సాగర్‌లో డీఆర్డీఓ యూనిట్
రూ. 1,600 కోట్లతో ఏర్పాటుకానున్నట్లు వెల్లడించిన కేసీఆర్
100 ఎకరాలు కేటాయింపు.. విమానాలు దిగేందుకు ప్రత్యేక రన్‌వే
ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాల్లోనే ఈ తరహా యూనిట్లు
ప్రస్తుతం సాగర్‌లో ఏర్పాటుతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి
అధికారులతో సమీక్ష సమావేశంలో సీఎం
హైదరాబాద్: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో రూ. 1,600 కోట్ల వ్యయంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు చెందిన ముఖ్యమైన విభాగాన్ని రక్షణశాఖ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు దేశాల్లో మాత్రమే ఉన్న ఈ తరహా యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు అనువైన స్థలం నాగార్జున సాగర్ మాత్రమేనని రక్షణ శాఖ అధికారులు నిర్ణయించారని, దానికి ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించిందని ఆయన చెప్పారు.
నాగార్జున సాగర్ పరిధిలో రక్షణ శాఖ మరిన్ని పరిశోధనలు చేయడానికి, మరిన్ని సంస్థలు నెలకొల్పడానికి వీలుగా అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ యూనిట్ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించి.. సాగర్‌ను ఎంపిక చేశారని తెలిపారు. డీఆర్డీఓ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం కేసీఆర్ బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, రెవెన్యూ కార్యదర్శి మీనా, నీటి పారుదల శాఖ కార్యదర్శి జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు తదితరులతో సమీక్షించారు. భారత్‌లో ఈ తరహా యూనిట్ లేక రక్షణశాఖ తన అవసరాల కోసం రష్యాలోని మాస్కోలో ఉన్న యూనిట్‌పై ఆధారపడుతోందని సీఎం తెలిపారు. నాగార్జునసాగర్‌లో డీఆర్డీఓ యూనిట్ ఏర్పాటు ద్వారా భారత్‌కు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని.. భారతే ఇతర దేశాలకు పరిశోధన సహకారం అందిస్తుందని వివరించారు. రూ. 1,600 కోట్లతో ఏర్పాటు చేసే ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభిస్తుందని, సాగర్ ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్‌లో ఈ యూనిట్ నెలకొల్పడానికి 100 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని, దానికి అవసరమయ్యే నీరు, విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేసిందని సీఎం చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు కూడా ఈ యూనిట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నందున దేశ, విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు సాగర్‌కు రాకపోకలు సాగిస్తారని, వారి కోసం సాగర్ వద్ద విమానం దిగేందుకు వీలుగా రన్‌వే (ఎయిర్ స్ట్రిప్) నిర్మిస్తామని సీఎం తెలిపారు. దానిని రక్షణ శాఖ అవసరాలకే కాక పర్యాటకులకు కూడా వినియోగించుకుంటారని చెప్పారు.