‘ఆహనా’ పెళ్లంటూ..
ఒకప్పటి బాలీవుడ్ అందాల నటి హేమామాలిని, కండల వీరుడు ధర్మేంద్ర చిన్న కుమార్తె ఆహనా డియోల్ పెళ్లి రిసెప్షన్ ఢిల్లీలో అంగరంగవైభవంగా జరిగింది. ఆహనా వివాహం ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరాతో ముంబైలో ఈ నెల రెండో తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని కపషేరా సరిహద్దులో ఉన్న పెళ్లికొడుకు ఫాంహౌస్‌లో బుధవారం రిసెప్షన్‌ను భారీగా హంగులతో ఏర్పాటుచేశారు. ఇక్కడ జరిగిన వేడుకలో సినీ రంగానికి చెందిన నటుడు ప్రతీక్ బబ్బర్ మాత్రమే కనిపించారు.
ఆహనా పెద్దక్క అయిన ఈషా తన భర్త భరత్ తక్తానీ సహా సందడి చేసింది. రిసెప్షన్‌కు ఎల్కే అద్వానీ, ఫరూక్ అబ్దుల్లా, రాజీవ్ శుక్లా, అబ్దుల్లా, రేణుకా చౌదరి, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, ప్రఫుల్ పాటిల్, సురేష్ కల్మాడీ వంటి వివిధ పార్టీలకు చెందిన బడా రాజకీయ నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముంబైలో ఈ నూతన జంట ఇచ్చిన రిసెప్షన్‌కు బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అతడి భార్య జయ, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్, రేఖా, దీపికా పడుకొనే, సోనాక్షి సిన్హా తదితరులు హాజరైన విషయం తెలిసిందే. కాగా, ఆహనా డియోల్‌కు వరుసకు సోదరులైన సన్నీ, బాబీడియోల్లు ముంబై, ఢిల్లీలో జరిగిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకపోవడం గమనార్హం.