deo samuel
-
‘అనంత’కు పరీక్షేనా?
- చిత్తూరు డీఈఓగా శామ్యూల్! - ‘అనంత’ డీఈఓపై స్పష్టత ఇవ్వని వైనం - ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం - విద్యాశాఖలో ‘పది’ంతల ఆందోళన అనంతపురం ఎడ్యుకేషన్ : ‘పది’ వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతోంది.. జిల్లాలో ఉత్తీర్ణత శాతంపైనా ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయం ఇది.. ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తేనే మెరుగైన ఫలితాల సాధనకు అవకాశం ఉంటుంది. ఈ నేపధ్యంలో జిల్లా విద్యాధికారి శామ్యూల్‌ను చిత్తూరు డీఈఓ (ఎఫ్ఏసీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం ఆయన అక్కడ బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్ 1న అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా (ఎఫ్ఏసీ) శామ్యూల్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న అనతికాలంలోనే జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు. గాడితప్పిన విద్యాశాఖను ప్రక్షాళన చేసేందుకు పూనుకున్న సమయంలో ఈయనను చిత్తూరుకు బదిలీ కావడం విద్యాశాఖలో చర్చాంశనీయమైంది. ‘అనంత’ డీఈఓపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం అనంతపురం డీఈఓ ఎవరనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశం జరిగితే పలువురికి రెగ్యులర్ డీఈఓలుగా పదోన్నతులు లభిస్తాయి. దీంతో ఖాళీ స్థానాలన్నీ భర్తీ అవుతాయి. ఇప్పటికే జరగాల్సిన డీపీసీ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర సమస్యల కారణంగా మరో రెణ్నెళ్ల దాకా జరగకపోవచ్చని అంచనా. అప్పటిదాకా చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఒకే అధికారిని కొనసాగించే వీలులేదు. ఈ పరిస్థితుల్లో శామ్యూల్‌ను చిత్తూరుకే తీసుకోవాలని అక్కడి కలెక్టర్ చొరవ తీసుకుంటున్నారు. మరి అనంతపురం డీఈఓ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. డీపీసీ జరిగేదాకా అసిస్టెంట్ డైరెక్టర్ పగడాల లక్ష్మీనారాయణకు డీఈఓ బాధ్యతలు అప్పగించే వీలుంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. అక్కడి కలెక్టర్ చొరవతోనే... : చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థజైన్‌కు శామ్యూల్ పట్ల ప్రత్యేక అభిప్రాయం ఉంది. అక్కడి డీఈఓగా పని చేస్తున్న నాగేశ్వరావు, కలెక్టర్ మధ్య ఇటీవల బాగా ఎడం పెరిగినట్లు తెలిసింది. ఈ పరిస్థితులే నాగేశ్వరరావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేలా చేశాయని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో శామ్యూల్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం వెనుక కలెక్టర్ చొరవ ఉన్నట్లు సమాచారం. దీంతో ఆగమేఘాల మీద శనివారం రాత్రి శామ్యూల్‌ను ఇన్చార్జ్గా నియమించడం ఆదివారం ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి. -
మరో వికెట్ ఔట్ !
– ఏడాదిగా బినామితో పని చేయిస్తున్న టీచర్ – డీఈఓ ఆకస్మిక తనిఖీలో బట్టబయలు – సస్పెన్షన్ వేటు వేసిన డీఈఓ అనంతపురం ఎడ్యుకేషన్/ నల్లమాడ : జిల్లా విద్యాశాఖ అధికారిగా శామ్యూల్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఉపాధ్యాయులను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా వేళలు, చెప్పాపెట్టకుండా గైర్హాజరు అంశాలపై డేగకన్ను ఉంచారు. ఈ క్రమంలోనే తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ విధుల్లో నిర్లక్ష్యవైఖరి అవలంభించే వారిపై ఇప్పటికే చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా నల్లమాడలో చాంప్లానాయక్ అనే ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. డీఈఓ మంగళవారం ఉదయం 10.50 గంటలకు నల్లమాడ మండలం డి.రామాపురం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. వాస్తవానికి ఇక్కడ చాంప్లానాయక్, రమాదేవి అనే ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. చాంప్లానాయక్ హెచ్ఎంగా ఉంటున్నారు. తోటి టీచరుకు ఆదర్శంగా ఉండాల్సిన ఈయన ఏడాదిగా అక్కడ తన స్థానంలో బినామీ టీచర్ (మహిళ)ను పెట్టాడు. డీఈఓ తనిఖీలో ఈయనతో పాటు బినామీ టీచరు దొరికిపోయారు. డీఈఓ గ్రామస్తులతో విచారించారు. ఏడాదిగా చాంప్లానాయక్ టీచర్‌ను చూడలేదని ఆయన స్థానంలో మరో మహిళ టీచరు వస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో చాంప్లానాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. -
నిర్లక్ష్యపు టీచర్లపై కొరడా!
- నగరంలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు - సమయపాలన పాటించని నలుగురు టీచర్లపై చర్యలకు సిఫారసు పంతుళ్లు పనివేళలు పాటించాలని, ఈ విషయంలో ఎవర్నీ ఉపేక్షించబోమని డీఈఓ శామ్యూల్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినట్లుగానే సమయపాలనపై దృష్టి సారించిన ఆయన జిల్లా కేంద్రంలో రెండు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసి వేళకు బడికి రాని నలుగురు టీచర్లపై చర్యలకు సిఫారసు చేశారు. అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక కోర్టు రోడ్డులో ఒకే కాంపౌండ్‌లో ఉన్న నెహ్రూ నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాల, జిలాని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలను డీఈఓ శామ్యూల్ శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రార్థన సమయం 9 గంటలకే అక్కడికెళ్లారు. రెండు స్కూళ్లలోనూ పది మంది టీచర్లు పని చేస్తుండగా, నెహ్రూ స్కూల్లో పి.పద్మావతి, ఆర్ఎల్.ప్రభావతి, ఉర్దూ స్కూల్లో హెచ్ఎం పి.కలీముల్లాఖాన్, టీచరు మల్లికాసుల్తానా వేళకు రాలేదు. అటెండెన్స్ రిజిష్టర్లు తనిఖీ చేసిన డీఈఓ పద్మావతి, ప్రభావతి సెలవుగానీ, అనుమతిగానీ తీసుకున్నారా అని ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌ను అడిగారు. ఆయన లేదని చెప్పడంతో 9.30 గంటల దాకా డీఈఓ అక్కడే కూర్చున్నారు. అప్పటికి కూడా ఆ నలుగురిలో ఏ ఒక్కరూ రాకపోవడంతో అటెండెన్స్ రిజిష్టరులో ఆబ్సెంట్ వేశారు. చెప్పా పెట్టకుండా వేళకు పాఠశాలలకు రాని ఆ నలుగురు టీచర్లపై చర్యలు తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్‌కు సిఫార్సు చేశారు. డీఈఓ వెళ్లిన తర్వాత 9.35 గంటలకు ప్రభావతి, 9.45 గంటలకు పద్మావతి పాఠశాలకు వచ్చారు. ఉర్దూ స్కూల్ హెచ్ఎం కలీముల్లాఖాన్ 10.30 గంటలకు వచ్చారు. మరో టీచరు మల్లికాసుల్తానా ఈ రోజు సెలవులో ఉన్నారు. ఆ మేరకు ప్రధానోపాధ్యాయునికి లెటరు కూడా ఇచ్చారు. అయితే ఆయనే ఆలస్యంగా రావడంతో ఆ విషయం డీఈఓకు చెప్పేవారు లేకపోయారు. నేనప్పుడే చెప్పా.. ఉపేక్షించేదే లేదు నేను ఇక్కడికి ఇచ్చిన తొలిరోజే చెప్పా. టీచర్లు సమయపాలన కచ్చితంగా పాటించాలని. ప్రార్థన సమయానికి ముందే కచ్చితంగా ప్రతి టీచరూ బడిలో ఉండాలి. 9 గంటలకు స్కూలంటే 9.30 గంటలైనా రాకపోతే ఎలా? పిల్లలు ఏం కావాలి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. అందుకే నలుగురు టీచర్లపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశాం. ఉర్దూ స్కూల్ టీచరు మల్లికాసుల్తానా సెలవు పెట్టిన విషయం నాకు ఎవరూ చెప్పలేదు. రానున్న రోజుల్లో మరిన్ని ఆకస్మిక తనిఖీలు చేస్తా. స్కూల్ డుమ్మా కొట్టే టీచర్లను, ఆలస్యంగా వచ్చేవారిని ఉపేక్షించేదే లేదు. - శామ్యూల్, డీఈఓ