ఎలక్ట్రిక్ బస్సులతో ఆదాయం కూడ ఎక్కువే!
బెంగళూరుః ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని నివారించడానికే కాక, డీజిల్ బస్సుల కన్నా అత్యధిక లాభాన్ని చేకూరుస్తాయంటున్నారు పరిశోధకులు. ఎలక్ట్రిక్ బస్సులతో రోజుకు 27 శాతం రెవెన్యూ పెరగడమే కాక, డీజిల్ బస్సులకంటే 82 శాతం లాభాలను కూడ చేకూర్చి పెడతాయని తమ అధ్యయాల్లో కనుగొన్నారు.
వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా ఇటీవల మెట్రోపాలిటన్ నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మొదటిగా బెంగళూర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) తమ రవాణా అవసరాలను తగ్గించడంతోపాటు... డీజిల్ బస్సులతో ఏర్పడే వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక ప్రయత్నంగా విద్యుత్ బస్సులను ఆవిష్కరించింది. దేశంలోనే మొదటిసారి జీరో ఎమిషన్ తో కూడిన పూర్తి ఎయిర్ కండిషన్డ్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అర్బన్ ట్రాన్స్ పోర్ట్ కోసం ఎలక్ట్రానిక్ బస్సులపై జరిపిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) అధ్యయనాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అత్యధిక ఆదాయాన్నితెచ్చి పెట్టడమే కాక, లాభాలను కూడ చేకూర్చి పెట్టేందుకు సహకరిస్తాయని తాజా అధ్యయనాలద్వారా తెలుసుకున్నారు.
భారత నగరాల్లో రవాణాకు ఉపయోగించే సుమారు 150,000 డీజిల్ బస్సులనుంచి వచ్చే పొగ, కార్బన్ ఉద్గారాలు వాయుకాలుష్యాన్ని తీవ్రంగా పెంచుతున్నాయని, అవి భూగోళానికి తీరని నష్టాన్ని చేకూరుస్తుండటంతో ఐఐఎస్ అధ్యయనకారులు ఈ విషయంపై ప్రత్యేక అధ్యయనాలు చేపట్టారు. ఒక్కో డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మారిస్తే... సంవత్సరానికి సుమారు 25 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించవచ్చని బెంగళూరు దివేచా క్లైమేట్ ఛేంజ్ లోని షీలా రామ శేష సహా అధ్యయనకారుల బృందం తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ బస్సులు CO2 ను విడుదల చేయవని, అయితే వాటిని ఛార్జింగ్ చేసేందుకు కావలసిన ఛార్జింగ్ స్టేషన్లకోసం ఇండియాలో విద్యుత్ శక్తికి ప్రధానమైన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు అవసరమని అన్నారు. అయితే అదే స్థానంలో బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లలో సోలార్ ప్యానెల్స్ ను స్థాపిస్తే సంవత్సరానికి ఒక్కోబస్సుతో మరో 25 టన్నుల CO2 ను నివారించవచ్చని కూడ వారు తెలిపారు. దేశంలో ఇప్పుడున్న 150,000 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తే మొత్తం 3.7 మిలియన్ల కార్బన్ డై ఆక్సైడ్ ను నివారించవచ్చని తెలిపారు. కార్బన్ కాలుష్యం కారణంగా దేశంలో సంవత్సరానికి 670,000 లక్షల మంది చనిపోతున్నట్లు లెక్కల ప్రకారం తెలుస్తోందని, భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే మేజర్ పొల్యూటర్ గా మారుతోందని అధ్యయనకాలు తెలిపారు.