వానలొచ్చినా.. నో ప్రాబ్లం..!
సాక్షి, ముంబై: వర్షాకాలం సమీపించడంతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సన్నద్ధమైంది. మురికివాడలు, నాలాలు, రహదారులపై పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగింపు పనులు దాదాపు 85 శాతం పూర్తి కావచ్చాయని మేయర్ సునీల్ ప్రభు చెప్పారు. మిగతా 15 శాతం పనులు త్వరలో పూర్తిచేయాలని ఆదేశించారు. జూన్ ఏడో తేదీ నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది. దీంతో సాధ్యమైనంత త్వరగా మిగిలిపోయిన పనులు పూర్తిచేయాలని బీఎంసీ పారిశుద్ధ్య శాఖ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఎమ్మెమ్మార్డీయే, మాడా, నేవీ, మిలటరీ, రైల్వే తదితర పరిపాలన విభాగాలతో చర్చించారు. వారి ఆధీనంలో ఉన్న పనులు, వర్షాకాలానికి ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు.
అదేవిధంగా రోడ్లు, నాలాలు, ఆరోగ్యశాఖ అధికారులతో చర్చించారు. వర్షా కాలంలో వివిధ ప్రాంతాల్లోని వర్షపాతం నమోదు చేసేందుకు 65 చోట్ల యంత్రాలు ఏర్పాటుచేశారు. 2005లో నగరంలో వరదలు రావడానికి ప్రధాన కారణమైన మిఠీనదిని కూడా శుభ్రం చేసే పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ నదికి ఇరువైపుల అక్రమంగా అనేక గుడిసెలు వెలిశాయి. వర్షా కాలంలో నదికి వరదలు వచ్చే ప్రమాదం ఉండడంతో వాటిని వెంటనే ఖాళీచేయాలని హెచ్చరికలు జారీచేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకు సూచించారు.
గతంలో వర్షాకాలంలో ఎక్కడెక్కడ నీరు నిలిచేది.. మలేరియా, డెంగీ వంటి అంటువ్యాధులు ఎంతమందికి సోకాయి.. తదితర వివరాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో ఉంచుతున్నామని ప్రభు అన్నారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే పాత భవనాల్లో ఉంటున్న పేద కుటుంబాల్లో ఆందోళన మొదలవుతుంది. ఎప్పుడు, ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే సంఘటన స్థలానికి అవసరమైన పరికరాలతో చేరుకునేలా సిద్ధంగా ఉండాలని అగ్నిమాపక శాఖకు సూచించారు. అందుకు అగ్నిమాపక శాఖకు చెందిన ఆరు కమాండింగ్ సెంటర్లను ప్రత్యేకంగా నెలకొల్పారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సామగ్రిని కూడా సమకూర్చారు. నగరంలో కీలకమైన ఆరు సముద్ర తీరాల వద్ద 51 మంది లైఫ్ గార్డులను నియమించారు.