పరిహారం చెల్లించకపోతే.. రైలు వారిదే..
సొంతంగా కార్లు, బస్సులు, విమానాలు ఉన్నావారిని చూశాం. సొంతంగా రైలు ఉన్న వారినెక్కడైనా చూశారా. హిమాచల్ ప్రదేశ్కు చెందిన మేలా రాం, మదన్ లాల్ అనే ఇద్దరు రైతులకు సర్కారీ రైలును దక్కించుకునే ఛాన్స్ వచ్చింది. అయితే వారి ట్రైన్ దక్కుతుందా, లేదా అనేది రైల్వేశాఖపై అధారపడివుంది. అన్నీ సవ్యంగా జరగకపోతే ఈ ఇద్దరు రైతులకు రైలు యోగం పట్టనుంది.
అవును నిజమే... ఏప్రిల్ 16వ తేదీలోపు బాధిత రైతులిద్దరికీ పరిహారం చెల్లించడంలో రైల్వే శాఖ విఫలమైతే ఢిల్లీ - యున జనశతాబ్ది రైలు వారి సొంతమవుతుందని కోర్టు తీర్పు చెప్పింది. రైల్వేట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు సుమారు రూ. 35 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒక వేళ గడుపులోపు ఆ మొత్తాన్ని చెల్లించడంలో రైల్వే శాఖ విఫలమైతే ఢిల్లీ - యున జనశతాబ్ది రైలును ఆ ఇద్దరి రైతులకు అప్పగించాలని చేయాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది.
వివరాల్లోకి వెడితే యునా జిల్లాకు వీరు 1998 లో జరిగిన రైల్వే ట్రాక్ నిర్మాణంలో రామ, మదన్ లాల్ భూములను కోల్పోయారు. దీంతో తమ భూములను కోల్పోయామని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతో కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై 2009లో రామ్ కు ఎనిమిది లక్షలు, మదన్ లాల్ కు సుమారు 27 లక్షల పరిహారం చెల్లించాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇంత భారీ పరిహారం చెల్లించలేమంటూ రైల్వే అధికారులు అప్పీలు కెళ్లారు. దీంతో పరిహారాన్ని తగ్గిస్తూ 2011లో తీర్పు వెలువడింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు కెళ్ళారు రైతులు. అయితే ఈ తీర్పుపై స్టే విధించిన హైకోర్టు , దీనిపై మూడు నెలల్లోపు అప్పీలు చేసుకునే అవకాశంతో పాటు, ఆరువారాల్లో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సిందిగా 2013లో రైల్వే శాఖను ఆదేశించింది.
కానీ ఇప్పటికీ ఆ డబ్బును డిపాజిట్ చేయడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.దీంతో ఆగ్రహించిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించడంలో జరుగుతున్న జాప్యంపై మళ్ళీ కోర్టుకెళ్లారు. దీనిపై స్పందించిన యునా జిల్లా అడిషనల్ , సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ బన్సాల్ ఈ అరుదైన తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 16 వ తేదీలోపు సుమారు రూ. 35 లక్షల పరిహారం రైల్వే శాఖ చెల్లించాలని లేనిపక్షంలో ఏప్రిల్ 16 నుంచి రైలు ను నిలిపివేయాలని ఆదేశించింది. ఢిల్లీ - యున జనశతాబ్ది రైలు ఆ ఇద్దరి రైతుల సొంతమవుతుందని కోర్టు తేల్చి చెప్పింది.