ఆలోచనే ఆరంభం | The idea of the start | Sakshi
Sakshi News home page

ఆలోచనే ఆరంభం

Published Tue, Jan 13 2015 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

ఆలోచనే ఆరంభం

ఆలోచనే ఆరంభం

ఫ్యాప్సీ (ఫెడరేషన్ ఆఫ్ ఏపి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) మహిళా విభాగం ‘ఫ్యాప్సీ ఉమెన్ ఇన్ బిజినెస్’(ఎఫ్‌డబ్ల్యూబి) తొలి అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికయ్యారు  వినీత సురానా. ‘వ్యాపార రంగంలో మహిళల భాగస్వామ్యం కోసం మరింత ప్రయత్నిస్తాను’ అంటున్న వినీత అంతరంగం...
 
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (హైదరాబాద్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ‘‘నేను బాస్‌ను... అనే ఆలోచన నుంచి బయటికి వచ్చి నిన్ను నువ్వు మామూలు ఉద్యోగిగా భావించుకో’’ అని అనడమే కాదు ‘‘నువ్వు మమ్మల్ని ఏ సలహా అడగవద్దు. బాగా కష్టపడు. అలా కష్టపడే క్రమంలోనే నువ్వు అడగకపోయినా ఎన్నో విలువైన సలహాలు నీకు దొరుకుతాయి’’ అన్నారు నాన్న. నిజమే అనిపించింది. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ చేపడితే, నామ్‌కే వాస్తేగా కాకుండా ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని కోణాలలో అధ్యయనం చేసేదానిని. దీనివల్ల పని సులువయ్యేది. అమెరికా, దుబాయ్... ఇలా దాదాపు యాభై దేశాల్లో కంపెనీ తరపున స్టాల్స్,  ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయడం, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకోవడం వల్ల ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ వచ్చింది.
 
నా శైలి ఇది...
 
ప్రతి తరానికి తనదైన ముద్ర ఉంటుంది. అలా నేను కూడా వ్యాపారంలో నాదైన శైలిని చూపాను. ఎప్పుడు చూసినా వ్యాపార జపం చేయడం కాకుండా... ఉద్యోగుల సంతోషం, సంక్షేమం గురించి ఆలోచించేదాన్ని. ఒకప్పుడు ‘వినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యత’ అనేట్లుగా ఉండేది. ఈ తరహా ఆలోచన విధానాన్ని నేను మార్చాను. ‘యజమానులు - ఉద్యోగులు’ అనే దాన్ని పక్కన పెట్టి ‘మనమంతా ఒక కుటుంబం’ అనే భావనను తీసుకొచ్చాను. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాను. ఉద్యోగుల  నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే ఆలస్యం చేయకుండా వాటిని పరిష్కరించడం జరిగింది. అలాగే మా కంపెనీలో ‘ఉమెన్ ఫోరమ్’ను ఏర్పాటు చేసి మహిళా ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా నిలిచాం. ‘ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి’ అనే నా ఆలోచన  వృథా పోలేదు. పనిలో నాణ్యత పెరిగింది. లాభాలు ఇరవై శాతం పెరిగాయి!
 
సక్సెస్ మంత్ర


సక్సెస్ అనేది అదృష్టంలో ఉండదు. కష్టించడంలో ఉంటుంది అనేమాట వింటాం. అయితే ‘కష్టం’ మాత్రమే సరిపోదు. కాలంతో  పాటు మారడం కూడా అత్యవసరం. కాలంతో పాటు వస్తువులు మాత్రమే కాదు... వ్యాపార వ్యూహాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. వాటిని అవగాహన చేసుకోకపోతే పోటీలో వెనకబడిపోతాం. వ్యాపారరంగంలో సురాన  కంపెనీ నాలుగు దశాబ్దాలుగా  నిలుదొక్కు కుందంటే కాలంతో పాటు వచ్చే మార్పును ఆహ్వానించడమే కారణం.
 
ఆలోచన వస్తేనే ఆరంభం...

