భారీగా పెరిగిన పోలింగ్
12 శాతం అధికం
పోటీ ముక్కోణమే
బీజేపీ, ఆప్ మధ్య భారీ పోటీ
ఓటుహక్కు వినియోగించుకున్న వీఐపీలు
గుర్గావ్లో రిగ్గింగ్ జరిగిందని ఆప్ ఆరోపణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక వంటి ఎన్నికల ప్రక్రియకు ఢిల్లీ ఓటర్లు గురువారం ఎంతో ఉత్సాహంగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం కూడా ఈ ఎన్నికలతో తుడిచిపెట్టుకుపోయింది. ఉదయం ఏటింటి మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని 1.27 కోట్ల మందిలో 64 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 52.3 శాతం కంటే ఇది 12 శాతం అధికం.
1971 లోక్‌సభ ఎన్నికల (71.3 శాతం) తరువాత అత్యధిక పోలింగ్ ఈసారే నమోదయింది. వికలాంగులు, వయోధికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై ఓట్లేశారు. అన్ని పార్టీల అగ్ర నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు యథావిధిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్జీ సతీసమేతంగా ఓటింగ్‌కు హాజరయ్యారు. నగరవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఢిల్లీ ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. సాయంత్రం ఆరింటి వరకు 64 శాతం పోలింగ్ నమోదయినట్టు వెల్లడించారు.
ఆ తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ కొనసాగింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకే పోలింగ్ శాతం 2009 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతం 52.3ను అధిగమించింది. ఫలితంగా ఈ ఎన్నికలు రికార్డులను నమోదు చేశాయి. ఉదయం పోలింగ్ మొదలైన తరువాత నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అత్యధికంగా ఓట్లు పడ్డాయి.
ఏడింటికి మొదలైన పోలింగ్
ఉదయం సరిగ్గా ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమయింది. తొలుత రెండు మూడు గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగడంతో ఆందోళన వ్యక్తమయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లలో కనిపించిన ఉత్సాహం ఈసారి మాయమైందా అన్న అనుమానం కూడా కలిగింది. తదనంతరం భారీగా ఓటింగ్ నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మొదటి రెండు గంటల్లో 10.2 శాతం, మొదటి నాలుగు గంటల్లో 25 శాతం ఓటింగ్ నమోదయింది. మధ్యాహ్నం ఒంటి గంట కు 40 శాతం పోలింగ్ జరిగింది. మూడు గంటలకు 52 శాతానికి చేరింది. మధ్యాహ్నం వరకే ఓటింగ్ గత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌శాతాన్ని మించిపోయింది. సాయంత్రం ఐదు గంటలకు ఇది 60.1 శాతానికి చేరుకుంది. సాయంత్రం ఐదు గంటలకు చాందినీచౌక్‌లో 60 శాతం, ఈస్ట్ ఢిల్లీలో 61.2 శాతం, న్యూఢిల్లీలో 59.2 శాతం.
నార్త్ వెస్ట్ ఢిల్లీలో 59.3 శాతం, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో 63 శాతం, సౌత్ ఢిల్లీలో 57.2 శాతం, వెస్ట్ ఢిల్లీలో 61.1 శాతం ఓట్లు పడ్డాయి. ఆరు గంటలకు ఇది 64 శాతానికి ఎగబాకింది. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు ప్రాధాన్యాల గురించి చర్చించుకోవడం కనిపించింది. పెచ్చరిల్లిన అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశామని యువఓటర్లు చెప్పారు. మహిళా భద్రత తమకు అన్నింటి కన్నా ముఖ్యమని యువతులు అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ఓటర్లు ముఖ్యంగా మహిళలు ధరలపెరుగుదల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్లు మంచి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు.
పార్టీలు.. బలాబలాలు
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈసారి అత్యధిక స్థానాలు సాధిస్తామని ఘంటాపథంగా చెబుతోంది. నరేంద్ర మోడీ హవా, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలసి వస్తాయని విశ్వసిస్తోంది. ఆప్ కూడా విజయంపై ధీమాగా ఉంది. అవినీతిపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, యువ ఓటర్లు, మైనారిటీలు తమను గెలిపిస్తారని భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గెలుపు కోసం విపరీతంగా శ్రమించారు. ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థుల్లో ముగ్గురు కేంద్రమంత్రులనే విషయం తెలిసిందే.
ఘజియాబాద్‌లోనూ రికార్డు స్థాయిలో...
ఘజియాబాద్‌లోనూ గురువారం రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలిరావడంతో సాయంత్రం 6 గంటలవరకు 60 శాతం పోలింగ్ నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా వి.కె. సింగ్, కాంగ్రెస్ నుంచి రాజ్‌బబ్బర్, ఆప్ నుంచి షాజియా ఇల్మీ బరిలోకి దిగారు.
గుర్గావ్లో 55 శాతం
ఆప్ నేత యోగేంద్ర యాదవ్, బీజేపీ అభ్యర్థి ఇంద్రజీత్ సింగ్‌ల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరంలో ఎవరు విజేతలో తేల్చేందుకు ఓటర్లు కూడా భారీగానే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈ నియోజకవర్గంలో 55 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.