ఖమ్మం వద్ద మున్నేరులో వరద నీరు
- పాల్వంచలో అత్యధికంగా 6.34 సెం.మీ. వర్షపాతం నమోదు
- పంటలకు మేలు
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నైరుతి రుతు పవనాలు మరింతగా బలపడడంతో బుధవారం రెండు మండలాలు (తిరుమలాయపాలెం, గార్ల) మినహా జిల్లావ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. 1.12 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ‘లానిన’ ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. పాల్వంచ మండలంలో భారీ వర్షం (6.34 సెం.మీ. వర్షపాతం) పడింది. భద్రాచలం, టేకులపల్లి మండలాల్లో 3 సెం.మీ.కు పైగా, 13 మండలాల్లో 1 నుంచి 3 సెం.మీ. మధ్య, 23 మండలాల్లో 1 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో అక్కడి వరద నీరు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి, అక్కడి నుంచి గోదావరిలోకి చేరుతోంది. వెంకటాపురం, వాజేడు మండలాల్లోని అనేక చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది. పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్ట్ నిండింది. అశ్వాపురం, మణుగూరు, పినపాక, బూర్గంపాడు, అశ్వారావుపేట, సత్తుపల్లి, ముల్కలపల్లి మండలాల్లోని జలాశయాలు కళకళలాడుతున్నాయి. బయ్యారం చెరువు నీటి మట్టం 16.2 అడుగులకు చేరింది. మైదాన ప్రాంతంలో మాత్రం ఆశించినంతగా వర్షపాతం నమోదవలేదు.
జిల్లాలో సాగులో ఉన్న 2.81 లక్షల ఎకరాలకు ఈ వర్షాలతో మేలు కలిగింది. మైదాన ప్రాంతానికన్నా ఏజెన్సీ ప్రాంతంలోనే ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల సాగు ఎక్కువగా ఉంది. జిల్లాలో సాగు చేసిన 79,000 ఎకరాలలో వేసిన వరికి; 1.22 లక్షల హెక్టార్లలో వేసిన పత్తికి; 24,000 హెక్టార్లలో సాగు చేసిన మిర్చితోపాటు మొక్కజొన్న, కంది వంటి పంటలకు కూడా ఈ వర్షాలు అనుకూలిస్తున్నాయి. మైదాన ప్రాంతంలో ఖరీఫ్ పంటలు వేయని నాగార్జున సాగర్ ఆయకట్టు భూముల్లో కూడా ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు.