సింధు ఇంకా నేర్చుకోవాలి
న్యూఢిల్లీ: అచిరకాలంలోనే సింధు అసాధారణ ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ఆమె ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి టిన్ బౌన్ తెలిపింది. డెన్మార్క్‌కు చెందిన ఈ దిగ్గజం... భారత స్టార్లు సింధు, సైనా నెహ్వాల్‌ల ప్రతిభను కొనియాడింది. మూడు సార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా నిలిచిన బౌన్... సింధు ఎత్తే ఆమెకు వరమని ప్రత్యర్థులపై అటాకింగ్ గేమ్ ఆడేందుకు ఆ ఎత్తే కలిసి వస్తుందని చెప్పింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో ఈ డెన్మార్క్ స్టార్ ముంబై మాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘సైనా, సింధులిద్దరు నాలాగే అగ్రశ్రేణి ప్లేయర్లు. అయితే యువతార సింధు కంటే ఓవరాల్‌గా సైనాయే గొప్ప క్రీడాకారిణి.
ఆమె చాన్నాళ్ల నుంచి నిలకడగా ఆడుతోంది. ఆటపై వంద శాతం అంకితభావాన్ని కనబరుస్తోంది కాబట్టే స్థిరంగా టాప్-5లో కొనసాగుతోంది. ఇలా తొలి ఐదు ర్యాంకుల్లో స్థిరంగా నిలవడమంటే మాటలు కాదు... చేతలు కావాలి. సైనా నిజంగా చేతలతో మెప్పించే క్రీడాకారిణి. సింధు కూడా మేటి క్రీడాకారిణికేం తక్కువ కాదు. కానీ ఆమె ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతోంది. ఆమె ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆటకు మెరుగులు దిద్దుకొని స్థిరంగా రాణించడంపైనే ఆమె దృష్టిసారించాలి’ అని బౌన్ పేర్కొంది. సింధు బాగానే ఆడుతున్నప్పటికీ... వరుసగా కొన్ని పాయింట్లు కోల్పోగానే ఆత్మరక్షణలో పడుతోందని చెప్పింది.
ఈ నేపథ్యంలో ఆమె సరైన దృక్పథంతో ముందడుగు వేయాలని తెలిపింది. సైనాలాగే ఆమె కూడా రాణించాలంటే... స్వల్పకాలంలో సాధించిన విజయాలకు మురిసిపోకుండా ఆటపైనే ధ్యాస పెట్టాలని బౌన్ సూచించింది. ముఖ్యంగా ప్రత్యర్థులపై ఆధిపత్యం చాటేందుకు అవసరమైన అస్త్రాలతో ఆమె సిద్ధం కావాలని చెప్పింది. ‘తాజాగా టాప్-10లోకి ఎగబాకిన సింధు టాప్-5 లక్ష్యంగా తన ఆటతీరును మెరుగుపర్చుకోవాలి. చైనీయులను సైతం ఓడించే సత్తా ఆమెలో ఉంది. అంతకుమించి ఆమెకు మంచి భవిష్యత్తు కూడా ఉంది’ అని బౌన్ చెప్పుకొచ్చింది.
సరైన గుర్తింపు దక్కకపోవడం వల్లే భారత్‌లో ‘డబుల్స్’ ప్రాధాన్యం తగ్గుతోందని టిన్ బౌన్ చెప్పింది. ‘అంతా సింగిల్స్‌నే గొప్పగా చూస్తే... సహజంగా మిగతా కేటగిరీలపై ఆసక్తి సన్నగిల్లుతుంది. మా డెన్మార్క్ డబుల్స్‌కు పెట్టింది పేరు. దీంతో అక్కడ వాళ్లే ఐకాన్ ప్లేయర్లు. కానీ భారత్‌లో సింగిల్స్ క్రీడాకారులే స్టార్లుగా వెలుగొందడంతో డబుల్స్ ప్రాముఖ్యత తగ్గుతోంది’ అని బౌన్ వివరించింది. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌పై చెప్పిన ఆమె కుటుంబంతో సేదతీరుతోంది. అయితే ప్రస్తుత ఐబీఎల్ టోర్నీలో ఆడటం ద్వారా తనలో ఆటకు దూరమయ్యాననే భావన తొలగిపోయిందని ఆమె చెప్పింది.