in the District
-
జోరుగా వర్షాలు
పాల్వంచలో అత్యధికంగా 6.34 సెం.మీ. వర్షపాతం నమోదు ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నైరుతి రుతు పవనాలు మరింతగా బలపడడంతో బుధవారం రెండు మండలాలు (తిరుమలాయపాలెం, గార్ల) మినహా జిల్లావ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. 1.12 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ‘లానిన’ ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. పాల్వంచ మండలంలో భారీ వర్షం (6.34 సెం.మీ. వర్షపాతం) పడింది. భద్రాచలం, టేకులపల్లి మండలాల్లో 3 సెం.మీ.కు పైగా, 13 మండలాల్లో 1 నుంచి 3 సెం.మీ. మధ్య, 23 మండలాల్లో 1 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో అక్కడి వరద నీరు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి, అక్కడి నుంచి గోదావరిలోకి చేరుతోంది. వెంకటాపురం, వాజేడు మండలాల్లోని అనేక చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది. పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్ట్ నిండింది. అశ్వాపురం, మణుగూరు, పినపాక, బూర్గంపాడు, అశ్వారావుపేట, సత్తుపల్లి, ముల్కలపల్లి మండలాల్లోని జలాశయాలు కళకళలాడుతున్నాయి. బయ్యారం చెరువు నీటి మట్టం 16.2 అడుగులకు చేరింది. మైదాన ప్రాంతంలో మాత్రం ఆశించినంతగా వర్షపాతం నమోదవలేదు. పంటలకు మేలు జిల్లాలో సాగులో ఉన్న 2.81 లక్షల ఎకరాలకు ఈ వర్షాలతో మేలు కలిగింది. మైదాన ప్రాంతానికన్నా ఏజెన్సీ ప్రాంతంలోనే ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల సాగు ఎక్కువగా ఉంది. జిల్లాలో సాగు చేసిన 79,000 ఎకరాలలో వేసిన వరికి; 1.22 లక్షల హెక్టార్లలో వేసిన పత్తికి; 24,000 హెక్టార్లలో సాగు చేసిన మిర్చితోపాటు మొక్కజొన్న, కంది వంటి పంటలకు కూడా ఈ వర్షాలు అనుకూలిస్తున్నాయి. మైదాన ప్రాంతంలో ఖరీఫ్ పంటలు వేయని నాగార్జున సాగర్ ఆయకట్టు భూముల్లో కూడా ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. -
‘ఏజెన్సీ’ జిల్లా ఏర్పాటు చేయాలి
ఆదివాసీ ఐకాస చైర్మన్ చందా లింగయ్య దొర గిరిజనుల రౌండ్ టేబుల్ సమావేశం జూలూరుపాడు : జిల్లాలోని 24 ఏజెన్సీ మండలాలతో కూడిన భద్రాద్రి(కొత్తగూడెం) జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) చైర్మన్ చందా లింగయ్య దొర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గిరిజనుల రౌండ్ టేబుల్ సమావేశం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఏన్కూరు, జూలూరుపాడు, సింగరేణి(కారేపల్లి), గార్ల, బయ్యారం, పెనుబల్లి ఏజెన్సీ మండలాలతోపాటు పాక్షిక గ్రామాలను కలుపుతూ కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. ఏజెన్సీలోని ఖనిజ, నిధి నిక్షేపాలను, ఆదివాసీ ప్రత్యేక బడ్జెట్‌ను మైదాన ప్రాంతాల అభివృద్ధికి పాలకులు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు పొడుగు శ్రీనివాస్, సోది వీరయ్య, జార ఆదినారాయణ, ఆరెం రామయ్య, వాసం రామకృష్ణ దొర, ఈసాల సురేష్, గుగులోతు ధర్మా, బాబురావు, దారావతు కాన్షీరాం, సర్పంచ్‌లు లకావత్ గిరిబాబు, ఈసాల వెంకటేశ్వర్లు, కట్రం మోహన్‌రావు, పాయం వెంకటరమణ, వైస్ ఎంపీపీ కొడెం సీతాకుమారి, జూలూరుపాడు, ఏన్కూరు మండలాల ఏఎస్పీ అధ్యక్షుడు ఈసం నరసింహ, పూసం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 631 మలేరియా కేసులు
ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్థారణ కేంద్రాలు లేవు.. జిల్లా మలేరియా అధికారి రాంబాబు ఏన్కూరు: జిల్లాలో 631 మలేరియా కేసులు నమోదు అయినట్లు జిల్లా మలేరియా అధికారి రాంబాబు తెలిపారు. స్థానిక ఆరోగ్యకేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, ల్యాబ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,66,280 మంది నుంచి రక్తనమూనాలు సేకరించినట్లు తెలిపారు. 631 మలేరియా, 31 డెంగీ , 2 చికున్‌గున్యా కేసులు నమోదు అయినట్లు తెలిపారు. జిల్లాలో 650 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. గ్రామాల్లో దోమల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏన్కూరు మండలంలో గత ఏడాది 8 మలేరియా కేసులు నమోదుకాగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. జ్వరం సోకిన వారు వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం పట్టణాల్లో డెంగీ నిర్థారణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగీ నిర్థారణ కేంద్రం లేదన్నారు. డెంగీ పేరు చెప్పి లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ప్లేట్లెట్స్ తగ్గిన వ్యక్తిని తడిగుడ్డతో తుడిచి ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగిస్తే ప్లేట్లెట్స్ పెరుగుతయన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది రమణ, మంగీలాల్ పాల్గొన్నారు. -
జిల్లాలో 30 డెంగీ కేసులు
