Republic Day 2024: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: దేశ సైనిక శక్తిని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటే 75వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ సిద్ధమైంది. కర్తవ్యపథ్‌లో గంటన్నరపాటు సాగే పరేడ్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సారథ్యం వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ హాజరు కానున్నారు. పరేడ్‌లో క్షిపణులు, డ్రోన్జా మర్లు, నిఘా వ్యవస్థలు, సైనిక వాహనాలపై అమర్చిన మోర్టార్లు, పోరాట వాహనాలను ప్రదర్శించనున్నారు.
మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులతో కూడిన త్రివిధ దళాల కంటింజెంట్ కవాతులో పాల్గొననుంది. గత ఏడాది ఆర్టిలరీ రెజిమెంట్‌లో విధుల్లో చేరిన 10 మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్లు దీప్తి రాణా, ప్రియాంక సెవ్దా సహా మొట్టమొదటిసారిగా స్వాతి వెపన్ లొకేటింగ్ అండ్ పినాక రాకెట్ సిస్టమ్‌కు సారథ్యం వహించనున్నారు. సంప్రదాయ మిలటరీ బ్యాండ్లకు బదులుగా ఈసారి భారతీయ సంగీత పరికరాలైన శంఖ, నాదస్వరం, నాగడ వంటి వాటితో 100 మంది మహిళా కళాకారుల బృందం పరేడ్‌లో పాల్గొననుంది. భారత వైమానిక దళానికి చెందిన 15 మంది మహిళా పైలట్లు వైమానిక విన్యాసాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాల పాటు కొనసాగనుంది.