‘ఫ్యాఫ్సి ఉమెన్ ఇన్ బిజినెస్ (ఎఫ్‌డబ్ల్యూబి)తొలి అధ్యక్షురాలిగా ఎన్నికకావడం అనేది నాకు లభించిన విలువైన అవకాశంగా భావిస్తున్నాను. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాకు తగిన సహకారం అందించడానికి హామీ ఇచ్చాయి. వారి మద్దతు మా ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

వ్యాపారరంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి... ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వానికి మధ్య ‘ఎఫ్‌డబ్ల్యూబి’ వారధిగా నిలుస్తుంది. వారికి ఎలాంటి సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.
 మా కార్యక్షేత్రం కేవలం పట్టణాలు మాత్రమే కాదు. గ్రామీణప్రాంతాలకు వెళ్లి మహిళల కోసం వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నాము. ‘ఆలోచన’ వచ్చినప్పుడే ‘ఆరంభం’ మొదలవుతుంది. దురదృష్టవశాత్తు చాలామంది గ్రామీణ మహిళల్లో ‘వ్యాపారంలోకి ప్రవేశించాలి’ అనే ఆలోచన రావడం లేదు. ఇంటి పనికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడానికి  వర్క్‌షాప్‌లు కచ్చితంగా ఉపయోగపడతాయి.

కుట్టుపని కావచ్చు, ఆర్ట్ కావచ్చు... ఏదైనా సరే, ఏ రంగం అయినా సరే గ్రామీణ మహిళలకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తాం. వర్క్‌షాప్‌లలో ‘మీకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా చేయండి’ ‘వ్యాపారరుణం ఇలా తీసుకోవచ్చు’ ‘ఇలా మార్కెటింగ్ చేస్తే మంచిది’ ఇలా ఎన్నో రకాల సలహాలు ఇవ్వడం, వారికేమైనా  సందేహాలు ఉంటే తీర్చడం జరుగుతుంది. లండన్‌లోని  ‘మాంచెస్టర్ బిజినెస్ స్కూల్’లో చదువుకున్న పాఠాలు, ‘మోటివేషన్ స్పీకర్’గా నాకు ఉన్న అనుభవాన్ని కూడా వ్యాపారరంగం వైపు గ్రామీణ మహిళలు ఆసక్తి చూపించడానికి ఉపయోగిస్తాను.

 ‘స్వీయ అభివృద్ధి’ ‘సామాజిక అభివృద్ధి’కి ఫ్యాప్సీ ప్రాధాన్యత ఇస్తుంది. స్వీయ అభివృద్ధి ద్వారా సామాజిక అభివృద్ధి జరుగుతుందనేది మా నమ్మకం. ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాము.
 
నచ్చిన పుస్తకం


దేవదత్ పట్నాయక్ రాసిన ‘బిజినెస్ సూత్ర’ పుస్తకం అంటే ఇష్టం. వ్యాపారసూత్రాలను మన పురాణాల ఆధారంగా ఆసక్తికరంగా చెబుతుందీ పుస్తకం. మన పురాణాల్లోని కథలు, ప్రతీకలు, ఆచారసంబంధమైన వ్యవహారాలను  తీసుకొని  టీకొట్టు నడిపే  వ్యక్తి నుంచి పెద్ద వ్యాపారి వరకు ఉపయోగపడేలా పట్నాయక్ ఈ పుస్తకం రాశారు. గొప్ప గొప్ప వ్యాపార సూత్రాలు పాశ్చాత్యపుస్తకాల్లో మాత్రమే లేవని, మన పురాణాల్లో కూడా ఉన్నాయని స్పష్టంగా చెప్పిన పుస్తకం ఇది.
 
ఆమె అంటే ఇష్టం...

నేను అభిమానించే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ కిరణ్ మజుందార్ షా. ‘బయోకాన్ ఇండియా’ మొదలుపెట్టినప్పుడు విశ్వసనీ యత మొదలు జెండర్ వరకు రకరకాల సమస్యలు ఎదుర్కొన్నారు. వీటితోపాటు సాంకేతిక సమస్యలు  సరేసరి. అయితే ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. సమస్యలకు భయపడకుండా వాటిని అధిగమించిన తీరు ఆదర్శనీయం. ఒకదాని కోసం మరొక దాన్ని నష్టపోనక్కర్లేదు. కుటుంబజీవితాన్ని, వ్యాపారజీవితాన్ని సమన్వయపరు చుకోవడంలో కూడా కిరణ్ ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆమె అంటే ఇష్టం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement