హైదరాబాద్లో రక్షణ సంస్థలకు భద్రత పెంపు
సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ఆర్మీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పాక్ ఏదో ఒక దుస్సాహసానికి ఒడిగట్టే ప్రమాదం ఉందని ముందునుంచే నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై ఆర్మీ అధికారులకు, కంటోన్మెంట్ ఇతర ప్రాంతాలకు ఎలర్టులు వచ్చాయి. హైదరాబాద్ కూడా హై ఎలర్టులో ఉంది. ఆర్మీ పాస్లు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పాస్లు లేని వాహనాలు వేరే మార్గాల్లో వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంటు, గోల్కొండ ప్రాంతాల్లో ఇప్పటికే చెక్ పోస్టులు పెట్టారు. రాత్రిపూట ఎవరినీ అనుమతించడం లేదు. పగలు కూడా గుర్తింపు పత్రాలు చూసిన తర్వాతే అనుమతిస్తున్నారు.
హైదరాబాద్లో రక్షణ రంగానికి చెందిన డీఆర్డీఎల్, డీఆర్డీఓ, మిధాని తదితర సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ చాలా కీలకమైనవి కావడంతో.. గుర్తుతెలియని వ్యక్తులను అసలు ఆ ప్రాంతాల్లోకి అనుమతించవద్దని గట్టిగా చెబుతున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇందుకు సంబంధించిన సూచనలు ఇచ్చారు. ఈ సంస్థల మీద దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. రక్షణ సంస్థలున్న రాష్ట్రాలన్నింటి ముఖ్యమంత్రులతో రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే మాట్లాడారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఆయన ఫోన్ చేశారు. కంటోన్మెంట్, ఏఓసీ గేట్ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.