ఢిల్లీకి హజ్ కోటా పెంచాలని డిమాండ్ చేసిన సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: మక్కా యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ఢిల్లీ స్టేట్ హజ్ కమిటీ వెబ్‌సైట్‌ను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ హజ్ కోటాను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఢిల్లీ హజ్ కోటా 1,163 ఉండగా, 8,875 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. హజ్ కోసం ఏర్పాటు చేసిన విమానాలు ఆగస్టు 17 నుంచి మొదలవుతాయని తెలిపారు. హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు, వాక్సినేషన్ కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి హజ్ యాత్రికుల ఎంపిక కోసం కంప్యూటరైజ్డ్ ‘డ్రా ఆఫ్ లాట్స్’(లాటరీ) నిర్వహించారు. ఎంపికైన దరఖాస్తుదారుల పేర్లను కొత్తగా ఆవిష్కరించిన వెబ్‌సైట్‌తో పాటు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా ఉంచుతారని హజ్ కమిటీ సభ్యులు తెలిపారు.