Department of roads and buildings
-
ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ వర్సిటీ సాధ్యమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం నియమించిన కమిటీ పలు సిఫారసులు చేసింది. ప్రస్తుతం మాదాపూర్‌లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)ను విశ్వవిద్యాలయం స్థాయికి పెంచేందుకు వీలుగా సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని నియమించింది. రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో న్యాక్ డైరెక్టర్ జనరల్ సభ్యకార్యదర్శిగా, క్రెడాయ్ నుంచి ముగ్గురు, బిల్డర్స్ అసోసియేషన్ నుంచి ఇద్దరు ప్రతినిధులు, సీఐఐ నుంచి ఒకరు చొప్పున సభ్యులుగా ఉన్న కమిటీ లోతుగా పరిశీలించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. యూనివర్సిటీ స్థాయికి ఎదిగే అన్ని అర్హతలు, సామర్థ్యాలు న్యాక్‌కు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే వర్సిటీని స్థాపించేందుకు ఏర్పాట్లు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వం అనుమతించిన తర్వాత వర్సిటీ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలో పొందుపరిచిన అంశాల్లో కొన్ని ఇలా ఉన్నాయి. ► దీన్ని గ్లోబల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ లేదా ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీగా పేర్కొనాలి. విదేశాల నుంచి కూడా సివిల్ ఇంజనీర్లు ఇం దులో చేరే స్థాయికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ► ఇందులో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ కన్స్ట్రక్షన్, స్కూల్ ఆఫ్ సస్టెయినబుల్ కన్స్ట్రక్షన్ ఫర్ అర్బన్ ప్లానింగ్, డిజిటల్ కన్స్ట్రక్షన్ స్కూల్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ స్కూల్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, స్కూల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ ఇంజనీరింగ్.. ఇలా ఐదు రకాల విభాగాల కింద స్పెషల్ కోర్సులు ఏర్పాటు చేయాలి. ► సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 40 ఏళ్ల క్రితం నాటి బోధనే ఇప్పుడూ సాగుతుండటంతో అందులో పురోగతి లేకుండా పోయింది. దాన్ని ఈ యూనివర్సిటీతో భర్తీ చేసి యూరప్, అమె రికా, సింగపూర్ లాంటి దేశాల నిర్మాణ రం గంలో వస్తున్న ఆధునికతను ఈ యూనివర్సిటీ కూడా స్థానికంగా అందిస్తుంది. ► యూనివర్సిటీని ఎంటెక్‌తో ప్రారంభించాలి. బీటెక్ విద్యార్థులకు పీజీ కోర్సులు అందిస్తూ రెండు, మూడేళ్లలో బీటెక్, ఆ తర్వాత రీసెర్చ్ విభాగాలు ప్రారంభించాలి. -
ప్రజల్లో అవగాహన పెరగాలి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నా రు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు వెంట నే వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సచివాలయంలో జరిగిన అయిదో రోడ్డు భద్రత మండలి సమావేశంలో ఆయన వివిధ విభాగాల అధికారులు, లారీ డ్రైవర్ల సంఘం, ఆటో యూనియన్ నేతలతో సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారి సూచనలు స్వీకరించారు. వాటిలో అమలు చేయాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులను ఏ బీ సీ కేటగిరీలుగా విభజించినట్టు వెల్లడించారు. పీపీపీ పద్ధతి అమలులో ఉన్న రహదారులపై ప్రతి 20 కిలోమీటర్లకు ఓ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా పెట్రోలింగ్ వాహనాలు కూడా పెంచుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తిస్తున్నామని, వాటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. నార్కెట్‌పల్లి, అద్దంకి ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని లారీ ఓనర్ల సంఘం మంత్రి దృష్టికి తెచ్చింది. రోడ్డు భద్రతపై లారీలు, ఆటోలు, క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. హెల్మెట్లు, సీట్బెల్ట్లపై ఎంత ప్రచారం చేసినా వాహనదారుల్లో నిర్లక్ష్యం పోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే 40 వేల లైసెన్సులను రద్దు చేసి వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని మంత్రి చెప్పారు. చలాన్లు విధిస్తున్నా మార్పు రావటం లేదన్నారు. ఇక ముందు నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రోడ్డు భద్రత కేవలం ప్రభుత్వ కార్యక్రమమనే అపోహ నుంచి జనం బయటకు వచ్చి, తాము కూడా నిబంధనలు పాటించాలనే అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. నగరంలో పాదచారులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు చేపడతామన్నారు. -
మన రహదారులకు... విదేశీ హంగులు
♦ తెలంగాణ ఇంజనీర్లకు ఇతర దేశాల ఇంజనీర్లతో పాఠాలు ♦ వచ్చే నెల నగరంలో మూడు రోజుల ప్రత్యేక తరగతులు ♦ కనీసం రెండు దశాబ్దాలు మన్నేలా కొత్త పద్ధతుల గుర్తింపు సాక్షి, హైదరాబాద్: గోతులు లేని రహదారులు.. కుదుపులులేని ప్రయాణం.. అద్దంలా మెరిసిపోయే రోడ్లు.. ఇరువైపులా పరుచుకున్న పచ్చదనం.. ఇవన్నీ చెబుతుంటే విదేశాల్లోని సువిశాలమైన రహదారులు అందరికీ గుర్తుకొస్తాయి. కానీ ఈ హంగులన్నీ ఇకపై మన రహదారులకు రానున్నాయి. ఇందుకోసం రాష్ట్రం లోని రహదారులకు విదేశీ తరహా హంగులు అద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో రహదారుల నిర్మాణంలో అనుసరిస్తున్న పద్ధతుల్లో కొన్నింటిని తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏటా రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. నిర్మించిన రెండు, మూడేళ్లకే భారీగా గుంతలుపడి మరమ్మతులు చేయాల్సినంత తీసికట్టుగా మారుతున్న మన రహదారుల ప్రమాణాలను మెరుగుపరిస్తే తప్ప ఈ దుబారా వ్యయాన్ని నియంత్రించటం సాధ్యం కానందున ప్రభుత్వం విదేశీ విధానాలపై దృష్టి సారించింది. రోడ్ల మన్నికలో ఉన్నత శ్రేణి దేశాలుగా చెలామణీలో ఉన్న నెదర్లాండ్స్, ఆస్ట్రియా, జపాన్, సింగపూర్, జర్మనీ, ఆస్ట్రేలియా.. తదితర దేశాలకు చెందిన ఇంజనీరింగ్ నిపుణులతో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లకు తరగ తులు చెప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల రెండో వారంలో ఈ మేరకు నగరంలో మూడు రోజుల ప్రత్యేక తరగతులు నిర్వహించాలని భావిస్తోంది. ఆయా దేశాల్లో అనుసరిస్తున్న ఇంజనీరింగ్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, వాడుతున్న మెటీరియల్, పర్యావరణంపై ప్రభావం, వాతావరణ పరిస్థితులను తట్టుకునే మెళకువలు, మరమ్మతుల్లో అనుసరించాల్సిన పద్ధతులు.. తదితర అంశాలు ఇందులో ప్రస్తావనకు రానున్నాయి. రూ. 20 వేల కోట్ల పనుల నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్లను మెరుగుపరచటంపై దృష్టిసారించారు. రోడ్లు బాగుంటేనే ప్రగతి సాధ్యమనే అభిప్రాయంలో ఉన్న ఆయన ఇప్పటికే రూ.10 వేల కోట్ల పనులకు పచ్చజెండా ఊపారు. భావి బడ్జెట్ల్లో మరిన్ని నిధులు కేటాయించనున్నారు. దాదాపు రూ.20 వేల కోట్లను ఇందుకు ఖర్చు చేయనున్నట్టు ప్రాథమిక అంచనా. ఇంతటి భారీ వ్యయం చేస్తున్న నేపథ్యంలో రోడ్ల నిర్మాణంలో నాణ్యత గల్లంతయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొత్త రోడ్లు కనీసం రెండు దశాబ్దాలపాటు మన్నేలా ఉండాలనేది ఆయన అభిప్రాయం. ప్రస్తుత రోడ్ల మన్నికకాలం పదేళ్లుగా పేర్కొంటున్నప్పటికీ మూడేళ్లకే పాడవుతున్నాయి. చాలా దేశాల్లో రోడ్లు మనకంటే చాలా మన్నికగా ఉంటున్నాయి. అభివృద్ధి సూ చీలో మనకంటే దిగువన ఉన్న నమీబియా, టునీ షియా, మొరాకో లాంటి పేద దేశాల్లో కూడా రోడ్లు మనకంటే మన్నికగా ఉన్నాయంటూ తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థ సర్వేలో స్పష్టమైంది. ఖర్చు పెరగాల్సిందే.. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ నిర్మిస్తున్న రాష్ట్ర రహదారులకు కిలోమీటరుకు రూ.