గ్రామ పురోణీలన్నీ సక్రమమైపోతాయంటే సంబరపడ్డారు. వాటిపై హక్కులు లభిస్తాయని ఎంతో సంతోషించారు. ఇక క్రయవిక్రయాలతో తమ అవసరాలు తీర్చుకోవచ్చని ఆశపడ్డారు. కానీ సర్కారు చెప్పినవేవీ అమలు చేయలేదు. తొలుత నిబంధనలు వెల్లడించకుండా... కాల క్షేపం చేసి... తీరా ఫీజులు వసూలు చేశాక...
విజయనగరం గంటస్తంభం: ‘సాదాబైనామాలు క్రమబద్ధీకరిస్తాం... రైతులు ఎన్నోఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తున్నాం... ఇక రైతులకు ఇబ్బందులు ఉండవు.’ ఇదీ పాలకులు, పాలకపక్ష నాయకులు చేసిన హైరానా. ఇవన్నీ నిజమేనని నమ్మినరైతులంతా ఎంతో ఆశపడ్డారు. అవస్థలు పడి... డబ్బులు లేకపోయినా అప్పు చేసి దరఖాస్తు చేసుకున్నారు. ఒకటికి పదిసార్లు మీసేవ, రెవె న్యూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరి గారు. కానీ అంతిమంగా వారి దరఖాస్తులన్నీ తిరస్కరించేశారు. జిల్లాలో గ్రామ పురోణీలుగా చెప్పుకునే సాదాబైనామాలు క్రమబద్ధీకరణ ఉత్తమాటగానే మిగిలిపోయింది. రైతులు చేసుకున్న దరఖాస్తుల్లో దాదాపుగా 90శాతం తిరస్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాదాబైనామాలు క్రమబద్ధీకరించేస్తామంటూ గతేడాది అగస్టు 24వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కానీ రైతులకు మొండిచెయ్యే మిగిలింది.
నిబంధనలతో కుచ్చుటోపీ
క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల్లో అధికంగా తిరస్కరించడానికి కారణం ప్రభుత్వ విధానాలేనన్న ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ముందుగా జీవో ఇచ్చినా నిబంధనల విషయంలో చివరి వరకూ స్పష్టతనివ్వలేదు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక్కో నిబంధన విడుదల చేస్తూ వచ్చింది. చివరికి సాదాబైనామాలు క్రమబద్ధీకరణకు మూలమైన ఆర్‌ఓఆర్ చట్టం సడలింపు, సవరణ గురించి మాత్రం చెప్పలేదు. ఈ చట్టం ప్రకారం ఇరువర్గాల రైతులు సమ్మతించాలి. భూమి రికార్డులు, సాదాబైనామా డాక్యుమెంట్లలో విస్తీర్ణం, సర్వే నంబర్లు పక్కాగా ఉండాలి. కానీ ఎప్పుడో రెండు మూడు దశాబ్దాల క్రితం రాసుకున్న డాక్యుమెంట్లు కావడంతో ఇవేవీ కరెక్టుగా లేవు. నమ్మకం మీద భూములు క్రయవిక్రయాలు చేసి రాసుకున్న పత్రాలు కావడంతో ఇవన్నీ వారు కూడా సరిగ్గా చూసుకోలేదు. ఆ విషయం ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఆర్‌ఓఆర్ చట్టం వర్తించకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆపని చేయలేదు. దీనివల్ల రైతులకు నిరాశే మిగిలింది. ఈ నిబంధన ముందే చెబితే రైతులు దరఖాస్తులు చేసేవారే కాదు.
సర్కారుకు దక్కిన ఆదాయం
ప్రభుత్వ వైఖరివల్ల రైతులు నష్టపోయారు. కానీ ప్రభుత్వానికి మాత్రం న్యాయం జరిగింది. క్రమబద్ధీకరణ కోసం రైతులు చాలా పాట్లు పడ్డారు. మీసేవ కేంద్రాలకు వెళ్లి సర్వే నంబర్ల వారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఒక్కో దరఖాస్తుకు రూ.70వేలు రుసుం కట్టారు. ఇక కాగితాలు జెరాక్సులు, ఇతర ఖర్చులకు మరికొంత తగలేశారు. ఇలా ఒక్కో రైతుకు రూ.300ల నుంచి రూ.1000ల ఖర్చు అయిందని తెలుస్తోంది. కానీ ప్రభుత్వానికి మాత్రం దీనివల్ల లబ్ది జరిగిందనే చెప్పుకోవాలి. ఒక్కో దరఖాస్తుకు రూ.70లు రుసుం చెల్లించడంతో రూ. 92.40లక్షల ఆదాయం వచ్చింది. దీనిపై రెవెన్యూ అధికారుల వద్ద ప్రస్తావించగా ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం చేయాలని నిబంధన ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment