Deevi subbarao
-
ఆధ్యాత్మికత
నిత్య జీవితంలో ఆధ్యాత్మికత గురించి చెబుతూ మెహెర్ బాబా ఇలా అన్నారు ఆధ్యాత్మికత అనేది భౌతిక జీవితానికి సంబంధం లేకుండా విడిగా ఉం డేది కాదు. అది నిత్యజీవితంలో భాగం. ఆధ్యా త్మికత అంటే ప్రాపంచిక కార్యకలాపాల నుంచి వైదొలిగి సన్యసించడం కాదు. బాహ్యంగా కాకుండా, మానసి కంగా భౌతిక వాంఛల్ని విడనాడటం ఆధ్యాత్మికత అనిపించుకుంటుంది. తాము జీవితంలో అలసిపోయామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తారు కానీ, దాన్ని ఎలా పొందాలో తెలుసుకోరు. అయితే, జీవితం ఎంతో అందమైనది. ఆనందం అనుభవించటానికే జీవితం ఉన్నది. మనిషి జీవితాన్ని ఎలా అర్థం చేసుకొ న్నాడు? ఏ దృష్టితో చూస్తున్నాడు? జీవిత సమస్యల పట్ల అతడి అవగాహన ఏమిటి అనేది చాలా ముఖ్యం. అంతేకానీ నీ ముందున్న ప్రపంచం కాదు. ఇవాళ నీవు అలిసిపోయినట్లు, ఏదీ సరిగా లేనట్లూ, నీ చుట్టూరా ఉన్న ప్రపంచంలో ఏదీ అందంగా లేనట్లూ నీకు అనిపించవచ్చు. రేపు నీవు సంతోషంగా ఉంటే, అదే జీవితం, అదే ప్రపంచం, అవే వస్తువులు నీకు చాలా అందంగా కనిపించవచ్చు. అలా జరగటానికి కార ణం నీ మనస్సులో, నీ దృక్పథంలో వచ్చిన మార్పు. జీవితాన్ని భారంగా కాకుండా, తేలిగ్గా తీసు కోవాలి. నీకు నీవు చెప్పుకో, ‘నేను ఆనందంగా ఉండటానికి, ఇతరు లను ఆనందంగా ఉంచటానికి ఉన్నాను’ అని. అలాగనక ఉంటే, క్రమక్రమంగా నీకు నీవు ఆనం దంగా ఉండగలుగుతావు. ఇతరులను ఆనందంగా ఉంచగలుగుతావు. ‘నేను అలసిపోయాను, నిరాశ చెందాను. దుఃఖంలో ఉన్నాను’ అని నీ మనస్సుకు నీవు సూచనలు ఇవ్వవద్దు. అలా గనక ఇస్తే, పరిస్థితి మరింత దిగజారుతుంది. అంతా బాగుంది, అందం గా ఉంది, నేను చాలా ఆనందంగా ఉంటాను’ అని ఎప్పుడూ అనుకో. అలా గనక ఉంటే నీలో ఉన్న భగవంతుడు నీకు ఆధ్యాత్మికంగా సాయం చేస్తాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయి. బతుకు భయంకరంగా ఉందని ఏ కోశానా అనుకోవద్దు. అట్లాంటి ఆలోచనలు జీవితాన్ని నిజం గానే నరకప్రాయం చేస్తాయి. అలా కాకుండా జీవి తాన్ని ఆనందంగా జీవించాలి అని గనక నీవు నిర్ణ యించుకుంటే, అన్ని అవాంతరాలు, కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. నేను ఒంటరివాడిని, నాకు బాధ్యతలు ఉన్నవి, నా దగ్గర డబ్బులేదు... ఇట్లా అను కోవద్దు. లోకంలో ధనవంతులు ఎవరున్నారు? అం దరూ ఏదో రకంగా బీదవారే. కోటీశ్వరులు కూడా దరిద్రులే. ఎందుకంటే, వాళ్లకు స్వార్థం ఎక్కువ. తృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చేతులు చాపుకుని ఉంటారు. వాళ్లలా కాకుండా నీవు సాటి మనిషిని ప్రేమించు. సాటిమనిషిని ప్రేమిస్తే భగవం తుడు నిన్ను ప్రేమిస్తాడు. భగవంతుని ప్రేమను పొందిన వానికి జీవితంలో ఏ లోటూ ఉండదు.. అంటారు మెహెర్ బాబా. - దీవి సుబ్బారావు -
వైర భక్తి
