రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా మలేరియా అధికారి రాంబాబు
- ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్థారణ కేంద్రాలు లేవు..
- జిల్లా మలేరియా అధికారి రాంబాబు
ఏన్కూరు: జిల్లాలో 631 మలేరియా కేసులు నమోదు అయినట్లు జిల్లా మలేరియా అధికారి రాంబాబు తెలిపారు. స్థానిక ఆరోగ్యకేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, ల్యాబ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,66,280 మంది నుంచి రక్తనమూనాలు సేకరించినట్లు తెలిపారు. 631 మలేరియా, 31 డెంగీ , 2 చికున్‌గున్యా కేసులు నమోదు అయినట్లు తెలిపారు. జిల్లాలో 650 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. గ్రామాల్లో దోమల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏన్కూరు మండలంలో గత ఏడాది 8 మలేరియా కేసులు నమోదుకాగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. జ్వరం సోకిన వారు వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం పట్టణాల్లో డెంగీ నిర్థారణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగీ నిర్థారణ కేంద్రం లేదన్నారు. డెంగీ పేరు చెప్పి లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ప్లేట్‌లెట్స్ తగ్గిన వ్యక్తిని తడిగుడ్డతో తుడిచి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తాగిస్తే ప్లేట్‌లెట్స్ పెరుగుతయన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది రమణ, మంగీలాల్ పాల్గొన్నారు.