విద్రోహశక్తులతో దేశ సమగ్రతకు ముుప్పు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
విజయవాడ(గుణదల) : విదేశీ సిద్ధాంతాలను భారతదేశంపై ప్రయోగిస్తున్నారని, అందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు వంత పాడుతున్నాయని, దేశ సమగ్రతను బలహీనపరచటానికి కొన్ని జాతి విద్రోహ శక్తులు కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రయత్నిస్తున్నాయని వాటిని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం ఎన్టీయార్ యూనివర్సిటీ సమీపంలోని వెన్యూ ఫంక్షన్హాల్లో ‘అమరవీరులకు అవమానం-దేశం సహించదు’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని ప్రసంగించారు. పేదల జీవన ప్రమాణాలు పెంచటానికి కేంద్రం కృషి చేస్తుంటే కాంగ్రెస్, వామపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఆయా పార్టీలు చైనా, పాకిస్తాన్, రష్యా దేశాల సిద్ధాంతాలను మన దేశంలో అమలు చేసేందుకు దళితులను, మతం పేరుతో మైనార్టీలను విభజిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు లాంటి నేతలతో ఉగ్రవాదంతో మిళితమైన నాయకులను పోల్చటం అవమానకరమన్నారు. దేశ సమగ్రతను బలహీన పరచటానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరంతరం శ్రమిస్తున్నారని విమర్శించారు. మోడీ అభివృద్దిని భరించలేక ఆయా పార్టీలు విద్యార్థులను వినియోంచుకుని లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో 740 యూనివర్సిటీలకుగాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ జేఎన్‌యూలో మాత్రమే ఉగ్రవాదులకు అనుకూలంగా నినాదాలు చేశారని, ఇలాంటి తప్పుడు సంకేతాలిస్తున్న పార్టీలను ప్రజలు తిరస్కరించారని కోరారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో గత 10 ఏళ్లుగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే మోడీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ క్రమ శిక్షణ కలిగిన సంస్థలని, తాను విద్యార్థి నాయకునిగా ఏబీవీపీలో పని చేసి కేంద్ర స్థాయికి ఎదిగానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ అంటే రెడీ టూ సోషల్ సర్వీస్ అన్ని అర్థాన్ని ఇచ్చారు. భారతమాతాకీ జై అంటే భారత ప్రజలు వర్థిల్లాలనే నినాదమని వివరించారు. కమ్యునిజంలో నిజం లేదని, కమ్యూనిస్టు నాయకులు నిరంతరం సినీతారలు, వస్త్రధారణ గురించే చర్చిస్తుంటారని, కన్హయ్య భావ దరిద్రుడని విమర్శించారు.
దేశ రక్షణ కోసం ప్రతి కుటుంబం నుంచి ఓ యువకుడ్ని జాతికి అంతితమివ్వాలని కోరారు. సభ జరుగుతున్నంత సేపూ భారతమాతాకీ జై అనే నినాదాలతో హాలు దద్దరిల్లింది. కార్యక్రమంలో మాజీ మంత్రి భాజపా నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, భాజపా ఎస్సీ మెర్చ రాష్ర్ట అధ్యక్షులు దారా సాంబయ్య, మైనార్టీ విభాగం నాయకులు షేక్ భాష, పార్టీ నగర ఉపాధ్యక్షులు దాసం ఉమామహేశ్వరరాజు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.