Delhi High Court Orders
-
ఏపీలో ఆ చానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నిలిపివేసిన చానళ్ల ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 6 నుంచి ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ మిని పుష్కర్ణ మంగళవారం విచారించారు. ఆయా చానళ్లను పునరుద్ధరించాలని కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. లిఖితపూర్వక ఆదేశాలు ఇంకా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ (ఎన్బీఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా తీసుకొన్న నిర్ణయంపై కొరడా లాంటి ఆదేశాలుగా అభివరి్ణంచింది. ‘ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించే ప్రాముఖ్యతను హైకోర్టు జోక్యం నొక్కి చెబుతోంది. ఈ తీర్పు పత్రికా స్వేచ్ఛను సమరి్థంచడం, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంపై ఓ ఉదాహరణగా నిలుస్తుంది’ అని మంగళవారం ఎన్బీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
గౌతమ్ నవ్‌లఖాకు విముక్తి
న్యూఢిల్లీ: గృహ నిర్బంధంలో ఉన్న హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. భీమా–కోరెగావ్ హింసకు కారణమంటూ గౌతమ్ నవ్లఖా సహా అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు మేరకు ఆయన తరఫున ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ వినోద్ గోయెల్‌ల ధర్మాసనం విచారించింది. నవ్‌లఖాను ట్రాన్సిట్ రిమాండ్‌కు ఆదేశిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆగస్టు 29న వెలువరించిన ఉత్తర్వులను కోర్టు కొట్టి వేసింది. ‘రాజ్యాంగంలోని ప్రాథమిక నియమాలకు వ్యతిరేకంగా, నేర శిక్షా స్మృతికి వ్యతిరేకంగా ఆ ఉత్తర్వులు ఉన్నాయి. చట్ట ప్రకారం నవ్లఖా 24 గంటల గృహ నిర్బంధం పూర్తయింది. ఫలితంగా ఆయన గృహ నిర్బంధం ముగిసినట్లే. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాబోవు’ అని కోర్టు స్పష్టం చేసింది. -
చిదంబరంనకు సమన్లు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంపై ఈనెల 6వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంనకు సీబీఐ సమన్లు జారీ చేసింది. మే 31వ తేదీనే సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా చిదంబరం విజ్ఞప్తి మేరకు 6వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో జూలై 3వ తేదీ వరకు చిదంబరంను అరెస్టు చేయరాదంటూ ఢిల్లీ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మీడియా ప్రముఖులు పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిలు ప్రమోటర్లుగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ గత ఏడాది కేసు నమోదు చేసింది. ఈ కేసులో రూ.10 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలపై చిదంబరం కుమారుడు కార్తీని సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. -
వాటిని ప్రచారానికి వాడుకోరాదు
- ప్రజాధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, బహిరంగ ప్రదేశాల్ని ఉపయోగించుకోరాదు - రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, బహిరంగ ప్రదేశాల్ని ప్రచారం కోసం వినియోగించుకోరాదని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి కె.ఎఫ్.విల్ఫ్రెడ్ ఈ మేరకు అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు/ప్రధాన కార్యదర్శులు/చైర్పర్సన్లు/కన్వీనర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ, పార్టీ గుర్తు గురించి ప్రచారం చేసుకోవడానికి అన్ని పార్టీలకు సమాన అవకాశాలున్నప్పుడే స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బీఎస్పీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు బహిరంగ స్థలాలు, ప్రజాధనాన్ని పార్టీలు ప్రచారానికి వినియోగించుకోవడంపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ జూలై 7న ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల్ని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన అన్ని పార్టీల అభిప్రాయాలనూ స్వీకరించింది. వాటి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న సీఈసీ తాజాగా ఈ అంశంపై అన్ని పార్టీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ పార్టీ ప్రజాధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, బహిరంగ ప్రదేశాల్ని ప్రచారానికి వినియోగించుకోరాదని అందులో స్పష్టం చేసింది. పార్టీ, గుర్తుల ప్రచారానికి ప్రభుత్వ స్థలాల్ని వినియోగించుకోరాదని సూచించింది. దీన్ని ఉల్లంఘిస్తే రాజకీయపార్టీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
బొగ్గు క్షేత్రాల కేసులో జిందాల్‌కు ఊరట
వేలం నుంచి మూడు బ్లాకుల ఉపసంహరణకు కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల వేలం వ్యవహారంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్), ఆ సంస్థ ప్రమోటర్ నవీన్ జిందాల్‌కు పెద్ద ఊరట లభించింది. సంస్థ అభివృద్ధి చేసిన మూడు బొగ్గు క్షేత్రాలను ప్రస్తుత వేలం ప్రక్రియ నుంచి ఉపసంహరించాలని కేంద్రాన్ని జస్టిస్ బాదర్ దురేజ్ అహ్మద్, సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించింది. వీటిలో ఒడిస్సాలోని ఉత్కల్ బీ1, బీ2 క్షేత్రాలు, ఛత్తీస్‌గడ్‌లోని గారీ ప్లామా క్షేత్రాలు ఉన్నాయి. బ్లాక్‌ల్లో బొగ్గు ఉత్పత్తిజరిగే సమయంలో ‘అంతిమ వినియోగ’ రంగాన్ని మార్చడం, ఈ మేరకు తిరిగి వేలం వేయడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. తాజా వేలం ప్రక్రియకు బీ1, బీ2 క్షేత్రాల విలీనమూ సరికాదని, టెక్నికల్ కమిటీ ఈ విషయంలో తగిన విధంగా ఆలోచన చేయలేదని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని తిరిగి సమీక్షించాలని బొగ్గు మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే సంబంధిత టెక్నికల్ కమిటీని ఆదేశించింది. వాదన ఇదీ...: ప్రభుత్వం ఇందుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వల్ల తమ ప్రస్తుత స్టీల్ ప్లాంట్‌పై వెచ్చించిన రూ.24,000 కోట్ల పెట్టుబడులకు విఘాతం కలిగే అవకాశం ఉందని సంస్థ కోర్టుకు విన్నవించింది. ఈ బ్లాకుల నుంచి ఉత్పత్తయ్యే బొగ్గును స్టీల్ అండ్ ఐరన్ విభాగానికి కాకుండా విద్యుత్ రంగానికి బదలాయించాలన్న తాజా నిబంధనతో... వీటికి తిరిగి తమ సంస్థ బిడ్డింగ్ వేయలేని పరిస్థితి సైతం నెలకొందని కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వానికి ‘అంతిమ వినియోగం’ అంశాన్ని మార్చే హక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. తాజా కోర్టు రూలింగ్ నేపథ్యంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేరు ధర దాదాపు 6 శాతం పెరిగింది. కోల్ ఆర్డినెన్స్ 2014లో ‘పరిహారం’ నిబంధనల రూపకల్పన విధానాన్ని సవాలుచేస్తూ, జీవీకే పవర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇటీవలే కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23వ తేదీలోపు ఈ పిటిషన్‌పై వైఖరి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రంగానికి సంబంధించి మరో కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్ ఇవ్వడం గమనార్హం. వేలం ప్రక్రియ ఆలస్యం కాదు: కేంద్రం కాగా తాజా పరిస్థితిపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, బొగ్గు వేలం ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాబోదని స్పష్టం చేశారు. హైకోర్టు రూలింగ్‌ను ప్రభుత్వం గౌరవిస్తుందని కూడా తెలిపారు.