డీయూకు విదేశీ విద్యార్థుల క్యూ
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. వివిధ కోర్సుల కోసం విదేశీ విద్యార్థులుకూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 2,098 మంది విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకే వీరిలో అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,259 మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు, 609 మంది నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ విషయాన్ని డీయూ ఫారిన్ రిజిస్ట్రీ విభాగం అధిపతి కౌర్ బస్రా వెల్లడించారు. వీరిలో టిబెటన్లు 475 మంది కాగా 237 మంది నేపాలీయులని ఆయన చెప్పారు. గత ఏడాది 248 మంది టిబెటన్లు, 222 మంది నేపాలీయులు దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. ‘ఇక దక్షిణ కొరియాకు చెందిన విద్యార్థులు సైతం డీయూలో వివిధ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు నగరానికి వచ్చారని బస్రా చెప్పారు.
వారికి కొరియా రాయబార కార్యాలయం అవసరమైన వసతులు కల్పిస్తోందన్నారు. దీంతో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తడం లేదన్నారు. అయితే దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన విద్యార్థినులు సరైన వసతి దొరక్క నానాఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారికి తగు వసతులు కల్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. దక్షిణ కొరియాకు చెందిన 54 మంది విద్యార్థులు గత ఏడాది తమ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో చేరారన్నారు.