నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల వద్ద నిర్మాణం
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం
వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనకు ప్రతిరూపం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ లను అనుసంధానిస్తూ కృష్ణా నదిపై మరో భారీ వంతెన నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. 1.2 కి.మీ.పైగా పొడవుండే ఈ వంతెన రెండు రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనను తెలంగాణ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంచింది. నాగర్‌కర్నూలు– కర్నూలు జిల్లాల మధ్య కృష్ణా నదిపై సోమశిల వద్ద ఈ వంతెన రూపుదిద్దుకోనుంది. దాదాపు రూ.400 కోట్ల మేర వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ రూ.200 కోట్లు భరించాల్సి ఉంది. ఆ రాష్ట్రం ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. త్వరలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఓ ప్రతినిధి బృందం విజయవాడ వెళ్లి అక్కడి అధికారులతో చర్చించనున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మంజూరు చేసిన ఈ వంతెన విషయంలో ఎట్టకేలకు ఇప్పుడు కదలిక వచ్చింది.
చాలాకాలంగా డిమాండ్ ఉన్నా..
పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా ఏపీలోకి ప్రవేశించాలంటే ప్రస్తుతం 44వ నంబర్ జాతీయ రహదారే దిక్కవుతోంది. ప్రత్యామ్నాయం లేకపోవటంతో భూత్‌పూర్ మీదుగా రంగాపూర్, బీచ్‌పల్లి వంతెన దాటి వెళ్లాల్సి వస్తోంది. దీంతో చాలా దూరం తిరగాల్సి వస్తోంది. కృష్ణా నదికి చేరువగా ఉండే కొల్లాపూర్ వాసులు ఏపీలోని నంద్యాల, ఆత్మకూరుకు వెళ్లాలంటే వంద కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగివెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన వారు కూడా ఈ దూరాభారాన్ని భరించాల్సి వస్తోంది. ఆత్మకూరు, నంద్యాల పరిసరాల నుంచి సిమెంట్ లోడు లారీలు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తి లారీలు నిత్యం హైదరాబాద్‌కు తిరుగుతుంటాయి. ఇవి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ వంతెన కోసం చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. బీచ్‌పల్లి వద్ద ఉన్న రంగాపూర్ వంతెనకు ప్రత్యామ్నాయంగా కొల్లాపూర్ సమీపంలోని సోమశిల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే వంద కిలోమీటర్ల చుట్టు తిరుగుడు తప్పుతుంది. ఫలితంగా రెండు, మూడు గంటల సమయం, విలువైన ఇంధనం ఆదా అవుతాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో..
ఈ ప్రత్యామ్నాయ వంతెన ఆలోచన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది. 2007లో నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని సింగోటం జాతర కోసం రాయలసీమ ప్రాంతం నుంచి వస్తున్న భక్తులు కృష్ణా నది దాటే సమయంలో పుట్టిమునిగి 60 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తీవ్రంగా చలించిపోయిన నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆ ప్రాంతానికి చేరుకుని సోమశిల వద్ద వంతెన నిర్మాణానికి నిర్ణయించారు. దాదాపు 1,200 మీటర్ల పొడవుతో భారీ వంతెన నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈలోపు రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ ఆలోచన అటకెక్కింది. తర్వాత రాష్ట్ర విభజన ఆందోళనలతో అది ముందుకు సాగలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వమే ముందుకొచ్చి వంతెన నిర్మాణానికి మరోసారి ప్రతిపాదించింది. ఇది రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉన్నందున ఖర్చును చెరిసగం భరించాలని ఏపీకి ప్రతిపాదన పంపింది. కానీ ఆ రాష్ట్రం ముందుకు రాలేదు. తాజాగా మరోసారి ఆ రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపి చర్చలకు సిద్ధమైంది. త్వరలో ప్రతినిధి బృందం అమరావతి వెళ్లి ఆ రాష్ట్ర అధికారులతో చర్చించబోతున్నారు. ఇప్పుడు వారు కూడా సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థతో అక్కడ సర్వే చేయించింది. భూమి పటుత్వం కోసం మట్టి నమూనాలను కూడా పరీక్ష చేయించింది. అందులో సానుకూల ఫలితమే వచ్చింది. దీంతో నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని సోమశిల, ఏపీలోని సిద్ధేశ్వరం మధ్య ఈ వంతెన నిర్మాణానికి అవకాశాలు మెరుగుపడుతున్నాయి.
కృష్ణాపై మరో భారీ వంతెన
Published Fri, May 12 2017 3:15 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
Advertisement