కోటిన్నర(రెండు వరసలకు) వరకు ఖర్చవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది రెట్టింపు ఉంటోంది. మన్నిక వరకు వస్తే ఆయా దేశాల్లో మనకంటే నాలుగు రెట్లు ఉంటోంది. అక్కడ అనుసరిస్తున్న ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఙానం మనకంటే చాలా మెరుగ్గా ఉంటున్నాయి. ఇక ప్లాస్టిక్, రబ్బర్‌లాంటి మెటీరియల్‌ను వినియోగిస్తున్నారు. ఈ విషయాలపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. విదేశీ నిపుణుల సూచనలు పరిగణనలోకి తీసుకుని మన బడ్జెట్‌కు సరిపోయే అంశాలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. నిర్మాణ వ్యయం కొంత పెరగనున్నప్పటికీ.. మన్నికలో వచ్చే మార్పును పరిగణనలోకి తీసుకుంటే ఆదాగానే భావించాల్సి ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో అతి పొడవైన వంతెన
కృష్ణా నదిపై 1.9 కి.మీ. పొడవుతో నిర్మాణం * మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్- కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలాలతో అనుసంధానం * మరో మూడు నెలల్లో పనులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొడవైన వంతెన రూపుదిద్దుకోనుంది. కృష్ణా నదిపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం- కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధేశ్వరం గ్రామాల మధ్య ఈ నిర్మాణం జరగనుంది. దాదాపు 1.9 కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం నమూనాలను సిద్ధం చేసే పనుల్లో ఉన్న అధికారులు మరో మూడు నెలల్లో పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లకుపైగా వ్యయం చేయనున్నారు. ఇది పూర్తయితే తెలంగాణలో ఇదే అతి పొడవైన వంతెనగా నిలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ-ఛత్తీస్‌గడ్‌లను అనుసంధానిస్తూ వరంగల్ జిల్లా ఏటూరునాగారం ముల్లకట్ట గ్రామం వద్ద జాతీయ రహదారుల విభాగం భారీ వంతెన నిర్మించింది. గోదావరి నదిపై రూపుదిద్దుకున్న దీని పొడవు 1.8 కిలోమీటర్లు. మరో నెలరోజుల్లో అధికారికంగా అందుబాటులోకి వచ్చే ఈ వంతెననే తెలంగాణలో ఇప్పటి వరకు పొడవైంది. కర్నూలుతో సంబంధం లేకుండా ముందుకు... ఆంధ్రప్రదేశ్‌లోని, వైఎస్సార్ కడప, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోకి అడుగుపెట్టాలంటే కర్నూలు మీదుగా వస్తున్నారు. ప్రస్తుతం బీచ్పల్లి వంతెనే ప్రధాన మార్గంగా ఉంది. కర్నూలుతో సంబంధం లేకుండా నేరుగా వచ్చేలా కొత్త వంతెన సిద్ధమవుతోంది. దీనివల్ల వైఎస్సార్ కడప, నంద్యాల- హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించేవారికి దాదాపు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. సగం ఖర్చు భరించాలంటూ ఏపీకి లేఖ.. ఈ కొత్త వంతెన వల్ల తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉండనున్నందున దీన్ని సంయుక్త ప్రాజెక్టుగా నిర్మిస్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చు కానున్నందున అందులో సగం భరించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి సంబంధించి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ఏపీకి లేఖ రాసింది. అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం ఆ శాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ వంతెనను దృష్టిలో ఉంచుకుని ఆ శాఖ రోడ్లను కూడా విస్తరిస్తున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ రోడ్డును అభివృద్ధి చేశారు. నాగర్‌కర్నూలు రోడ్డును కూడా నిర్మించారు. కల్వకుర్తి రోడ్డును రెండు లేన్లకు విస్తరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు నంద్యాల-కపిలేశ్వరం రోడ్డుతో దీన్ని అనుసంధానిస్తారు. ఆ రోడ్డును కూడా అటువైపు విస్తరించాల్సి ఉంటుంది. మరో మూడు నెలల్లో పనులు మొదలు పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.