- నగరంలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు
- సమయపాలన పాటించని నలుగురు టీచర్లపై చర్యలకు సిఫారసు
పంతుళ్లు పనివేళలు పాటించాలని, ఈ విషయంలో ఎవర్నీ ఉపేక్షించబోమని డీఈఓ శామ్యూల్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినట్లుగానే సమయపాలనపై దృష్టి సారించిన ఆయన జిల్లా కేంద్రంలో రెండు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసి వేళకు బడికి రాని నలుగురు టీచర్లపై చర్యలకు సిఫారసు చేశారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక కోర్టు రోడ్డులో ఒకే కాంపౌండ్‌లో ఉన్న నెహ్రూ నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాల, జిలాని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలను డీఈఓ శామ్యూల్ శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రార్థన సమయం 9 గంటలకే అక్కడికెళ్లారు. రెండు స్కూళ్లలోనూ పది మంది టీచర్లు పని చేస్తుండగా, నెహ్రూ స్కూల్‌లో పి.పద్మావతి, ఆర్‌ఎల్.ప్రభావతి, ఉర్దూ స్కూల్‌లో హెచ్‌ఎం పి.కలీముల్లాఖాన్, టీచరు మల్లికాసుల్తానా వేళకు రాలేదు. అటెండెన్స్ రిజిష్టర్లు తనిఖీ చేసిన డీఈఓ పద్మావతి, ప్రభావతి సెలవుగానీ, అనుమతిగానీ తీసుకున్నారా అని ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌ను అడిగారు.
ఆయన లేదని చెప్పడంతో 9.30 గంటల దాకా డీఈఓ అక్కడే కూర్చున్నారు. అప్పటికి కూడా ఆ నలుగురిలో ఏ ఒక్కరూ రాకపోవడంతో అటెండెన్స్ రిజిష్టరులో ఆబ్సెంట్ వేశారు. చెప్పా పెట్టకుండా వేళకు పాఠశాలలకు రాని ఆ నలుగురు టీచర్లపై చర్యలు తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్‌కు సిఫార్సు చేశారు. డీఈఓ వెళ్లిన తర్వాత 9.35 గంటలకు ప్రభావతి, 9.45 గంటలకు పద్మావతి పాఠశాలకు వచ్చారు. ఉర్దూ స్కూల్ హెచ్‌ఎం కలీముల్లాఖాన్ 10.30 గంటలకు వచ్చారు. మరో టీచరు మల్లికాసుల్తానా ఈ రోజు సెలవులో ఉన్నారు. ఆ మేరకు ప్రధానోపాధ్యాయునికి లెటరు కూడా ఇచ్చారు. అయితే ఆయనే ఆలస్యంగా రావడంతో ఆ విషయం డీఈఓకు చెప్పేవారు లేకపోయారు.
నేనప్పుడే చెప్పా.. ఉపేక్షించేదే లేదు
నేను ఇక్కడికి ఇచ్చిన తొలిరోజే చెప్పా. టీచర్లు సమయపాలన కచ్చితంగా పాటించాలని. ప్రార్థన సమయానికి ముందే కచ్చితంగా ప్రతి టీచరూ బడిలో ఉండాలి. 9 గంటలకు స్కూలంటే 9.30 గంటలైనా రాకపోతే ఎలా? పిల్లలు ఏం కావాలి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. అందుకే నలుగురు టీచర్లపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశాం. ఉర్దూ స్కూల్ టీచరు మల్లికాసుల్తానా సెలవు పెట్టిన విషయం నాకు ఎవరూ చెప్పలేదు. రానున్న రోజుల్లో మరిన్ని ఆకస్మిక తనిఖీలు చేస్తా. స్కూల్ డుమ్మా కొట్టే టీచర్లను, ఆలస్యంగా వచ్చేవారిని ఉపేక్షించేదే లేదు.
- శామ్యూల్, డీఈఓ
నిర్లక్ష్యపు టీచర్లపై కొరడా!
Published Sat, Nov 5 2016 10:39 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
Advertisement
Advertisement