కొత్తగూడెం, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు
♦ కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు కోరిన రాష్ట్ర ప్రభుత్వం
♦ లైన్‌క్లియర్ చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగూడెం డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఏర్పాట్లలో నిమగ్నమైంది. వచ్చే ఏడాది మార్చి కల్లా కొత్తగూడెం ఎయిర్‌పోర్టు పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 2 కల్లా విమానాశ్రయం నిర్మించే ప్రాంతం, దాని విస్తీర్ణం, నమూనా తదితర అంశాలపై స్పష్టత రానుంది. ఎయిర్‌పోర్టును ఎక్కడ నిర్మించాలి.. అందుకు సరిపోయే స్థలం ఒకేచోట ఎక్కడ దొరుకుతుందనే వివరాలు వెంటనే పంపాలంటూ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల విభాగం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కోరింది.
కోల్‌బెల్ట్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శివార్లలో ఇప్పటికే ఓ మిలిటరీ ఎయిర్‌బేస్ ఉంది. దాన్ని ఆనుకునే డొమెస్టిక్ ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దండకారణ్యంలోని ఈ ప్రాంతం మహారాష్ట్ర గడ్చిరోలి సరిహద్దుల్లో ఉంది. కొంత నక్సల్ ప్రభావితం కావడంతో ఇక్కడ ఆర్మీ రాకపోకలకు అనుగుణంగా ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేశారు.
వరంగల్‌కు అడ్డంకిగా జీఎంఆర్
కొత్తగూడెంతో పాటు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్‌ల్లో డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వీటిలో కొత్తగూడెం, ఆదిలాబాద్‌ల్లో విమానాశ్రయాల నిర్మాణానికి అనుమతి లభించింది. ఈ రెండు ప్రాంతాలు రాష్ట్ర రాజధానికి దూరంగా ఉన్నాయి. వరంగల్‌లో డొమెస్టిక్ విమానాశ్రాయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు జీఎంఆర్‌తో చేసుకున్న ఒప్పందాలు అడ్డంకిగా మారినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
వరంగల్‌లోని రంగశాయిపేటలో విమాన రాకపోకలకు అనుగుణంగా ఓ రన్‌వే స్ట్రిప్ ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు వీవీఐపీల కోసమే వినియోగించిన దీన్ని పూర్తిస్థాయి దేశీయ విమానాశ్రయంగా మార్చాలనే ప్రతిపాదన ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ డిస్టెన్స్‌లో 150 కి.మీ. పరిధిలో.. వచ్చే 50 ఏళ్లలో మరో విమానాశ్రయం నిర్మించరాదనేది జీఎంఆర్‌తో ఒప్పంద పత్రాల సారాంశం. దీంతో వరంగల్‌లో పూర్తిస్థాయి ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు జీఎంఆర్ అనుమతి తప్పనిసరి. వరంగల్-హైదరాబాద్‌ను ఇండస్ట్రియల్ కారిడార్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం నేపథ్యంలో వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు ప్రాధాన్యతను సంతరించుకుంది.
బేగంపేటలో ట్రైనింగ్ అకాడమీ
హైదరాబాద్‌లోని బేగంపేటలో వైమానిక కోర్సులు, శిక్షణ, ఎయిర్‌ఫోర్స్ స్టడీస్ కోసం శిక్షణ కేంద్రం నిర్వహించేలా ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 18న ఫ్రెంచ్కు చెందిన అక్విటైన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. బేగంపేటలోని పాత విమానాశ్రయాన్ని ప్రతి ఏటా కేంద్రం నిర్వహించే జాతీయ ఎయిర్‌షోలకు, వీవీఐపీల అవసరాలకు వినియోగించే విధంగా కొనసాగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.