Department of Women
-
అంగన్వాడీలకు ఉద్యోగ విరమణ ప్యాకేజీ!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ అంశం త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం నుంచి సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్పై ప్రత్యేక నిబంధనలేమీ లేవు. ప్రస్తుతం వారికి గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగ విరమణ విషయంలో కూడా విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. ఈ దిశగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వారి రిటైర్మెంట్ ప్యాకేజీ కోసం ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆయా సంఘాల ప్రతినిధులతో పలుమార్లు చర్చించి అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. 53 వేల మంది ఉద్యోగులు.. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసు) ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ఐసీడీఎస్‌లు గ్రామీణ ప్రాంతాల్లో, 25 పట్టణ ప్రాంతాల్లో, మరో 25 ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుకాగా, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 55 వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. ఇందులో 27 వేల మంది టీచర్లు, 25 వేలకు పైగా హెల్పర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మాత్రం 60 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లలో దాదాపు 9 వేల మంది పదవీ విరమణ వయసు దాటిన వారు ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు గతేడాది అంచనా వేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వయసు మీదపడిన వారికి విశ్రాంతి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుప్రీంకోర్టు పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రాట్యుటీ ఇవ్వాలని ఆదేశించించిన నేపథ్యంలో అంగన్వాడీలకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్యాకేజీని రూపొందిస్తోంది. ప్యాకేజీలో ప్రతిపాదించిన ప్రధాన అంశాలు.. ♦ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.2 లక్షలు ఇవ్వాలని శిశుసంక్షేమ శాఖ భావిస్తోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ వేతనాన్ని మాత్రమే ఇస్తున్నందున ఇందులో బేసిక్, డీఏలు ఉండకపోవడంతో గ్రాట్యుటీ లెక్కింపు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాట్యుటీ ఇవ్వడం కుదరనందున టీచర్లకు రూ.2 లక్షల సాయంపై యోచన. ♦అంగన్వాడీ టీచర్ రిటైర్మెంటు తీసుకున్న మరుసటి నెల నుంచి ఆసరా పింఛన్ ఇవ్వాలి. ♦రిటైర్మెంటు తీసుకున్న అంగన్వాడీ టీచర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అంగన్వాడీలో ఉపాధి అవకాశాన్ని కల్పించాలి. ♦అంగన్వాడీ హెల్పర్‌కు రూ.లక్ష సాయంతో పాటు ఇతర అంశాల్లో అంగన్వాడీ టీచర్‌కు అమలు చేసే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా ప్రతిపాదనలను తయారు చేసినట్లు సమాచారం. వీటిని మరింత లోతుగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించాలని ఈ శాఖ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ముఖ్యమంత్రితో సమావేశమై ప్యాకేజీ ఖరారు అయ్యేలా విశదీకరించాలని భావిస్తున్నారు. వచ్చే నెలాఖరులో సీఎం అపాయింట్మెంట్ తీసుకోవాలని మంత్రి భావిస్తున్నట్లు పేషీ వర్గాలు చెబుతున్నాయి. -
అమ్మలా ఆలోచించారు
