దిగ్గజాల రాజకీయ క్షేత్రంలో కులానిదే బలం!
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, డిఫెన్స్ కాలనీ వంటి సంపన్న కాలనీలతోపాటు దేవ్లీ వంటి కుగ్రామాలతో కూడిన దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం దిగ్గజాలు పోటీపడిన రాజకీయ క్షేత్రంగా గుర్తింపు పొందింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు పరాజయాన్ని చవిచూపించి, ఎన్నికల రాజకీయాలంటే ఆయనకు దడ పుట్టించిన నియోజకవర్గమిదే.
బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ కూడా రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. కుల సమీకరణాలకే పెద్దపీట వేసే ఈ నియోజకవర్గంలో కుల సమీకరణాలు 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో మారిపోయాయి. అంతవరకు పంజాబీ, సిక్కు ఓటర్లు అధికంగా ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దింపేవి. కానీ 2008 తర్వాత నియోజకవర్గంలో జాట్, గుజ్జర్ ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది.
దానితో రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యాలను కూడా మార్చాయి. గత ఎన్నికలలో కాంగ్రెస్ జాట్ కులానికి చెందిన రమేష్ కుమార్‌ను బరిలోకి దింపగా, బీజేపీ గుజ్జర్ కులానికి చెందిన రమేష్ బిధూరీని నిలబెట్టింది. ఈ సారి ఎన్నికల్లో కూడా ఈ పార్టీలు ఈ ఇద్దరికే మళ్లీ టికెట్లను ఇచ్చాయి.
మోడీ మేనియాపైనే బీజేపీ ఆశలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం నేపథ్యంలో రమేష్ కుమార్‌ను కాకుండా మరో అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్న కాంగ్రెస్ ఆఖరి క్షణంలో మళ్లీ ఆయనకే మళ్లీ టికెట్ ఇచ్చింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో ముక్కోణపు పోరు జరిగినప్పటికీ దక్షిణ ఢిల్లీ ఓటర్లు బీజేపీ వైపే అధిక మొగ్గు చూపారు. ఈ నియోజకవర్గం పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ఏడింటిని బీజేపీ దక్కించుకుంది. దీంతో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం తనదే అన్న ధీమాతో ఉంది.
అందుకే గత లోక్‌సభ ఎన్నికలలో 93 వేల ఓట్ల తేడాతో రమేష్ కుమార్ చేతిలో ఓడిపోయిన రమేష్ బిధూరీకే మళ్లీ టికెట్ ఇచ్చింది. రమేష్ బిధూరీ తుగ్లకాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసన భ్యునిగా ఎన్నికయ్యారు. గుజ్జర్ ఓట్లతో పాటు నరేంద్ర మోడీ చరిష్మా బిధూరీని గెలిపిస్తుందని ఆ పార్టీ నమ్ముతోంది.
అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు జాట్ అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం వల్ల జాట్ ఓట్లు చీలవచ్చని, అదీకాక ముజఫర్‌నగర్ అల్లర్ల ప్రభావం వల్ల జాట్ ఓటర్లు తమకు మద్దతు ఇవ్వవచ్చని బీజేపీ ఆశిస్తోంది.
ఆప్నే గెలిపిస్తారు: సెహ్రావత్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండింటి ఓటు బ్యాంకును కొల్లగొట్టి మూడు సీట్లను గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ దేవేంద్ర సెహ్రావత్‌కు టికెట్ ఇచ్చింది. రిటైర్డ్ కల్నల్ దేవేంద్ర సె్రహావత్ మహిపాల్‌పూర్‌కు చెందిన జాట్ నాయకుడు. ఐదారు సంవత్సరాలుగా స్థానికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
గ్రామపంచాయతీ స్థలాన్ని స్వాధీనపర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. దక్షిణ ఢిల్లీలో నీటి ఎద్దడిని పరిష్కరించడానికి జలాశయాలను సంరక్షించాలని ప్రచారోద్యమం జరిపారు. ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజ్వాసన్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పరిస్థితి మారిపోయిందని, అప్పట్లో ఆప్ అంటే తెలియక చాలా మంది ఓటర్లు ఆప్‌కు ఓటేయలేదని, ఇప్పుడు ప్రజల మద్దతు తనకు ఉందని సెహ్రావత్ అంటున్నారు.
కుల సమీకరణాల కన్నా ప్రజా సమస్యలు ఎన్నికల్లో అధిక ప్రభావం చూపుతాయని ఆయన అంటున్నారు. నీటి ఎద్దడి ఇక్కడి ప్రధాన సమస్య. ట్యాంకర్ మాఫియాను ఎదుర్కొనే సాహసాన్ని ఆప్ సర్కారు చూపిందని, అందువల్ల కులసమీకరణాలు ఎలా ఉన్నా ఓట్లు తనకే అంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రెండేసి రోజులు గడిపి, స్థానికుల సమస్యలను తెలుసుకునే లా వ్యూహం రూపొందించిన ట్లు ఆయన చెప్పారు.