ప్రతి రోజు 300 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం ప్లేట్లేట్స్ తగ్గితే ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాంబాబు వైరా: జిల్లాలో ఇప్పటివరకు 30 డెంగీ కేసులు నమోదయ్యాయని, డెంగీ నిర్థారణకు ఎక్కడ కూడా ప్రైవేట్ ల్యాబ్‌ల్లో సరైన టెస్ట్ కిట్లు లేవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే డెంగీ నిర్థారణ పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. డెంగీకి చికిత్స లేదని, ప్లెట్లేట్స్ తగ్గితే వెంటనే ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందించాలన్నారు. సాధారణంగా 1.52 నుంచి 4.5లక్షల వరకు ప్లేట్లేట్స్ ఉంటాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 20వేలకు పడిపోతేనే రక్త కణాలను రోగి శరీరంలోకి ఎక్కింటే ప్రయత్నం చేయాలన్నారు. అవగాహన లేకపోవటంతో వెంటనే ప్రైవేటు కేంద్రాలకు పరుగులు తీసి ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగీ జ్వరం టైగర్ దోమ ద్వారా వ్యాపిస్తుందని, డెంగీ పరీక్షల్లో ప్రధానంగా మాక్ ఎలీజా పరీక్ష చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామాల్లో ఆర్ఎంపీల వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది.. జ్వరాలకు సంబంధించిన రిజిస్టర్‌ను ఉంచాలని, ప్రతిరోజు జ్వర పీడితుల సంఖ్య నమోదు చేయాలన్నారు. ఆర్ఎంపీలు తప్పకుండా ఆరోగ్య కేంద్రాలకు సమాచారం అందించాలన్నారు. మలేరియా జ్వరం వస్తే ఇంటి మొత్తానికి చికిత్స అందించాలని, అటు తరువాత పరిసరాల పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వైరా, ముదిగొండ, ఖమ్మం రూరల్, అర్భన్, కామేపల్లి, టేకులపల్లి, మణుగూరు, కొత్తగూడెం, చింతకాని, కొణిజర్ల, గుండాల మండలాల్లో డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. నాలుగు చికెన్ గున్యా కేసులను గుర్తించామన్నారు. జిల్లాలో 658 మలేరియా సమాస్యత్మక గ్రామాలను గుర్తించామని, ప్రతిరోజు 300 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, కలెక్టర్, పీఓ, డీఎంఅండ్‌హెచ్‌ఓ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. నెలకు రూ.3వేల మంది నుంచి రక్త నమూనాలను సేకరించాలని, ఇప్పటి వరకు జిల్లాలో 2.60లక్షల మంది నుంచి రక్త నమూనాలను సేకరించామన్నారు. ప్రతివారం డ్రైడే.. ఫ్రైడే నిర్వహించాలని, ఏజెన్సీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని, 1.30 లక్షల మెడికల్ కిట్లను 294 పంచాయతీల్లో అందించామన్నారు. అంతేకాక సింగరేణి ప్రాంతం, నవ భారత్, హేవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ ప్రాంతాల్లో అధికారులను ఏజెన్సీ గ్రామాలను దత్తత తీసుకొని అవసరమైన వైద్య సాయాన్ని అందించేందుకు కృషి చేయాలని సూచించామన్నారు. క్లోరినేషన్, పైప్లైన్ల లీకేజీ లేకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 10లక్షల క్లోరోసిన్ ట్యాబ్లెట్లు, 10వేల మెడికల్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం వైరాలో ఓ ప్రైవేటు ల్యాబ్‌ను పరిశీలించి రక్త పరీక్షలు చేసే విధానాన్ని, అక్కడున్న కిట్లను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను రక్త పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురిచెయ వద్దని సూచించారు. ఆయన వెంట వైద్యురాలు ఎస్. నవ్య, హెచ్ఈఓ రాజు, సిబ్బంది ఉన్నారు. -
సాదా బైనామా దరఖాస్తులు 2,01,762
జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య జూలూరుపాడు: జిల్లా వ్యాప్తంగా సాదా బైనామాకు 2,01,762 దరఖాస్తులు వచ్చాయని వాటిని ఆన్లైన్ చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) దివ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక తహసీల్‌లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. పడమటనర్సాపురంలో హరితహారం కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా దీపం పథకం కింద ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ మంజూరుచేసి, పొగ రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. చౌకSదుకాణాల ద్వారా రేషన్ బియ్యం లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ జరిగిలే పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకముందు తహసీల్దార్, డీటీ, ఆర్ఐలు, వీఆర్ఓలతో సాదా బైనామా దరఖాస్తుల ఆన్లైన్, ప్రజా పంపిణీ వ్యవస్థపై జేసీ దివ్య సమీక్షించారు. పడమటనర్సాపురం పవర్ గ్రిడ్ భూ నిర్వాసితులు తమకు ప్యాకేజీ డబ్బులు ఇచ్చారు గానీ, భూమి కోల్పోయినందుకు నష్ట పరిహారం ఇవ్వలేదని చింతలపుడి వెంకటేశ్వర్లు, నాగయ్యలకు చెందిన కూతుళ్లు, దామెర్ల పటేల్, నాగమ్మ అనే వారు జేసీని కలిసి తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. పాపకొల్లు, కాకర్ల గ్రామాలకు చెందిన రైతులు కొందరు పట్టా పాసు పుస్తకాలు ఇచ్చారు కానీ, వాటిపై తహసీల్దార్ సంతకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని వాపోయారు. స్పందించిన జేసీ బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పాపకొల్లు రెవిన్యూ భూములను తిరిగి రీసర్వే చేయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కోట రవికుమార్, డీటీ జి. శ్రీనివాసరావు, ఆర్ఐలు కె. నరసింహారావు, బి. రాములు, పడమటనర్సాపురం సర్పంచ్ కట్రం మోహన్‌రావు, వీఆర్ఓలు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.