జ్యోతిర్మయం ఆదిశంకరులు మోక్షాన్ని తెచ్చిపెట్టే సాధనాల్లో భక్తికే పెద్దపీట వేశారు. ఆ భక్తి తొమ్మిది విధాలుగా ఉంటుం ది అని మన పెద్దలు చెప్తారు. శ్రవణం, కీర్తనం, స్మర ణం, పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యానం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి ఆ తొమ్మిది విధాలు. వీటి లో స్మరణం చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. స్మర ణం అంటే తలంపు, జ్ఞప్తి. భగవంతుణ్ణి గురించి నిరం తరం తలపోస్తూ ఉండటం, విడువకుండా జ్ఞాపకం పెట్టుకోవటం. భగవంతుణ్ణి ఇట్లా జ్ఞాపకం పెట్టుకోవ టం ప్రేమతో కావచ్చు, ద్వేషం తో కావచ్చు, కోపంతో కావ చ్చు, విరోధంతో కావచ్చు. ఏ విధంగా భగవంతుని, ఎల్లప్పు డు తలచుకొంటున్నావు? అన్నది ముఖ్యం కాదు. తలచు కోవటం ముఖ్యం. ఎవరైనా భగవంతునితో వైరం పెట్టుకొని, ద్వేషించి, ఎల్లప్పుడు తలచుకొంటూ ఉంటే, ఆ తలంపే అతడిని భగవం తుని దగ్గరకు జేరుస్తుంది. దీనిపై భాగవతం తృతీయ స్కంధంలో ఆసక్తికరమైన వృత్తాంతం ఒకటి ఉన్నది. శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠం వచ్చిన మహర్షులు సనక సనందనాదులను విష్ణువు అంతః పుర ద్వార పాలకులైన జయవిజయులు అడ్డగించి భూలోకంలో పుట్టేలా ఘోర శాపం పొందుతారు. విష్ణుమూర్తి విషయం తెలుసుకొని, శాపవిమోచనంగా వాళ్లతో ఇలా అంటాడు, ‘‘జయ విజయులు భూలోకం లో అసురులుగా జన్మిస్తారు. దేవతలకు, మనుష్యులకు కీడు కలుగజేస్తూ, నాకు విరోధులుగా ఉంటారు. యుద్ధంలో నన్ను ఎదుర్కొని, నా చేతిలో చనిపోతారు. అలా చనిపోయి, త్వరలోనే నా సన్నిధికి వస్తారు’’. విష్ణువు ఇంకోమాట అంటాడు, ‘‘వైరంతో అయినా సరే, ఎవరు నన్ను మనస్సులో తలచు కొంటూ, నన్ను చూస్తూ చనిపోతారో, వారు నన్నే పొందుతారు’’. అయితే ఇక్కడ ఎవరికైనా ఒక ధర్మసందేహం రావచ్చు. భగవంతుణ్ణి ప్రేమించి, సేవ చేసిన వానికం టే, భగవంతుణ్ణి ద్వేషించి, విరోధం పెట్టుకొన్న వాడే త్వరగా మోక్షానికి వెళ్తాడు? అదెట్లా సంభవం? అంటే భాగవతమే దానికి సమాధానం చెబుతుంది. వైరం వల్ల భగవంతుని యెడల తన్మయత్వం కలిగినట్లు, మరి దేనివల్లా కలుగదు అని. మనం ఎవరినైనా ద్వేషించినప్పుడు, ప్రేమించినప్పటికంటే, ఎక్కువ సార్లు, ఎక్కువ తీవ్రతతో అతడిని జ్ఞప్తికి తెచ్చుకొం టాము. ఒక మనిషి మీద అత్యంత ద్వేషం, విరోధం కలిగినప్పుడు, నీవు అన్నింటినీ మరచిపోయి, నిన్ను నీవే మరచిపోయి, ఎవరినైతే ద్వేషిస్తున్నావో, అతడిని గురించే ఆలోచిస్తూ ఉంటావు. ప్రేమలో కూడా తలచుకోవటం ఉంటుంది కాని, ద్వేషంలో ఉన్నంత తీవ్రంగా, నిరంతరాయంగా ఉండదు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదలైన వాళ్లు ఎందుకు త్వరగా మోక్షాన్ని పొందారు అంటే, వాళ్లు భగవంతుడితో విరోధం పెట్టుకొని, ద్వేషించి, బతుకంతా ప్రతిక్షణం ఆ భగవంతుని ధ్యాసలోనే గడిపారు కాబట్టీ. - దీవి సుబ్బారావు -
