భూ నిర్వాసితులతో మాట్లాడుతున్న జేసీ దివ్య
- జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య
జూలూరుపాడు: జిల్లా వ్యాప్తంగా సాదా బైనామాకు 2,01,762 దరఖాస్తులు వచ్చాయని వాటిని ఆన్‌లైన్ చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) దివ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక తహసీల్‌లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. పడమటనర్సాపురంలో హరితహారం కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా దీపం పథకం కింద ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ మంజూరుచేసి, పొగ రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. చౌకSదుకాణాల ద్వారా రేషన్ బియ్యం లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ జరిగిలే పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకముందు తహసీల్దార్, డీటీ, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలతో సాదా బైనామా దరఖాస్తుల ఆన్‌లైన్, ప్రజా పంపిణీ వ్యవస్థపై జేసీ దివ్య సమీక్షించారు. పడమటనర్సాపురం పవర్ గ్రిడ్ భూ నిర్వాసితులు తమకు ప్యాకేజీ డబ్బులు ఇచ్చారు గానీ, భూమి కోల్పోయినందుకు నష్ట పరిహారం ఇవ్వలేదని చింతలపుడి వెంకటేశ్వర్లు, నాగయ్యలకు చెందిన కూతుళ్లు, దామెర్ల పటేల్, నాగమ్మ అనే వారు జేసీని కలిసి తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. పాపకొల్లు, కాకర్ల గ్రామాలకు చెందిన రైతులు కొందరు పట్టా పాసు పుస్తకాలు ఇచ్చారు కానీ, వాటిపై తహసీల్దార్ సంతకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని వాపోయారు. స్పందించిన జేసీ బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పాపకొల్లు రెవిన్యూ భూములను తిరిగి రీసర్వే చేయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కోట రవికుమార్, డీటీ జి. శ్రీనివాసరావు, ఆర్‌ఐలు కె. నరసింహారావు, బి. రాములు, పడమటనర్సాపురం సర్పంచ్ కట్రం మోహన్‌రావు, వీఆర్‌ఓలు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.