సాక్షి, అమరావతి: పిల్లల ఆరోగ్యం పట్ల ఒక తల్లి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ముఖ్యమంత్రి జగన్ ఓ మేనమామగా అంతకుమించి ఆలోచిస్తున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని, దీనివల్ల పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇన్ఫెక్షన్ల బారినపడ్డ పిల్లలు తమ సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక ఆందోళనకు గురవడం వల్ల చదువులపై ప్రభావం పడుతుందన్నారు. మంగళవారం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి వనిత మాట్లాడారు. రెండు నెలలకు సరిపడా స్కూళ్లకు స్టాక్ ‘గతంలో స్కూళ్లలో టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు నాడు– నేడు ద్వారా రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్స్ సదుపాయం కల్పించడం వల్ల పిల్లలు నిశ్చింతగా పాఠశాలలకు వస్తున్నారు. విద్య, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో నిర్వహించే స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా 10 లక్షల మంది విద్యార్ధులకు న్యాప్కిన్స్ అందచేస్తాం. ప్రతీ స్కూల్లో నోడల్ ఆఫీసర్ దీనిని పర్యవేక్షిస్తారు. దీంతోపాటు వైఎస్సార్ చేయూత స్టోర్స్ ద్వారా కూడా తక్కువ ధరకే బ్రాండెడ్ న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచుతున్నాం. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, నైన్ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలలకు సరిపడా స్టాక్ ఇప్పటికే స్కూళ్లకు పంపించాం. ముఖ్యమంత్రి జగన్ మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఏడాదికి రూ.1,800 కోట్లు కేటాయిస్తున్నారు. రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దిశ యాప్ తెచ్చి మహిళలకు చక్కటి వరాన్ని ఇచ్చారు. మీరు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద కుటుంబాల్లో వారి తల్లిదండ్రులు ఇవ్వలేనివి పిల్లలకు అందుతున్నాయి’ అని మంత్రి వనిత పేర్కొన్నారు. -
ఆలోచనే ఆరంభం
ఫ్యాప్సీ (ఫెడరేషన్ ఆఫ్ ఏపి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) మహిళా విభాగం ‘ఫ్యాప్సీ ఉమెన్ ఇన్ బిజినెస్’(ఎఫ్‌డబ్ల్యూబి) తొలి అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికయ్యారు వినీత సురానా. ‘వ్యాపార రంగంలో మహిళల భాగస్వామ్యం కోసం మరింత ప్రయత్నిస్తాను’ అంటున్న వినీత అంతరంగం... సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (హైదరాబాద్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ‘‘నేను బాస్‌ను... అనే ఆలోచన నుంచి బయటికి వచ్చి నిన్ను నువ్వు మామూలు ఉద్యోగిగా భావించుకో’’ అని అనడమే కాదు ‘‘నువ్వు మమ్మల్ని ఏ సలహా అడగవద్దు. బాగా కష్టపడు. అలా కష్టపడే క్రమంలోనే నువ్వు అడగకపోయినా ఎన్నో విలువైన సలహాలు నీకు దొరుకుతాయి’’ అన్నారు నాన్న. నిజమే అనిపించింది. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ చేపడితే, నామ్‌కే వాస్తేగా కాకుండా ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని కోణాలలో అధ్యయనం చేసేదానిని. దీనివల్ల పని సులువయ్యేది. అమెరికా, దుబాయ్... ఇలా దాదాపు యాభై దేశాల్లో కంపెనీ తరపున స్టాల్స్, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకోవడం వల్ల ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చింది. నా శైలి ఇది... ప్రతి తరానికి తనదైన ముద్ర ఉంటుంది. అలా నేను కూడా వ్యాపారంలో నాదైన శైలిని చూపాను. ఎప్పుడు చూసినా వ్యాపార జపం చేయడం కాకుండా... ఉద్యోగుల సంతోషం, సంక్షేమం గురించి ఆలోచించేదాన్ని. ఒకప్పుడు ‘వినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యత’ అనేట్లుగా ఉండేది. ఈ తరహా ఆలోచన విధానాన్ని నేను మార్చాను. ‘యజమానులు - ఉద్యోగులు’ అనే దాన్ని పక్కన పెట్టి ‘మనమంతా ఒక కుటుంబం’ అనే భావనను తీసుకొచ్చాను. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాను. ఉద్యోగుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే ఆలస్యం చేయకుండా వాటిని పరిష్కరించడం జరిగింది. అలాగే మా కంపెనీలో ‘ఉమెన్ ఫోరమ్’ను ఏర్పాటు చేసి మహిళా ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా నిలిచాం. ‘ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి’ అనే నా ఆలోచన వృథా పోలేదు. పనిలో నాణ్యత పెరిగింది. లాభాలు ఇరవై శాతం పెరిగాయి! సక్సెస్ మంత్ర సక్సెస్ అనేది అదృష్టంలో ఉండదు. కష్టించడంలో ఉంటుంది అనేమాట వింటాం. అయితే ‘కష్టం’ మాత్రమే సరిపోదు. కాలంతో పాటు మారడం కూడా అత్యవసరం. కాలంతో పాటు వస్తువులు మాత్రమే కాదు... వ్యాపార వ్యూహాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. వాటిని అవగాహన చేసుకోకపోతే పోటీలో వెనకబడిపోతాం. వ్యాపారరంగంలో సురాన కంపెనీ నాలుగు దశాబ్దాలుగా నిలుదొక్కు కుందంటే కాలంతో పాటు వచ్చే మార్పును ఆహ్వానించడమే కారణం. ఆలోచన వస్తేనే ఆరంభం... ‘ఫ్యాఫ్సి ఉమెన్ ఇన్ బిజినెస్ (ఎఫ్‌డబ్ల్యూబి)తొలి అధ్యక్షురాలిగా ఎన్నికకావడం అనేది నాకు లభించిన విలువైన అవకాశంగా భావిస్తున్నాను. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాకు తగిన సహకారం అందించడానికి హామీ ఇచ్చాయి. వారి మద్దతు మా ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. వ్యాపారరంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి... ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వానికి మధ్య ‘ఎఫ్‌డబ్ల్యూబి’ వారధిగా నిలుస్తుంది. వారికి ఎలాంటి సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. మా కార్యక్షేత్రం కేవలం పట్టణాలు మాత్రమే కాదు. గ్రామీణప్రాంతాలకు వెళ్లి మహిళల కోసం వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నాము. ‘ఆలోచన’ వచ్చినప్పుడే ‘ఆరంభం’ మొదలవుతుంది. దురదృష్టవశాత్తు చాలామంది గ్రామీణ మహిళల్లో ‘వ్యాపారంలోకి ప్రవేశించాలి’ అనే ఆలోచన రావడం లేదు. ఇంటి పనికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడానికి వర్క్‌షాప్‌లు కచ్చితంగా ఉపయోగపడతాయి. కుట్టుపని కావచ్చు, ఆర్ట్ కావచ్చు... ఏదైనా సరే, ఏ రంగం అయినా సరే గ్రామీణ మహిళలకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తాం. వర్క్‌షాప్‌లలో ‘మీకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా చేయండి’ ‘వ్యాపారరుణం ఇలా తీసుకోవచ్చు’ ‘ఇలా మార్కెటింగ్ చేస్తే మంచిది’ ఇలా ఎన్నో రకాల సలహాలు ఇవ్వడం, వారికేమైనా సందేహాలు ఉంటే తీర్చడం జరుగుతుంది. లండన్‌లోని ‘మాంచెస్టర్ బిజినెస్ స్కూల్’లో చదువుకున్న పాఠాలు, ‘మోటివేషన్ స్పీకర్’గా నాకు ఉన్న అనుభవాన్ని కూడా వ్యాపారరంగం వైపు గ్రామీణ మహిళలు ఆసక్తి చూపించడానికి ఉపయోగిస్తాను. ‘స్వీయ అభివృద్ధి’ ‘సామాజిక అభివృద్ధి’కి ఫ్యాప్సీ ప్రాధాన్యత ఇస్తుంది. స్వీయ అభివృద్ధి ద్వారా సామాజిక అభివృద్ధి జరుగుతుందనేది మా నమ్మకం. ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాము. నచ్చిన పుస్తకం దేవదత్ పట్నాయక్ రాసిన ‘బిజినెస్ సూత్ర’ పుస్తకం అంటే ఇష్టం. వ్యాపారసూత్రాలను మన పురాణాల ఆధారంగా ఆసక్తికరంగా చెబుతుందీ పుస్తకం. మన పురాణాల్లోని కథలు, ప్రతీకలు, ఆచారసంబంధమైన వ్యవహారాలను తీసుకొని టీకొట్టు నడిపే వ్యక్తి నుంచి పెద్ద వ్యాపారి వరకు ఉపయోగపడేలా పట్నాయక్ ఈ పుస్తకం రాశారు. గొప్ప గొప్ప వ్యాపార సూత్రాలు పాశ్చాత్యపుస్తకాల్లో మాత్రమే లేవని, మన పురాణాల్లో కూడా ఉన్నాయని స్పష్టంగా చెప్పిన పుస్తకం ఇది. ఆమె అంటే ఇష్టం... నేను అభిమానించే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కిరణ్ మజుందార్ షా. ‘బయోకాన్ ఇండియా’ మొదలుపెట్టినప్పుడు విశ్వసనీ యత మొదలు జెండర్ వరకు రకరకాల సమస్యలు ఎదుర్కొన్నారు. వీటితోపాటు సాంకేతిక సమస్యలు సరేసరి. అయితే ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. సమస్యలకు భయపడకుండా వాటిని అధిగమించిన తీరు ఆదర్శనీయం. ఒకదాని కోసం మరొక దాన్ని నష్టపోనక్కర్లేదు. కుటుంబజీవితాన్ని, వ్యాపారజీవితాన్ని సమన్వయపరు చుకోవడంలో కూడా కిరణ్ ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆమె అంటే ఇష్టం.