తైత్తిరీయ ఉపనిషత్
జ్యోతిర్మయం
మనకున్న చాలా ఉపనిషత్తులో ముఖ్యమైనవి పదో పద్నాలుగో అని లెక్క తేల్చారు పెద్దలు. వాటిలో ఒకటి తైత్తిరీయ ఉపనిషత్తు. ఇది కృష్ణయజుర్వేదానికి సం బంధించినది. ఇందులో శిక్షావల్లి, ఆనందవల్లి, భృగు వల్లి అని మూడు ప్రపాఠకాలు, అంటే మూడు అధ్యా యాలు ఉన్నవి. వల్లి అంటే భాగం. ఈ ఉపనిషత్తు ముఖ్యంగా మనిషి సమాజంలో నడచుకోవలసిన తీరు, మనిషికి ఉండవలసిన కర్తవ్య పరాయణత, భగ వంతుడి యెడల చూపవలసిన విధేయత గురించి చెబుతుంది. చాలా మంది చాలా సందర్భాల్లో ఇందు లోని వాక్యాల్ని ఉదహరించటం జరుగుతుంటుంది. ఉపనిషత్తు మొదటి నుంచీ చివరి దాకా ఉపదేశాలతో కూడుకొని ఉంది. మొదటిదైన శిక్షావల్లిలో ఇలా ఉం టుంది. ‘సత్యంవధ’, సత్యాన్ని పలకండి. ‘ధర్మంచర’, ధర్మాన్ని ఆచరించండి. ‘సత్యాన్న ప్రమదితవ్యమ్’, సత్యం నుంచి వైదొలగకండి. ‘ధర్మా న్న ప్రమదితవ్యమ్’, ధర్మం నుంచి వైదొలగకండి. ‘కుశలాన్న ప్రమదిత వ్యమ్’, మేలు చేసేవాటి నుంచి వైదొల గకండి. ‘భూత్యైన ప్రమదితవ్యమ్’, సత్కార్యాల నుంచి వైదొలగకండి. ‘స్వాధ్యాయ ప్రవచ నాభ్యాం న ప్రమదితవ్యమ్’, నేర్చుకోవటం నుంచి, నేర్పటం నుంచి వైదొలగకండి. ‘దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యమ్’, దేవతలకు పితరులకు చేయవల సిన కర్తవ్యం నుంచి వైదొలగకండి.
‘‘మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథి దేవోభవ’’. ఇంకో మంత్రం ఇలా చెబుతుంది. దానం శ్రద్ధతో ఇవ్వాలి. చులకన భావంతో ఇవ్వకూ డదు. శక్తి కొలది దానం ఇవ్వాలి. వినయంతోను, గౌరవంతోనూ, మంచి మనసుతోను దానం ఇవ్వాలి.
రెండవ అధ్యాయం ఆనందవల్లిలో బ్రహ్మమును గురించి చెప్పబడింది. ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’, భగవంతుడు సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతుడు, ‘‘యతోవాచో నివర్తంతే అప్రాప్యమనసా సహః’’, ఎవరిని పొందలేక మనస్సు వాక్కు మరలిపో తున్నవో అతడే భగవంతుడు. ఈ అధ్యాయంలోనే మనిషికి ఉన్న ఐదు కోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల గురించి ప్రస్తావించటం జరిగింది.
మూడో అధ్యాయం భృగువల్లిలో భగవంతుణ్ణి గురించిన వివేచన కొనసాగుతుంది. ఈ సందర్భంగా వరుణ మహర్షికి అతని కుమారుడు భృగువుకు మధ్య జరిగిన చర్చను భార్గవీ వారుణీ విద్యగా పిలుస్తారు. ‘ఆనందో బ్రహ్మ’ ఆనందమే భగవంతుడు. ‘అన్నం బ్రహ్మ’ ఆహారమే భగవంతుడు. ‘అన్నం న నింద్యాత్’ ఆహారాన్ని నిందించకూడదు. ‘అన్నం బహుకుర్వీత’ ఆహారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయాలి అని చెప్తూ చివ రిగా ఉపనిషత్తు మనిషి సదా భగవచ్చింతనలో జీవిం చాలి అని ఉపదేశిస్తుంది.
సుస్వరంగా ఈ ఉపనిషన్మంత్రాల్ని గానం చేస్తుం డగా వినటం ఒక గొప్ప ఆనందానుభూతి.
దీవి సుబ్బారావు