దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిసెంబర్ 16 ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులు దోషులే అని ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది. నిస్సహాయురాలైన బాధితురాలిపై అత్యాచారం, హత్య అభియోగాల్లో ముఖేష్‌కుమార్(26), వినయ్‌శర్మ(20), అక్షయ్ ఠాకూర్(28), పవన్‌గుప్తా(19)లను దోషులుగా ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. సంప్రదాయ ఆధారల ప్రకారమే కాక, శాస్త్రీయమైన డీఎన్‌ఏ నమూనాల ఆధారంగా వీరిని దోషులుగా నిర్ధారించింది. విచారణ సమయంలో మరణించిన నిందితుడు రాంసింగ్‌ను కూడా కోర్టు దోషిగా తేల్చింది. అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ, ఆధారాలను నాశనం చేయడం, అసహజ నేరాలు తదితర 13 అభియోగాల్లో నిందితులను దోషులుగా నిర్దారించింది. ఈ మేరకు సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి యోగేష్ ఖన్నా మంగళవారం 237 పేజీల తీర్పును వెలువరించారు. నిందితులందరూ కలిసి నిస్సహాయురాలైన బాధితురాలిని హత్య చేసినట్టు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని, ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర), 376(2)(జీ)(సామూహిక అత్యాచారం) ప్రకారం నిందితులను దోషులుగా నిర్ధారిస్తున్నామని తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి ప్రకటించారు. వీటితో పాటు సామూహిక అత్యాచారం, అసహజ నేరాలు, సాక్ష్యాలను మాయం చేయడం, హత్యాయత్నం తదితర నేరాలకు నిందితులు పాల్పడినట్టు నిర్ధారించారు. వైద్య సహాయం అందడంలో ఆలస్యం, చికిత్స సమయంలో ఇన్‌ఫెక్షన్ సోకడం వల్లే బాధితురాలు చనిపోయిందన్న డిఫెన్స్ లాయర్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. నిర్భయ కేసులో తీర్పు సందర్భంగా కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది. బుధవారం నిందితులకు శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నలుగురికి విధించే శిక్షపై న్యాయస్థానంలో బుధవారం ఉదయం 11 గంటలకు వాదప్రతివాదనలు జరుగనున్నాయి.
Published Wed, Sep 11 2013 10:27 AM | Last Updated on Thu, Mar 21 2024 9:11 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement