Dengue casess
-
జ్వరం.. వణుకుతున్న జనం!
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఒడిశా కాలనీకి చెందిన బోయ అజయ్, బోయ మరియమ్మల కుమార్తె అక్షర (3) విషజ్వరంతో ఆదివారం మృతి చెందింది. చిన్నారికి తీవ్ర జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఏటూరునాగారంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ సరిగా వైద్యం అందక.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని పోచమ్మవాడకు చెందిన గోస్కుల శ్రీజ (4) అనే చిన్నారి డెంగీ లక్షణాలతో మరణించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు తొలుత సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలిసింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కొత్మీర్ గ్రామానికి చెందిన యువకుడు మిట్టె నాగరాజు (24) ఆదివారం రాత్రి విష జ్వరానికి బలయ్యాడు. అప్పటికే నాలుగైదు రోజులుగా జ్వరంతో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందినా పరిస్థితి మెరుగుకాలేదు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సాక్షి ప్రతినిధి, వరంగల్ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు విజృంభించి జనం అల్లాడుతున్నారు. ప్రస్తుత సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 5,315 డెంగీ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య సంగతేమోగానీ పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏ ఇంటి తలుపు తట్టినా ఒక్కరిద్దరు జ్వరంతో మంచాన పట్టి కనిపిస్తున్నారు. గత ఇరవై రోజులుగా విష జ్వరాల తీవ్రత మరింతగా పెరిగింది. డెంగీ, మలేరియాలతో గత ఐదారు రోజుల్లోనే ఉమ్మడి వరంగల్‌లో నలుగురు మృత్యువాత పడటం ఆందోళనకరం. గోదావరి పరీవాహక ఏజెన్సీ ప్రాంతాల్లో.. ముఖ్యంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ పల్లెల్లో జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. గంటల వ్యవధిలోనే ప్రాణం పోయింది చలాకీగా నవ్వుతూ, నవ్విస్తూ కళ్లముందు తిరిగిన నాబిడ్డ గంటల వ్యవధిలోనే దూరమైపోయింది. గత నెల 28న ఆమెకు జ్వరం వస్తే.. స్థానిక ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లాం. పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చి, సిరప్ రాసిచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి సిరప్ తాగిస్తే తెల్లవారే సరికి జ్వరం తగ్గింది. రెండు రోజులు బాగానే ఉంది. కానీ 30న మధ్యాహ్నం కడుపులో నొప్పి అంటూ వాంతులు చేసుకుంది. వెంటనే ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. రూ.10వేలు అడ్వాన్సుగా తీసుకుని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. కానీ పరిస్థితి సీరియస్‌గా ఉందని, తమ వల్ల కాదంటూ 65 కిలోమీటర్ల దూరంలోని మణుగూరుకు వెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్తుండగానే నా బిడ్డ ప్రాణాలు విడిచింది. – బోయి అజయ్, (అక్షర తండ్రి) ఆందోళన వద్దు.. మలేరియా, డెంగీ జ్వరాల పట్ల ఆందోళన వద్దు. అప్రమత్తంగా ఉంటే చాలు. ఇటీవల జ్వరాలు విజృంభిస్తుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారుల సూచన మేరకు డెంగీ, మలేరియాలను నియంత్రించేందుకు గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాం. జ్వరం లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సహాయం పొందాలి. రక్త పరీక్షలు చేయించుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులకు తగినన్ని మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ సాంబశివరావు,డీఎంహెచ్ఓ, హనుమకొండ -
కోర్టులు ఆదేశిస్తేనే స్పందిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ‘న్యాయస్థానాలు ఆదేశిస్తే తప్ప ప్రభుత్వం స్పందించదా? పరిస్థితులకు అనుగుణంగా అధికార యంత్రాంగం ముందు చూపుతో వ్యవహరించదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏటా ఆదేశాలిస్తే తప్ప తగిన చర్యలు తీసుకోరా? అని నిలదీసింది. రాష్ట్రవ్యాప్తంగా దోమల నివారణకు తీసుకున్న చర్యలతోపాటు డెంగీ సహా ఇతర జ్వరాల కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కౌటూరి పవన్‌కుమార్, కోర్టు సహాయకారి (అమికస్‌క్యూరే), సీనియర్ న్యాయ వాది ఎస్.నిరంజన్‌రెడ్డిని ఆదేశించింది. స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా జ్వరాల బారినపడే ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ నేత రాసిన లేఖను 2019లో హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యం(పిల్)గా విచారణకు స్వీకరించింది. ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచందర్‌రావు, జస్టిస్ టి. వినోద్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం మళ్లీ విచారించింది. రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, నెలలో 2,500 మంది డెంగీబారిన పడ్డారని న్యాయవాది పవన్‌కుమార్ నివేదించారు. కమిటీ సూచనలేంటి? ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఇతర ప్రభుత్వ విభాగాలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని 2019లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీని ఏర్పా టు చేశారా? ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు సమావేశమైంది? ఏమైనా సిఫార్సులు చేసిందా? ఈ సిఫార్సుల అమలు పురోగతి ఏమైనా ఉందా?’అని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. జ్వరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సీఎస్ నేతృత్వంలోని కమిటీ సమావేశాల సమాచారం సమర్పించేందుకు కొంత గడువు ఇవ్వాలని ఏజీ అభ్యర్థించారు. గత నెలలో సీఎం కేసీఆర్ ఈ అంశంపై అన్ని ప్రభుత్వ విభాగాలతో సమీక్షించారని నివేదించారు. వాదనల అనంతరం పూర్తి వివరాలను ఈనెల 29లోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
జిల్లాలో 30 డెంగీ కేసులు
ప్రతి రోజు 300 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం ప్లేట్లేట్స్ తగ్గితే ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాంబాబు వైరా: జిల్లాలో ఇప్పటివరకు 30 డెంగీ కేసులు నమోదయ్యాయని, డెంగీ నిర్థారణకు ఎక్కడ కూడా ప్రైవేట్ ల్యాబ్‌ల్లో సరైన టెస్ట్ కిట్లు లేవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే డెంగీ నిర్థారణ పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. డెంగీకి చికిత్స లేదని, ప్లెట్లేట్స్ తగ్గితే వెంటనే ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందించాలన్నారు. సాధారణంగా 1.52 నుంచి 4.5లక్షల వరకు ప్లేట్లేట్స్ ఉంటాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 20వేలకు పడిపోతేనే రక్త కణాలను రోగి శరీరంలోకి ఎక్కింటే ప్రయత్నం చేయాలన్నారు. అవగాహన లేకపోవటంతో వెంటనే ప్రైవేటు కేంద్రాలకు పరుగులు తీసి ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగీ జ్వరం టైగర్ దోమ ద్వారా వ్యాపిస్తుందని, డెంగీ పరీక్షల్లో ప్రధానంగా మాక్ ఎలీజా పరీక్ష చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామాల్లో ఆర్ఎంపీల వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది.. జ్వరాలకు సంబంధించిన రిజిస్టర్‌ను ఉంచాలని, ప్రతిరోజు జ్వర పీడితుల సంఖ్య నమోదు చేయాలన్నారు. ఆర్ఎంపీలు తప్పకుండా ఆరోగ్య కేంద్రాలకు సమాచారం అందించాలన్నారు. మలేరియా జ్వరం వస్తే ఇంటి మొత్తానికి చికిత్స అందించాలని, అటు తరువాత పరిసరాల పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వైరా, ముదిగొండ, ఖమ్మం రూరల్, అర్భన్, కామేపల్లి, టేకులపల్లి, మణుగూరు, కొత్తగూడెం, చింతకాని, కొణిజర్ల, గుండాల మండలాల్లో డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. నాలుగు చికెన్ గున్యా కేసులను గుర్తించామన్నారు. జిల్లాలో 658 మలేరియా సమాస్యత్మక గ్రామాలను గుర్తించామని, ప్రతిరోజు 300 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, కలెక్టర్, పీఓ, డీఎంఅండ్‌హెచ్‌ఓ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. నెలకు రూ.3వేల మంది నుంచి రక్త నమూనాలను సేకరించాలని, ఇప్పటి వరకు జిల్లాలో 2.60లక్షల మంది నుంచి రక్త నమూనాలను సేకరించామన్నారు. ప్రతివారం డ్రైడే.. ఫ్రైడే నిర్వహించాలని, ఏజెన్సీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని, 1.30 లక్షల మెడికల్ కిట్లను 294 పంచాయతీల్లో అందించామన్నారు. అంతేకాక సింగరేణి ప్రాంతం, నవ భారత్, హేవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ ప్రాంతాల్లో అధికారులను ఏజెన్సీ గ్రామాలను దత్తత తీసుకొని అవసరమైన వైద్య సాయాన్ని అందించేందుకు కృషి చేయాలని సూచించామన్నారు. క్లోరినేషన్, పైప్లైన్ల లీకేజీ లేకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 10లక్షల క్లోరోసిన్ ట్యాబ్లెట్లు, 10వేల మెడికల్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం వైరాలో ఓ ప్రైవేటు ల్యాబ్‌ను పరిశీలించి రక్త పరీక్షలు చేసే విధానాన్ని, అక్కడున్న కిట్లను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను రక్త పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురిచెయ వద్దని సూచించారు. ఆయన వెంట వైద్యురాలు ఎస్. నవ్య, హెచ్ఈఓ రాజు, సిబ్బంది ఉన్నారు.