హారికను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరణ
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన హారికను హత్య చేసి, అనంతరం కిరోసిన్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఈ మేరకు పలు ఆధారాలను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం హారికను ఏవిధంగా హతమార్చారన్నది తెలుస్తాయన్నారు. కాగా రాక్‌టౌన్ కాలనీలో నివాసం ఉంటున్న మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిషికుమార్‌తో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చెందిన బాణోతు హారిక (24)కు రెండేళ్ల క్రితం వివాహం అయింది.
ఇద్దరూ వరుసకు బావామరదళ్లు. ఇటీవలే హారిక కామినేనిలో బీడీఎస్‌లో చేరింది. అయితే ఆమెకు ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె అనుమానాస్ప స్ధితిలో నిప్పుంటుకొని మృతి చెందింది. భార్య కిరోసిన్ పోసుకుని చనిపోయినట్లు భర్త రిషికుమార్ హారిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని అల్లుడే చంపాడని ఆరోపించారు. గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని హారిక తమతో చాలాసార్లు చెప్పిందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సర్దుకుపోవాలని తాము సూచించామన్నారు. ఎంబీబీఎస్‌లో సీటు వస్తేనే కాపురానికి రావాలని తమ అల్లుడు వేధించేవాడని చెప్పారు.
రిషికుమార్‌కు బయట వేరేవాళ్లతో ఎఫైర్ ఉందని, అంతేకాకుండా అదనపు కట్నం కావాలని వేధించేవాడని హారిక సోదరి తెలిపింది. తన చెల్లెలును... భర్త, అతని కుటుంబసభ్యులు హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. రిషికుమార్‌తో పాటు అతని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.