జిల్లాలో 30 డెంగీ కేసులు | 30 Dengue casess in the District | Sakshi
Sakshi News home page

జిల్లాలో 30 డెంగీ కేసులు

Published Tue, Aug 9 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ను చూపుతున్న ఏఎంఓ డాక్టర్‌ రాంబాబు

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ను చూపుతున్న ఏఎంఓ డాక్టర్‌ రాంబాబు

  • ప్రతి రోజు 300 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం
  • ప్లేట్‌లేట్స్‌ తగ్గితే ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించాలి
  • జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రాంబాబు
  • వైరా: జిల్లాలో ఇప్పటివరకు 30 డెంగీ కేసులు నమోదయ్యాయని, డెంగీ నిర్థారణకు ఎక్కడ కూడా ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో సరైన టెస్ట్‌ కిట్లు లేవని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే డెంగీ నిర్థారణ పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. డెంగీకి చికిత్స లేదని, ప్లెట్‌లేట్స్‌ తగ్గితే వెంటనే ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని అందించాలన్నారు. సాధారణంగా 1.52 నుంచి 4.5లక్షల వరకు ప్లేట్‌లేట్స్‌ ఉంటాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 20వేలకు పడిపోతేనే రక్త కణాలను రోగి శరీరంలోకి ఎక్కింటే ప్రయత్నం చేయాలన్నారు. అవగాహన లేకపోవటంతో వెంటనే ప్రైవేటు కేంద్రాలకు పరుగులు తీసి ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
    డెంగీ జ్వరం టైగర్‌ దోమ ద్వారా వ్యాపిస్తుందని, డెంగీ పరీక్షల్లో ప్రధానంగా మాక్‌ ఎలీజా పరీక్ష చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామాల్లో ఆర్‌ఎంపీల వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది.. జ్వరాలకు సంబంధించిన రిజిస్టర్‌ను ఉంచాలని, ప్రతిరోజు జ్వర పీడితుల సంఖ్య నమోదు చేయాలన్నారు. ఆర్‌ఎంపీలు తప్పకుండా ఆరోగ్య కేంద్రాలకు సమాచారం అందించాలన్నారు. మలేరియా జ్వరం వస్తే ఇంటి మొత్తానికి చికిత్స అందించాలని, అటు తరువాత పరిసరాల పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వైరా, ముదిగొండ, ఖమ్మం రూరల్, అర్భన్, కామేపల్లి, టేకులపల్లి, మణుగూరు, కొత్తగూడెం, చింతకాని, కొణిజర్ల, గుండాల మండలాల్లో డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. నాలుగు చికెన్‌ గున్యా కేసులను గుర్తించామన్నారు.
    జిల్లాలో 658 మలేరియా సమాస్యత్మక గ్రామాలను గుర్తించామని, ప్రతిరోజు 300 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, కలెక్టర్, పీఓ, డీఎంఅండ్‌హెచ్‌ఓ సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. నెలకు రూ.3వేల మంది నుంచి రక్త నమూనాలను సేకరించాలని, ఇప్పటి వరకు జిల్లాలో 2.60లక్షల మంది నుంచి రక్త నమూనాలను సేకరించామన్నారు. ప్రతివారం డ్రైడే.. ఫ్రైడే నిర్వహించాలని, ఏజెన్సీలో సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని, 1.30 లక్షల మెడికల్‌ కిట్లను 294 పంచాయతీల్లో అందించామన్నారు.
    అంతేకాక సింగరేణి ప్రాంతం, నవ భారత్, హేవీ వాటర్‌ ప్లాంట్, ఐటీసీ ప్రాంతాల్లో అధికారులను ఏజెన్సీ గ్రామాలను దత్తత తీసుకొని అవసరమైన వైద్య సాయాన్ని అందించేందుకు కృషి చేయాలని సూచించామన్నారు. క్లోరినేషన్, పైప్‌లైన్ల లీకేజీ లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 10లక్షల క్లోరోసిన్‌ ట్యాబ్లెట్లు, 10వేల మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం వైరాలో ఓ ప్రైవేటు ల్యాబ్‌ను పరిశీలించి రక్త పరీక్షలు చేసే విధానాన్ని, అక్కడున్న కిట్లను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను రక్త పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురిచెయ వద్దని సూచించారు. ఆయన వెంట వైద్యురాలు ఎస్‌. నవ్య, హెచ్‌ఈఓ రాజు, సిబ్బంది ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement