తెలంగాణలో అతి పొడవైన వంతెన | Telangana In the longest bridge | Sakshi
Sakshi News home page

తెలంగాణలో అతి పొడవైన వంతెన

Published Tue, Sep 1 2015 7:39 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

తెలంగాణలో అతి పొడవైన వంతెన

తెలంగాణలో అతి పొడవైన వంతెన

కృష్ణా నదిపై 1.9 కి.మీ. పొడవుతో నిర్మాణం
* మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్- కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలాలతో అనుసంధానం
* మరో మూడు నెలల్లో పనులు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొడవైన వంతెన రూపుదిద్దుకోనుంది. కృష్ణా నదిపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం- కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధేశ్వరం గ్రామాల మధ్య ఈ నిర్మాణం జరగనుంది. దాదాపు 1.9 కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రస్తుతం నమూనాలను సిద్ధం చేసే పనుల్లో ఉన్న అధికారులు మరో మూడు నెలల్లో పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లకుపైగా వ్యయం చేయనున్నారు. ఇది పూర్తయితే తెలంగాణలో ఇదే అతి పొడవైన వంతెనగా నిలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ-ఛత్తీస్‌గడ్‌లను అనుసంధానిస్తూ వరంగల్ జిల్లా ఏటూరునాగారం ముల్లకట్ట గ్రామం వద్ద జాతీయ రహదారుల విభాగం భారీ వంతెన నిర్మించింది. గోదావరి నదిపై రూపుదిద్దుకున్న దీని పొడవు 1.8 కిలోమీటర్లు. మరో నెలరోజుల్లో అధికారికంగా అందుబాటులోకి వచ్చే ఈ వంతెననే తెలంగాణలో ఇప్పటి వరకు పొడవైంది.
 
కర్నూలుతో సంబంధం లేకుండా ముందుకు...
ఆంధ్రప్రదేశ్‌లోని, వైఎస్సార్ కడప, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోకి అడుగుపెట్టాలంటే కర్నూలు మీదుగా వస్తున్నారు. ప్రస్తుతం బీచ్‌పల్లి వంతెనే ప్రధాన మార్గంగా ఉంది.  కర్నూలుతో సంబంధం లేకుండా నేరుగా వచ్చేలా కొత్త వంతెన సిద్ధమవుతోంది. దీనివల్ల వైఎస్సార్ కడప, నంద్యాల- హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించేవారికి దాదాపు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
 
సగం ఖర్చు భరించాలంటూ ఏపీకి లేఖ..
ఈ కొత్త వంతెన వల్ల తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉండనున్నందున దీన్ని సంయుక్త ప్రాజెక్టుగా నిర్మిస్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చు కానున్నందున అందులో సగం భరించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి సంబంధించి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ఏపీకి లేఖ రాసింది.

అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం ఆ శాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు.  ఈ వంతెనను దృష్టిలో ఉంచుకుని ఆ శాఖ రోడ్లను కూడా విస్తరిస్తున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ రోడ్డును అభివృద్ధి చేశారు. నాగర్‌కర్నూలు రోడ్డును కూడా నిర్మించారు. కల్వకుర్తి రోడ్డును రెండు లేన్లకు విస్తరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు నంద్యాల-కపిలేశ్వరం రోడ్డుతో దీన్ని అనుసంధానిస్తారు. ఆ రోడ్డును కూడా అటువైపు విస్తరించాల్సి ఉంటుంది. మరో మూడు నెలల్లో పనులు మొదలు పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement