ఆర్టీసీ డ్రైవర్లు డిపో సమీపంలో నివాసం ఉండాలి
హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్లు డ్యూటీ మొదలుపెట్టేముందు బస్సులను క్షుణ్నంగా పరిశీలించుకోవాలని, ఇందుకోసం వారు డిపో చేరువలో నివాసం ఉండాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (అడ్మిన్) సత్యనారాయణ పేర్కొన్నారు. అలాగే డిపోల పర్సనల్ సూపర్వైజర్లు కార్మికుల సంక్షేమ కార్యక్రమాల వివరాలను వారికి ఎప్పటికప్పుడు తెలిపి వాటిని వాడుకునేలా చూడాలని అన్నారు.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం హకీంపేటలోని ఆర్టీసీ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ మహిళా కండక్టర్లకు నిర్వహిస్తున్న కరాటే తరగతులు, పర్సనల్ సూపర్వైజర్స్ జూనియర్ అసిస్టెంట్స్ శిక్షణ తరగతులను పరిశీలించారు. ఆయనకు ట్రాన్స్పోర్ట్ అకాడమీ ప్రిన్సిపల్ కిరణ్ శిక్షణల గురించి వివరించారు.