కృష్ణమ్మపైమరో వారధి | another bridge construction on krishna river between tangeda-mattampally | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మపైమరో వారధి

Published Sun, Dec 22 2013 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

another bridge construction on krishna river between tangeda-mattampally

 తంగెడ(దాచేపల్లి), న్యూస్‌లైన్: ఆ ఒడ్డు.. ఈ ఒడ్డు.. నడిమధ్య ఏరడ్డు. దానిపై వారధి నిర్మిస్తే రెండు జిల్లాల మధ్య ప్రయాణం ఎంతో సులువు. దీనికోసం గుంటూరు, నల్గొండ జిల్లాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడు వారి ఆశలు ఫలించబోతున్నాయి. తంగెడ, మఠంపల్లిలను కలుపుతూ కృష్ణమ్మపై భారీ వారధి నిర్మాణం కానుంది. రోడ్లు భవనాలశాఖ మంజూరు చేసిన రూ.50 కోట్ల నిధులతో 840 మీటర్ల పొడవున 21 పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. నల్గొండ వైపు 600 మీటర్లు, గుంటూరు జిల్లా వైపు 260 మీటర్ల మేర అప్రోచ్ రోడ్డును నిర్మించనున్నారు. 2014 జనవరి మొదటివారంలో శంకుస్థాపన చేసేందుకు న ల్గొండ జిల్లా మఠంపల్లి వైపు ఏర్పాట్లు చేస్తున్నామని, ఏడాదిన్నర కాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నామని ఆర్ అండ్ బి అధికారులు పేర్కొన్నారు.
 ప్రస్తుతం బల్లకట్టే దిక్కు..
 కృష్ణానదిపై వారధి నిర్మాణం కోసం గుంటూరు, నల్గొండ జిల్లాలకు చెందిన ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జిల్లాల మధ్య ప్రవహించే నదిపై బ్రిడ్జి నిర్మిస్తే ప్రయాణ దూరం 60 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లకు తగ్గుతుంది. దాచేపల్లి మండలంలోని తంగెడ నుంచి కృష్ణానదికి ఆవల ఉన్న నల్గొండ జిల్లా మఠంపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్య క్షేత్రానికి చేరాలంటే పొందుగల బ్రిడ్జి మీదుగా దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. అదే నదిపై 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే మఠంపల్లి చేరుకోవచ్చు. ఐదారేళ్ల నుంచి బల్లకట్టు సౌకర్యం ఉండటంతో నల్గొండ జిల్లా కు వెళ్లాల్సిన ప్రయాణికులు, వాహనదారులు తంగెడ వద్ద బల్లకట్టుపై ప్రయాణిస్తున్నారు.
 కృష్ణాకూ దగ్గరి దారి..  బల్లకట్టు ద్వారా నల్గొండ జిల్లా మీదుగా కృష్ణా జిల్లాలోకి కూడా తక్కువ దూరంలో వెళ్లవచ్చు. దీంతో నల్గొండ జిల్లాతోపాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిసరాలకు కూడా బల్లకట్టుపైనే ప్రయాణికులతోపాటు లారీల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. రోజుకు దాదాపు 80 నుంచి 100 లారీలు బల్లకట్టు మీదుగా నది దాటుతుంటాయి. తంగెడలో ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తయ్యే సిమెంట్ ఈ బల్లకట్టు మీదుగానే లారీల ద్వారా కృష్ణాజిల్లాకు పంపిస్తున్నారు. కొన్ని ఫ్యాక్టరీలకు కావాల్సిన ముడిసరుకు కూడా తంగెడ నుంచి తరలిస్తున్నారు. కానీ, నిర్వాహకులు బల్లకట్టును నిలిపివేసినప్పుడు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వర్షాలు కురిసి నదిలో నీటి ప్రవాహం పెరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ముందుగా బల్లకట్టు నిలిపివేస్తున్నారు. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నది మధ్యలో నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. వారధి నిర్మాణం పూర్తయితే ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు. ప్రయాణ దూరం, సమయం, ఖర్చు కూడా తగ్గుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement