Delhi government schools
-
ఢిల్లీలో దారుణం.. విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి విసిరేసిన టీచర్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థిని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని టీచర్ మొదటి అంతస్తు నుంచి బయటకు విసిరేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో పనిచేసే నగర్ నిగమ్ బాలికా విద్యాలయంలో ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారిని వందనగా గుర్తించారు. బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. చిన్నారిని మొదటి అంతస్తు నుంచి తోసేసే ముందు విద్యార్థినిపై టీచర్ గీతా దేశ్వాల్ కత్తెరతో దాడి చేసింది. గమనించిన రియా అనే మరో టీచర్ చిన్నారిని కొట్టకుండా అడ్డుకుకునేందుకు ప్రయత్నించింది. అయినా వినకుండా కోపంతో టీచర్ వందనను క్లాస్ రూమ్‌లోని బాల్కనీ నుంచి కిందకు తోసేసింది. వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసీలు తీవ్రంగా గాయపడిన చిన్నారిని బారా హిందూ రావు అసుపత్రికి తలించారు. విద్యార్థినికి అవసరమైన అన్ని పరీక్షలు చేశామని, ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని చికిత్సకు స్పందిస్తుందని వైద్యులు తెలిపారు. అయితే బాలిక చికిత్సకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. ఈ ఘోరానికి పాల్పడిన ఉపాధ్యాయురాలు గీతా దేశ్వాల్ను సస్పెండ్ చేశామని, దీనిపై విచారణ జరుగుతోందని ఎమ్సీడీ సీనియర్ అధికారి తెలిపారు. నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా చౌహాన్ తెలిపారు. చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి.. -
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా
-
చిన్నారుల స్వాగతానికి మెలానియా ఫిదా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్లో ‘హ్యాపినెస్ క్లాసు’లను ఆమె పరిశీలించారు. హైదరాబాద్ హౌజ్‌లో భారత ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో మెలానియా ట్రంప్ ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మెలానియాకు సాదర స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ పద్దతిలో బొట్టు పెట్టి మంగళ హారతులతో మెలానియాను స్వాగతం పలికారు. చిన్నారుల స్వాగతానికి మెలానియా మురిసిపోయారు. అనంతరం ఓ తరగతి గదిలోకి వెళ్లిన మెలానియా విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి ‘హ్యాపీనెస్ క్లాస్’ నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు మహిళా టీచర్లు మెలానియా వెంట ఉన్నారు. టీచర్లు అడిగిన ప్రశ్నలకు చిన్నారులు చక్కగా సమాధానం చెప్పారు. పాటలు, సంగీతం, ఆటలపై తమకు ఉన్న మక్కువను వివరించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు చేసిన నృత్యాలను మెలానియా తిలకించారు. అనంతరం మెలానియా మాట్లాడుతూ.. పాఠశాల విద్యావిధానం చాలా బాగుందని కితాబిచ్చారు. విద్యార్థులు తనపై చూపించిన ప్రేమ, అప్యాయత మరవలేనిదన్నారు. ఈ పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా మంచి నడవడికను నేర్పించడం బాగుందని మెలానియా పేర్కొన్నారు. (చదవండి : సైనిక వందనం స్వీకరించిన ట్రంప్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సర్కారీ స్కూళ్ల హవా
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల - 99.6 శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించిన ఢిల్లీ విద్యార్థి సార్థక్ అగర్వాల్ సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పన్నెండో తరగతి ఫలితాల్లో ఢిల్లీ సర్కారీ పాఠశాలలు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. దేశంలోని మిగతా సీబీఎస్ఈ అనుబంధ సంస్థల కంటే నగరంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులతో ప్రభంజనం సృష్టించారు. గురువారం విడుదల చేసిన పన్నెండో తరగతి ఫలితాల్లో 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 88.62 శాతం మంది పాస్ అయ్యారని సీబీఎస్ఈ తెలిపింది. గతేడాది 85.17 శాతం ఉత్తీర్ణత సాధించిన ఢిల్లీ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఈసారి 86.66 శాతంతో ప్రభంజనం సృష్టించాయి. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయ సంస్థల్లో ఉత్తీర్ణత శాతం 97.56 నుంచి 98.02 శాతానికి పెరిగింది. ఇదిలావుండగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో గతేడాది 97.06 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈసారి 93.94కి పడిపోయింది. కాగా, ఢిల్లీ ప్రాంతంలో సైన్స్ విద్యార్థులలో డీపీఎస్ వసంత్ కుంజ్‌కు చెందిన సార్థక్ అగర్వాల్ అగ్రస్థానంలో నిలిచాడు. అతనికి 99.6 శాతం మార్కులు వచ్చాయి. కామర్స్ విభాగంలో డీపీఎస్ ఆర్కే పురం విద్యార్థిని వ్రుందా 98.4 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించింది. బాలికలదే పైచేయి సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. బాలుర కన్నా పది శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. 91.72 శాతం మంది బాలికలు, 82.09 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కూడా 91.42 శాతంతో బాలికలు, 82.44 శాతంతో బాలురు ఉత్తీర్ణత సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి దేశంలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచినట్టు భావిస్తున్న సర్థాక్ అగర్వాల్ మాట్లాడుతూ తాను ఎలాంటి ట్యూషన్‌కు వెళ్లలేదని, పరీక్షలకు ముందు చదువుపైనే ఎక్కువ ఏకాగ్రత సాధించానని తెలిపాడు. సెంట్రల్ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి పాఠశాల విద్యార్థి జి.హరికృష్ణ కామర్స్ విభాగంలో 99.2 శాతంతో మొదటి స్థానంలో నిలిచాడు. డీపీఎస్ ఇంద్రాపుర విద్యార్థి ముగ్ధ్ సేథియా, వసంత్ వాలీ పాఠశాలకు చెందిన వసుధా దీక్షిత్ హ్యుమనీటిస్ విభాగంలో 98.8 శాతంతో టాపర్లుగా నిలిచారు. చీటింగ్ కేసులు నమోదు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీలోనే అత్యధికంగా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పొల్చుకుంటే మాస్ కాపీరాయుళ్ల సంఖ్య తగ్గింది. గతేడాది 25 కేసులు నమోదు కాగా, ఈసారి వాటి సంఖ్య 13కి తగ్గిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఏడు కేసులతో పాట్నా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, డెహ్రాడూన్, పంచ్‌కుల, గౌహతి, చెన్నై, అలహాబాద్‌లు ఉన్నాయి. కేజ్రీవాల్ కుమార్తెకు 96 శాతం మార్కులు న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత 96 శాతం మార్కులు సాధించింది. ‘ నా తల్లిదండ్రులే నాకు ఆదర్శప్రాయులు. ఐఐటీలో ఏదో ఒక కోర్సును చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఐఐటీలో అడ్మిషన్ సంపాదించడమే’నని సైన్స్ విభాగ విద్యార్థిని అయిన హర్షిత తెలిపింది.