బొగ్గు క్షేత్రాల కేసులో జిందాల్‌కు ఊరట | Coal auction process won't be delayed: Piyush Goyal on HC order | Sakshi

బొగ్గు క్షేత్రాల కేసులో జిందాల్‌కు ఊరట

Published Thu, Feb 12 2015 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

బొగ్గు క్షేత్రాల కేసులో జిందాల్‌కు ఊరట

బొగ్గు క్షేత్రాల కేసులో జిందాల్‌కు ఊరట

బొగ్గు క్షేత్రాల వేలం వ్యవహారంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్‌పీఎల్), ఆ సంస్థ ప్రమోటర్ నవీన్ జిందాల్‌కు పెద్ద ఊరట లభించింది.

వేలం నుంచి మూడు బ్లాకుల ఉపసంహరణకు కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల వేలం వ్యవహారంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్‌పీఎల్), ఆ సంస్థ ప్రమోటర్ నవీన్ జిందాల్‌కు పెద్ద ఊరట లభించింది. సంస్థ అభివృద్ధి చేసిన మూడు బొగ్గు క్షేత్రాలను ప్రస్తుత వేలం ప్రక్రియ నుంచి ఉపసంహరించాలని కేంద్రాన్ని జస్టిస్ బాదర్ దురేజ్ అహ్మద్, సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించింది. వీటిలో ఒడిస్సాలోని ఉత్కల్ బీ1, బీ2 క్షేత్రాలు, ఛత్తీస్‌గడ్‌లోని గారీ ప్లామా క్షేత్రాలు ఉన్నాయి.

బ్లాక్‌ల్లో బొగ్గు ఉత్పత్తిజరిగే సమయంలో ‘అంతిమ వినియోగ’ రంగాన్ని మార్చడం, ఈ మేరకు తిరిగి వేలం వేయడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. తాజా వేలం ప్రక్రియకు బీ1, బీ2 క్షేత్రాల విలీనమూ సరికాదని,  టెక్నికల్ కమిటీ ఈ విషయంలో తగిన విధంగా ఆలోచన చేయలేదని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని తిరిగి సమీక్షించాలని బొగ్గు మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే సంబంధిత టెక్నికల్ కమిటీని ఆదేశించింది.
 
వాదన ఇదీ...: ప్రభుత్వం ఇందుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వల్ల తమ ప్రస్తుత స్టీల్ ప్లాంట్‌పై వెచ్చించిన రూ.24,000 కోట్ల పెట్టుబడులకు విఘాతం కలిగే అవకాశం ఉందని సంస్థ కోర్టుకు విన్నవించింది. ఈ బ్లాకుల నుంచి ఉత్పత్తయ్యే బొగ్గును స్టీల్ అండ్ ఐరన్ విభాగానికి కాకుండా విద్యుత్ రంగానికి బదలాయించాలన్న తాజా నిబంధనతో... వీటికి తిరిగి తమ సంస్థ బిడ్డింగ్ వేయలేని పరిస్థితి సైతం నెలకొందని కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వానికి ‘అంతిమ వినియోగం’ అంశాన్ని మార్చే హక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. తాజా కోర్టు రూలింగ్ నేపథ్యంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేరు ధర దాదాపు 6 శాతం పెరిగింది.  

కోల్ ఆర్డినెన్స్ 2014లో ‘పరిహారం’ నిబంధనల రూపకల్పన విధానాన్ని సవాలుచేస్తూ, జీవీకే పవర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇటీవలే కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23వ తేదీలోపు ఈ పిటిషన్‌పై వైఖరి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రంగానికి సంబంధించి మరో కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్ ఇవ్వడం గమనార్హం.
 
వేలం ప్రక్రియ ఆలస్యం కాదు: కేంద్రం
కాగా తాజా పరిస్థితిపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, బొగ్గు వేలం ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాబోదని స్పష్టం చేశారు. హైకోర్టు రూలింగ్‌ను ప్రభుత్వం గౌరవిస్తుందని కూడా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement