‘నిర్భయ’ను, స్నేహితుణ్ని హతమార్చాలనుకున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీలో గత ఏడాది డిసెంబర్ 16న ‘నిర్భయ’పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డ నిందితులు, తమ ఘాతుకాన్ని ఎవరికీ తెలియకుండా చేసేందుకు బాధితురాలిని, ఆమె స్నేహితుడిని చంపాలనుకున్నారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాన్ కృష్ణన్ శనివారం కోర్టుకు వెల్లడించారు. ఇనుప రాడ్‌తో బాధితురాలి పేగును ఛిద్రం చేసేశారని, ఫలితంగా తీవ్ర రక్తస్రావం జరిగి, ఆమె మరణించిందని వివరించారు. మొద్దుబారిన ఇనుపరాడ్లతో బాధితురాలిపైన, ఆమె స్నేహితుడిపై దాడిచేసి, దారుణంగా గాయపరచారని, వారిని హతమార్చే ఉద్దేశంతోనే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పారు.
జరిగిన ఘాతుకానికి సంబంధించిన వివరాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు, వారు బాధితులిద్దరినీ తుదముట్టించాలనుకున్నారని అన్నారు. నిందితుల్లో మృతుడైన రామ్‌సింగ్, అతడి సోదరుడు ముకేశ్‌లతో పాటు వినయ్, అక్షయ్, పవన్, బాల నేరస్తుడు ‘నిర్భయ’పై కదులుతున్న బస్సులో అత్యాచారానికి ఒడిగట్టారన్నారు. నిందితుల దాడిలో ‘నిర్భయ’ స్నేహితుడి కాళ్లు, చేతులు విరిగాయని చెప్పారు. బాధితులను దోచుకోవడమే కాకుండా, వారిని కదులుతున్న బస్సు నుంచి బయటకు తోసేశారని, తర్వాత వారి మీదుగా బస్సును నడిపేందుకు ప్రయత్నించారని తెలిపారు.