కోర్టు పనిగంటలు ముగిసే వరకూ నిల్చుండాలి
తాగి డ్రైవింగ్ చేసిన వ్యక్తికి ఢిల్లీ కోర్టు శిక్ష ఖరారు
న్యూఢిల్లీ: తాగిన మైకంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తికి కోర్టు పనిగంటల సమయం పూర్తి అయ్యే వరకూ నిలబడి ఉండాలనే శిక్ష విధించింది. ఇది ఐదు రోజుల పాటు కొనసాగుతోందని ఢిల్లీ కోర్టు సోమవారం పేర్కొంది. నగరంలో తాగిన మైకంలో వాహనాల నడపడం వల్ల ప్రాణాంతకమైన సంఘటలు చోటు చేసుకొంటున్నాయి. ఇవి రోజురోజుకూ నగరంలో తీవ్రమవుతున్నాయని పేర్కొంది. అదనపు సెషన్స్ జడ్జి మాని మల్హోత్రా కింది కోర్టు విధించిన శిక్షను సడలిస్తూ తీర్పు చెప్పారు. తాగిన మైకంలో వాహనాన్ని నడిపిన ఢిల్లీకి చెందిన అమిత్కుమార్కు 10 రోజుల జైలు శిక్ష, 1,000 జరిమానాను కింది కోర్టు విధించింది.
అయితే శిక్షను మార్పు చేస్తూ 5 రోజుల పాటు కోర్టు పనివేళలు ముగిసే వరకూ నిలబడి ఉండే విధంగా మార్పు చేసింది. కింది కోర్టు తీర్పుపై నిందితుడు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు పరిశీలించిన కోర్టు నిందితుడు ఇంటి యజమాని కావడంతో ఆ కుటుంబం ఆసరా కోల్పోతున్న దృష్ట్యా శిక్షను సడలించినట్లు జడ్జి పేర్కొన్నారు. నేటి నుంచి 21 వ తేదీ వరకూ కోర్టు పనివేళల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిందితుడు నిలబడి ఉండాలని, ఈ సమాచారాన్ని ప్రతిరోజు కోర్టు సిబ్బంది రికార్డును నమోదు చేస్తారని పేర్కొంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం.. తాగిన మైకంలో మొదటి సారి తప్పుచేసిన వ్యక్తికి ఆర్నెళ్ల జైలు, రూ. 2,000 జరిమానా విధించాల్సి ఉంటుందని, కానీ కింది కోర్టు శిక్షను తగ్గించి విధించిందని జడ్జి తెలిపారు.
నిందితుడు 114.3 ఎంజీ అల్కాహాలు సేవించి డ్రైవ్ చేయడం అతడి ప్రాణాలకే ముప్పు కాకుండా, రోడ్డు పై వెళ్లేవారికి కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇది తీవ్రమైందని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సెప్టెంబర్ 6వ తేదీ 2014 న నిందితుడు తాగిన మైకంలో డ్రైవింగ్ చేస్తూ ఎస్పీఎం మార్గంలో పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం కుమార్ తన నేరాన్ని కింది కోర్టులో ఒప్పుకొన్నాడు. ఈ మేరకు మోటార్ వాహనాల చట్టం ప్రకారం 10 రోజుల జైలు శిక్ష, రూ. 1000 జరిమానాను విధించిందని పేర్కొన్నారు. దీనిపై నిందితుడు సెషన్ కోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు తీర్పును సడలించింది.