మన రహదారులకు... విదేశీ హంగులు
♦ తెలంగాణ ఇంజనీర్లకు ఇతర దేశాల ఇంజనీర్లతో పాఠాలు
♦ వచ్చే నెల నగరంలో మూడు రోజుల ప్రత్యేక తరగతులు
♦ కనీసం రెండు దశాబ్దాలు మన్నేలా కొత్త పద్ధతుల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: గోతులు లేని రహదారులు.. కుదుపులులేని ప్రయాణం.. అద్దంలా మెరిసిపోయే రోడ్లు.. ఇరువైపులా పరుచుకున్న పచ్చదనం.. ఇవన్నీ చెబుతుంటే విదేశాల్లోని సువిశాలమైన రహదారులు అందరికీ గుర్తుకొస్తాయి. కానీ ఈ హంగులన్నీ ఇకపై మన రహదారులకు రానున్నాయి. ఇందుకోసం రాష్ట్రం లోని రహదారులకు విదేశీ తరహా హంగులు అద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో రహదారుల నిర్మాణంలో అనుసరిస్తున్న పద్ధతుల్లో కొన్నింటిని తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏటా రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.
నిర్మించిన రెండు, మూడేళ్లకే భారీగా గుంతలుపడి మరమ్మతులు చేయాల్సినంత తీసికట్టుగా మారుతున్న మన రహదారుల ప్రమాణాలను మెరుగుపరిస్తే తప్ప ఈ దుబారా వ్యయాన్ని నియంత్రించటం సాధ్యం కానందున ప్రభుత్వం విదేశీ విధానాలపై దృష్టి సారించింది. రోడ్ల మన్నికలో ఉన్నత శ్రేణి దేశాలుగా చెలామణీలో ఉన్న నెదర్లాండ్స్, ఆస్ట్రియా, జపాన్, సింగపూర్, జర్మనీ, ఆస్ట్రేలియా.. తదితర దేశాలకు చెందిన ఇంజనీరింగ్ నిపుణులతో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లకు తరగ తులు చెప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల రెండో వారంలో ఈ మేరకు నగరంలో మూడు రోజుల ప్రత్యేక తరగతులు నిర్వహించాలని భావిస్తోంది. ఆయా దేశాల్లో అనుసరిస్తున్న ఇంజనీరింగ్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, వాడుతున్న మెటీరియల్, పర్యావరణంపై ప్రభావం, వాతావరణ పరిస్థితులను తట్టుకునే మెళకువలు, మరమ్మతుల్లో అనుసరించాల్సిన పద్ధతులు.. తదితర అంశాలు ఇందులో ప్రస్తావనకు రానున్నాయి.
రూ. 20 వేల కోట్ల పనుల నేపథ్యంలో..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్లను మెరుగుపరచటంపై దృష్టిసారించారు. రోడ్లు బాగుంటేనే ప్రగతి సాధ్యమనే అభిప్రాయంలో ఉన్న ఆయన ఇప్పటికే రూ.10 వేల కోట్ల పనులకు పచ్చజెండా ఊపారు. భావి బడ్జెట్‌ల్లో మరిన్ని నిధులు కేటాయించనున్నారు. దాదాపు రూ.20 వేల కోట్లను ఇందుకు ఖర్చు చేయనున్నట్టు ప్రాథమిక అంచనా. ఇంతటి భారీ వ్యయం చేస్తున్న నేపథ్యంలో రోడ్ల నిర్మాణంలో నాణ్యత గల్లంతయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొత్త రోడ్లు కనీసం రెండు దశాబ్దాలపాటు మన్నేలా ఉండాలనేది ఆయన అభిప్రాయం. ప్రస్తుత రోడ్ల మన్నికకాలం పదేళ్లుగా పేర్కొంటున్నప్పటికీ మూడేళ్లకే పాడవుతున్నాయి. చాలా దేశాల్లో రోడ్లు మనకంటే చాలా మన్నికగా ఉంటున్నాయి. అభివృద్ధి సూ చీలో మనకంటే దిగువన ఉన్న నమీబియా, టునీ షియా, మొరాకో లాంటి పేద దేశాల్లో కూడా రోడ్లు మనకంటే మన్నికగా ఉన్నాయంటూ తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థ సర్వేలో స్పష్టమైంది.
ఖర్చు పెరగాల్సిందే..
ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ నిర్మిస్తున్న రాష్ట్ర రహదారులకు కిలోమీటరుకు రూ.కోటిన్నర(రెండు వరసలకు) వరకు ఖర్చవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది రెట్టింపు ఉంటోంది. మన్నిక వరకు వస్తే ఆయా దేశాల్లో మనకంటే నాలుగు రెట్లు ఉంటోంది. అక్కడ అనుసరిస్తున్న ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఙానం మనకంటే చాలా మెరుగ్గా ఉంటున్నాయి. ఇక ప్లాస్టిక్, రబ్బర్‌లాంటి మెటీరియల్‌ను వినియోగిస్తున్నారు. ఈ విషయాలపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. విదేశీ నిపుణుల సూచనలు పరిగణనలోకి తీసుకుని మన బడ్జెట్‌కు సరిపోయే అంశాలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. నిర్మాణ వ్యయం కొంత పెరగనున్నప్పటికీ.. మన్నికలో వచ్చే మార్పును పరిగణనలోకి తీసుకుంటే ఆదాగానే భావించాల్సి ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.