Delhi Airport Express
-
అనిల్ అంబానీ అదృష్టం తారుమారు
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నులకు సంబంధించి 2008లో వెలువడిన జాబితాలో ఆరవస్థానంలో నిలిచిన అనిల్ అంబానీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థల్లో ఒకటైన– ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు(డీఏఎంఈపీఎల్) అనుకూలంగా గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ– డీఏఎంఈపీఎల్ అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మధ్య కుదిరిన ‘‘రాయితీ ఒప్పందం’’ విషయంలో తలెత్తిన ఒక వివాదానికి సంబంధించి రూ.8,000 కోట్ల అవార్డుతో ఆయన కష్టాలు కొంత గట్టెక్కుతాయన్న అంచనాలను తాజా పరిణామం దెబ్బతీసింది. ఆర్బిట్రేషన్ అనుగుణంగా గతంలో డీఎంఆర్సీ చెల్లించిన రూ.3,300 కోట్లను వాపసు చేయాలని సుప్రీం డీఏఎంఈపీఎల్ని ఆదేశించింది. అయితే తీర్పు వల్ల తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. అటు డీఎంఆర్సీ నుంచి కానీ ఇటు గ్రూప్ సంస్థ డీఏఎంఈపీఎల్ నుంచి తనకు ఎటువంటి డబ్బూ అందలేదని వివరించింది. -
రేపు రాత్రి 8 గంటలకు చివరి మెట్రో రైలు
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళిని పురస్కరించుకుని గురువారం ఆఖరి మెట్రో రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని ఢిల్లీ మెట్రో మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ లైన్‌కు కూడా ఈ వేళలు వర్తిస్తాయి. దిల్షాద్ గార్డెన్, రిఠాలా, జహంగీర్‌పురి, హుడా సిటీ సెంటర్, నోయిడా సిటీ సెంటర్, ద్వారకా సెక్టర్ 21, వైశాలి, కీర్తినగర్, ఇందర్‌లోక్, ముండ్కా, సెంట్రల్ సెక్రటేరియట్, బదర్‌పుర్, న్యూఢిల్లీ నుంచి ఆఖరి మెట్రో రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. గురువారం ఉదయం మెట్రో సేవలు మామూలు సమయానికే ఉదయం 6 గంటలకు మొదలవుతాయి. ఎయిర్‌పోర్టు మెట్రో ఉదయం 4.45 గంటలకు బయలుదేరుతుంది. భాయ్ దూజ్ రోజున( అక్టోబర్ 25న) ప్రయాణికుల ర ద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు మెట్రో రైళ్లను స్టాండ్‌బైగా ఉంచాలని నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నట్లయితే స్టాండ్‌బైగా ఉంచిన రైళ్లను నడుపుతారు. మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, గైడ్లు అందుబాటులో ఉంటారు. మెట్రో సేవలు యథావిధిగా ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి.. ఎయిర్‌పోర్టు మెట్రో కూడా ఉదయం 4.45 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు నడుస్తుంది.