'కన్హయ్యపై గట్టి సాక్ష్యాలున్నాయి'
జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్కు వ్యతిరేకంగా తమ వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. అందుకే అతడిని అరెస్టు చేశామని తెలిపారు. జేఎన్యూ వివాదం.. ఈ కేసు విచారణ తదితర అంశాలపై పీఎంఓకు ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ వివాదంలో కేవలం జేఎన్యూ విద్యార్థులే కాక మరికొంతమంది బయటివాళ్లు కూడా ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఈ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. తమవద్ద గట్టి ఆధారాలున్నాయని, ఎలాంటి పక్షపాతం లేకుండానే తాము ఈ కేసు విషయంలో ముందుకు వెళ్తున్నామని బస్సీ తెలిపారు. జేఎన్యూ అధికారులు తమతో పూర్తిగా సహకరిస్తున్నారని, దేశ సమగ్రత గురించి ఆలోచించేవాళ్లంతా ఈ కేసు దర్యాప్తులో తమకు సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనవైపు వేళ్లు చూపించేవాళ్లకు ఏమీ అర్థం కావట్లేదని అన్నారు. 'నువ్వు సృష్టించిన ప్రపంచానికి ఏమైందో చూడు దేవుడా.. ఎంత మారిపోయాడో ఈ మనిషి' అంటూ కవి ప్రదీప్ రాసిన కవిత తనకు గుర్తుకువస్తుందని బస్సీ చెప్పారు. ఓవైపు తాము కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుంటే జనం మాత్రం ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
మరోవైపు ఈ కేసు గురించి సుప్రీంకోర్టు కూడా స్పందించింది. తీవ్రవాద భావాలు దేశసుస్థిరతను దెబ్బతీస్తాయని, ప్రజలు కాస్త వివేచనతో వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాటియాలా హౌస్ కోర్టు వద్ద జరిగిన ఘర్షణను ప్రస్తావిస్తూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. మనమంతా దేశభక్తులమేనని, మాతృదేశాన్ని అస్థిరపరిచే పనులు ఎవరూ చేయకూడదని వ్యాఖ్యానించారు. ఇక న్యాయవాదులు చట్టాన్ని తమ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.