సాక్షి, విజయవాడ: గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య(55)ను పట్టుకునేందుకు 17 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాచేపల్లి ఘటన దారుణమన్నారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. రిక్షావాలా అయిన సుబ్బయ్యకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయని, ఇద్దరు భార్యలు అతడిని వదిలేశారని వెల్లడించారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అతడు మానసిక వైఫల్యంతోనే ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. ఘటన తర్వాత సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందన్నారు. చనిపోవడానికి వెళ్తున్నట్టు దారిలో కనిపించిన వ్యక్తికి చెప్పినట్టు తెలిపారు.
ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో 7 అత్యాచార ఘటనలు జరగడం దురదృష్టకరమని డీజీపీ వ్యాఖ్యానించారు. ఈ ఏడు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దాచేపల్లి కేసులో ఈ కేసులో పోలీసులు సమన్వయంతో వ్యహరిస్తున్నారని తెలిపారు. చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ఆందోళనకారులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment