అధ్వాన్నంగా మారైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఢిల్లీలో కాలుష్య స్థాయి గరిష్ఠ స్థాయికి చేరుకుందని తెలిపింది. గత రెండేళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక దీపావళి నాటికి పంట వ్యర్థాల కాల్చివేతలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత పది రోజులలో పంట వ్యర్థాల దగ్దం కేసుల నమోదును తెలుపుతూ అఫిడవిట్లను దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఢిల్లీ పరిధిలో పొలాల దహనం కేసుల నమోదును తెలపాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది.