మనిషే ఓ గ్రంథం...
పఠనాశైలి
మహానగరాల నుంచి మారుమూల పట్టణాల వరకు గ్రంథాలయాలకు ఆదరణ అంతంత మాత్రంగా మారిన కాలం ఇది. యూనివర్సిటీ క్యాంపస్‌లలోని గ్రంథాలయాల దగ్గర యువ‘జన సమ్మర్దం’ కనిపించినా, వారందరూ చదివేది పోటీపరీక్షలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మాత్రమే. కథ, నవల, కవిత్వం వంటి కాల్పనిక సాహిత్యానికి పాఠకులు కరువైపోయిన గడ్డుకాలం ఇది. ఇదంతా మన దేశంలోని పరిస్థితి. పాశ్చాత్య దేశాల్లో దృశ్యం మరోలా ఉంది.
పుస్తకాల్లో ఉన్న విషయాలను మించి తెలుసుకోవాలనే ఉత్సుకత, జిజ్ఞాస గల పాఠకుల కోసం కొన్ని దేశాల్లో ఏకంగా మానవ గ్రంథాలయాలే (హ్యూమన్ లైబ్రరీస్) నడుస్తున్నాయి. మొట్టమొదటి మానవ గ్రంథాలయం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో మొదలైంది. నగరంలోని హింసాకాండకు వ్యతిరేకంగా ప్రారంభమైన యువజన సంస్థ కొత్తగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో 2000 సంవత్సరంలో దీనికి నాంది పలికింది. గడచిన పదిహేనేళ్లలో ఈ మానవ గ్రంథాలయాలు మరిన్ని దేశాలకు విస్తరించాయి. చాలా గ్రంథాలయాలు మామూలు పుస్తకాలతో పాటు మానవ గ్రంథాల సేవలనూ అందిస్తున్నాయి. ఇవి పూర్తిగా ఉచితం. గ్రంథాలుగా ఉండదలచుకున్న వారు నిర్ణీత వేళల్లో గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటారు.
ఆ సమయంలో పాఠకులు ఎవరైనా వారిని ‘చదవ’వచ్చు. అంటే, మరేమీ లేదు... గ్రంథాలుగా అందుబాటులో ఉన్నవారి వద్దకు వెళ్లి కూర్చుంటే చాలు, వారు తమ అనుభవాలను పాఠకులతో పంచుకుంటారు. ప్రస్తుతం హంగేరీ, రుమేనియా, ఆస్ట్రియా, ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, హాలండ్, స్లోవేనియా, బెల్జియం, పోర్చుగల్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇలాంటి మానవ గ్రంథాలయాలు పాఠకులతో కళకళలాడుతున్నాయి. త్వరలోనే బ్రెజిల్, చైనా, కొలంబియా, సైప్రస్, మలేసియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.