న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థిని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని టీచర్ మొదటి అంతస్తు నుంచి బయటకు విసిరేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో పనిచేసే నగర్ నిగమ్ బాలికా విద్యాలయంలో ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారిని వందనగా గుర్తించారు. బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. చిన్నారిని మొదటి అంతస్తు నుంచి తోసేసే ముందు విద్యార్థినిపై టీచర్ గీతా దేశ్వాల్ కత్తెరతో దాడి చేసింది. గమనించిన రియా అనే మరో టీచర్ చిన్నారిని కొట్టకుండా అడ్డుకుకునేందుకు ప్రయత్నించింది. అయినా వినకుండా కోపంతో టీచర్ వందనను క్లాస్ రూమ్‌లోని బాల్కనీ నుంచి కిందకు తోసేసింది.
వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసీలు తీవ్రంగా గాయపడిన చిన్నారిని బారా హిందూ రావు అసుపత్రికి తలించారు. విద్యార్థినికి అవసరమైన అన్ని పరీక్షలు చేశామని, ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని చికిత్సకు స్పందిస్తుందని వైద్యులు తెలిపారు. అయితే బాలిక చికిత్సకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది.
ఈ ఘోరానికి పాల్పడిన ఉపాధ్యాయురాలు గీతా దేశ్వాల్‌ను సస్పెండ్ చేశామని, దీనిపై విచారణ జరుగుతోందని ఎమ్‌సీడీ సీనియర్ అధికారి తెలిపారు. నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా చౌహాన్ తెలిపారు.
చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి..
Comments
Please login to add a commentAdd a comment