‘హస్తిన’లో ముక్కోణం
* ‘ఆప్’ రాకతో మారిన రాజకీయ ముఖచిత్రం
* సిట్టింగ్ ఎంపీలనే బరిలోకి దించిన కాంగ్రెస్
* మోడీ ప్రభావంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ
శ్రీదేవి - సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 10న జరగనున్న లోక్‌సభ ఎన్నికలు యావద్దేశానికి ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలు ఉండగా, ఇక్కడి నుంచి స్థానాలు చేజిక్కించుకున్న పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం ఒకటిరెండు సార్లు మినహా పలుసార్లు నిజమైంది. ఢిల్లీ పరిధిలో న్యూఢిల్లీ, చాందినీచౌక్, సౌత్ ఢిల్లీ, నార్త్‌వెస్ట్ ఢిల్లీ, నార్త్ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానాలు ఉండగా, వీటిలో నార్త్‌వెస్ట్ ఢిల్లీ రిజర్వ్డ్ స్థానం. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ వాసులు ఈ ఏడు లోక్‌సభ స్థానాలనూ కాంగ్రెస్‌కే కట్టబెట్టారు. దాదాపు 1.20 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న ఢిల్లీలో 13 మంది మహిళలు సహా 150 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు వచ్చి ఉంటున్నా, ఢిల్లీ రాజకీయాల్లో కుల మతాలు ఇంకా కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. ధరల పెరుగుదల, తాగునీటి సమస్య, అధిక విద్యుత్ చార్జీలు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఢిల్లీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఇదివరకటి షీలా దీక్షిత్ సర్కారు ఇతోధికంగా కృషి చేసినా, స్థానిక సమస్యల పరిష్కారంలో వైఫల్యం కారణంగా ఓట ర్లు కాంగ్రెస్‌ను ఓడించారు. గత లోక్‌సభ ఎన్నికల వరకు కాంగ్రెస్, బీజేపీలకే ఢిల్లీ రాజకీయ పోరు పరిమితమై ఉండేది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భావంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా ఢిల్లీలో ఈ లోక్‌సభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే, ఢిల్లీలోనే ‘ఆప్’ బలంగా ఉందనేది నిరాకరించలేని సత్యం.
కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా ఉంటూ వచ్చిన దళితులు, అనధికార కాలనీ వాసులను తనవైపు తిప్పుకొని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసిన ‘ఆప్’ ఇప్పుడు ముస్లింల వైపు దృష్టి సారించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో చూపినంతగా ‘ఆప్’ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 49 రోజులకే అధికారాన్ని వదిలి పలాయనం చిత్తగించిందనే విమర్శ ‘ఆప్’ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. ఢిల్లీ కాంగ్రెస్‌కు పదిహేనేళ్లుగా కేంద్ర బిందువుగా ఉన్న షీలా దీక్షిత్, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఢిల్లీ రాజకీయాల నుంచి నిష్ర్కమించి, కేరళ గవర్నర్‌గా వెళ్లిపోవడంతో, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పెద్ద దిక్కు లేకుండానే బరిలోకి దిగింది. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా, అనుభవానికే పెద్దపీట వేస్తూ సిటింగ్ ఎంపీలనే కాంగ్రెస్ బరిలోకి దించింది.
ఆ నియోజకవర్గాల్లో కులాలే కీలకం
వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించడంలో కులాలదే కీలక పాత్ర. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సైతం లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూపిన చరిత్ర గల సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున రమేశ్‌కుమార్, బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బిదూడీ, ‘ఆప్’ తరఫున దేవేంద్ర సెహ్రావత్ పోటీ చేస్తున్నారు. జాట్, గుజ్జర్ ఓటర్లు ఇక్కడి అభ్యర్థుల తలరాతలను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తారు. వెస్ట్ ఢిల్లీలో సిక్కుల ఓటర్లకు గాలం వేసే లక్ష్యంతో ‘ఆప్’... గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి చిదంబరంపై బూటు విసిరిన జర్నైల్ సింగ్‌ను బరిలోకి దించింది. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మకు టికెట్టు ఇచ్చి, జాట్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. మహాబల్ మిశ్రాను బరిలోకి దించిన కాంగ్రెస్, పూర్వాంచలీ ఓటర్ల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ‘ఆప్’ ప్రొఫెసర్ ఆనంద్ కుమార్‌ను నిలబెట్టింది. తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్ల నుంచి వలసవచ్చిన ఓటర్లను దృష్టిలో ఉంచుకుని భోజ్‌పురి నటుడు, గాయకుడు మనోజ్ తివారీని బీజేపీ బరిలోకి దించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ జేపీ అగర్వాల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తమ్మీద ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ ముక్కోణపు పోటీ ఉత్కంఠభరితంగా మారింది.
మోడీ ప్రభంజనంపై బీజేపీ ఆశలు
తమ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనమే తమను గెలిపిస్తుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఢిల్లీలో పార్టీకి నాయకత్వం వహిస్తున్న హర్షవర్ధన్‌కు గల ‘క్లీన్ ఇమేజ్’ కూడా పార్టీకి సానుకూలాంశంగా ఉంది. హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించింది. అయితే, స్థానికులను కాదని బయటి వారికి టికెట్లు కట్టబెట్టడంతో బీజేపీకి కార్యకర్తల అసంతృప్తి తప్పడం లేదు. స్థానికేతరులకు టికెట్లు కట్టబెట్టిన ‘ఆప్’ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది.
అందరి చూపు చాందినీచౌక్ వైపు...
ఈసారి చాందినీచౌక్ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ్నుంచి కాంగ్రెస్ తరఫున తిరిగి పోటీచేస్తున్న కేంద్ర మంత్రి కపిల్ సిబల్పై బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఇక న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రి అజయ్ మాకేన్, బీజేపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మీనాక్షి లేఖి, ‘ఆప్’ అభ్యర్థిగా పాత్రికేయుడు ఆశిష్ ఖేతాన్ తలపడుతున్నారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా, ‘ఆప్’ నుంచి మహాత్మా గాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ, బీజేపీ నుంచి మహేశ్ గిరి బరిలో ఉన్నారు.