తైత్తిరీయ ఉపనిషత్
జ్యోతిర్మయం మనకున్న చాలా ఉపనిషత్తులో ముఖ్యమైనవి పదో పద్నాలుగో అని లెక్క తేల్చారు పెద్దలు. వాటిలో ఒకటి తైత్తిరీయ ఉపనిషత్తు. ఇది కృష్ణయజుర్వేదానికి సం బంధించినది. ఇందులో శిక్షావల్లి, ఆనందవల్లి, భృగు వల్లి అని మూడు ప్రపాఠకాలు, అంటే మూడు అధ్యా యాలు ఉన్నవి. వల్లి అంటే భాగం. ఈ ఉపనిషత్తు ముఖ్యంగా మనిషి సమాజంలో నడచుకోవలసిన తీరు, మనిషికి ఉండవలసిన కర్తవ్య పరాయణత, భగ వంతుడి యెడల చూపవలసిన విధేయత గురించి చెబుతుంది. చాలా మంది చాలా సందర్భాల్లో ఇందు లోని వాక్యాల్ని ఉదహరించటం జరుగుతుంటుంది. ఉపనిషత్తు మొదటి నుంచీ చివరి దాకా ఉపదేశాలతో కూడుకొని ఉంది. మొదటిదైన శిక్షావల్లిలో ఇలా ఉం టుంది. ‘సత్యంవధ’, సత్యాన్ని పలకండి. ‘ధర్మంచర’, ధర్మాన్ని ఆచరించండి. ‘సత్యాన్న ప్రమదితవ్యమ్’, సత్యం నుంచి వైదొలగకండి. ‘ధర్మా న్న ప్రమదితవ్యమ్’, ధర్మం నుంచి వైదొలగకండి. ‘కుశలాన్న ప్రమదిత వ్యమ్’, మేలు చేసేవాటి నుంచి వైదొల గకండి. ‘భూత్యైన ప్రమదితవ్యమ్’, సత్కార్యాల నుంచి వైదొలగకండి. ‘స్వాధ్యాయ ప్రవచ నాభ్యాం న ప్రమదితవ్యమ్’, నేర్చుకోవటం నుంచి, నేర్పటం నుంచి వైదొలగకండి. ‘దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యమ్’, దేవతలకు పితరులకు చేయవల సిన కర్తవ్యం నుంచి వైదొలగకండి. ‘‘మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథి దేవోభవ’’. ఇంకో మంత్రం ఇలా చెబుతుంది. దానం శ్రద్ధతో ఇవ్వాలి. చులకన భావంతో ఇవ్వకూ డదు. శక్తి కొలది దానం ఇవ్వాలి. వినయంతోను, గౌరవంతోనూ, మంచి మనసుతోను దానం ఇవ్వాలి. రెండవ అధ్యాయం ఆనందవల్లిలో బ్రహ్మమును గురించి చెప్పబడింది. ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’, భగవంతుడు సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతుడు, ‘‘యతోవాచో నివర్తంతే అప్రాప్యమనసా సహః’’, ఎవరిని పొందలేక మనస్సు వాక్కు మరలిపో తున్నవో అతడే భగవంతుడు. ఈ అధ్యాయంలోనే మనిషికి ఉన్న ఐదు కోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల గురించి ప్రస్తావించటం జరిగింది. మూడో అధ్యాయం భృగువల్లిలో భగవంతుణ్ణి గురించిన వివేచన కొనసాగుతుంది. ఈ సందర్భంగా వరుణ మహర్షికి అతని కుమారుడు భృగువుకు మధ్య జరిగిన చర్చను భార్గవీ వారుణీ విద్యగా పిలుస్తారు. ‘ఆనందో బ్రహ్మ’ ఆనందమే భగవంతుడు. ‘అన్నం బ్రహ్మ’ ఆహారమే భగవంతుడు. ‘అన్నం న నింద్యాత్’ ఆహారాన్ని నిందించకూడదు. ‘అన్నం బహుకుర్వీత’ ఆహారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయాలి అని చెప్తూ చివ రిగా ఉపనిషత్తు మనిషి సదా భగవచ్చింతనలో జీవిం చాలి అని ఉపదేశిస్తుంది. సుస్వరంగా ఈ ఉపనిషన్మంత్రాల్ని గానం చేస్తుం డగా వినటం ఒక గొప్ప ఆనందానుభూతి. దీవి సుబ్బారావు -
రాజ్యాశ్రమ ముని
జ్యోతిర్మయం రఘు వంశానికి చెందిన రాజుల చరిత్రను ‘రఘు వంశం’ అనే పేరుతో కావ్యంగా మలిచాడు కవికుల తిలకుడైన కాళిదాసు. దిలీప మహారాజు చరిత్రతో మొదలవుతుంది కావ్యం. దిలీపుడి భార్య పేరు సుద క్షిణ. వారికి చాలా కాలం పిల్లలు కలగలేదు. కారణం ఏమా అని తెలుసుకోవటానికి భార్యా సమేతంగా దిలీ పుడు గురువైన వశిష్ఠుడి దగ్గరకు బయలుదేరతాడు. ఆ గురువు దూరంగా అడవిలో ఆశ్రమం కట్టుకొని అక్కడ తపస్సు చేసుకొంటున్నాడు. దిలీపుడు రథం మీద వెళ్తూ దార్లో చాలా ఊళ్లు దాటుకొంటూ వెళ్లా డు. మధ్యమధ్యలో ప్రకృతి అందాలు చూస్తూ గ్రామ స్తుల్ని పలకరిస్తూ వెళ్లాడు. పగలల్లా ఆ విధంగా ప్రయాణం చేసి సాయంకాలానికి వశిష్ఠుల వారి ఆశ్ర మం చేరుకొన్నాడు. అక్కడున్న మునుల చేత అతిథి సత్కారాలు పొంది, దిలీపుడు అతని భార్యా మార్గా యాసం నుండి తేరుకొన్నారు. తరు వాత ఇద్దరూ వెళ్లి వశిష్ఠుల వారికి, వారి భార్య అరుంధతికి నమస్కరిం చారు. ముని దంపతులు రాజదంప తుల్ని సంతోషంగా ఆశీర్వదించారు. తర్వాత వశిష్ఠుడు దిలీపుని రాజ్యంలో అందరూ క్షేమ మేనా అని అడిగాడు. ఇంత వరకు కథ మామూలుగా నడుస్తుంది. చెప్పుకోదగ్గ విశేషం ఏం కనపడదు. కాని కాళిదాసు మామూలు కవి కాదు గదా. కవి కుల గురువు. కవులకే గురువైనవాడు. కవికుల తిల కుడు. కవుల సమూహానికే అలంకారప్రాయమైన వాడు. అలాంటి కాళిదాసు మహాకవి ఇక్కడ దిలీపుని గురించి ఒక గొప్ప మాట అంటాడు. ఏమా మాట అంటే, దిలీపుడు రాజ్యాశ్రమ ముని అట. వశిష్ఠుడు మొదలైన మునులు అరణ్యంలో ఉంటూ అక్కడ ఆశ్ర మాలు నిర్మించుకొని తపస్సు చేసుకొంటున్నారు. దిలీ పుడు కూడా ఒక విధంగా ముని. వశిష్ఠుడు మొదలైన వారు అరణ్యంలో ఉంటే, దిలీపుడు రాజ్యంలో ఉన్నా డు. అంతవరకే తేడా. మిగతా విషయాల్లో సమానమే. వారు ఎలా అరణ్యంలో ఉండి ఇంద్రియాల్ని జయించి లోక క్షేమం కోసం తపస్సు చేస్తున్నారో, దిలీపుడు కూడా రాజ్యంలో రాజుగా ఉండి, లౌకిక వ్యవహారా ల్లో ఉన్నా, ఇంద్రియాల్ని జయించి, రాజ్యక్షేమం కోసం దీక్ష పట్టి పరిపాలన సాగిస్తున్నాడు. అతడికి రాజ్యాధి కారమే ఆశ్రమం లాంటిది. పరిపాలననే తపస్సుగా భావించి చేస్తున్నాడు. ఇంద్రియ నిగ్రహం అలవర్చుకొనటానికి, దీక్షతో కర్తవ్యపాలన చేయటానికి ఉన్న ప్రదేశం, చేసే పని అడ్డురావని కాళిదాసు దిలీపుని ఉదాహరణగా చూపి స్తూ చెబుతున్నాడు. దిలీప మహారాజులాంటి వాడే జనక మహారాజు అని చదువుతాం. ఇద్దరూ రాజ్యా శ్రమంలో ఉన్న మునులు. ఇట్లాంటి దిలీప మహారాజు చరిత్రను ప్రాతిపదికగా తీసుకొని, కాళిదాసు రఘువం శంలోని మిగతా ఇరవై ఎనిమిది మంది రాజుల చరి త్రను వర్ణిస్తాడు. ఆ రఘువంశంలోని వాడే శ్రీరా ముడు రఘువంశ సుధాంబుధి చంద్రుడు. దీవి సుబ్బారావు